Vadodara Bridge Collapse: వడోదర బ్రిడ్జి ఘటన.. నదిలో కొడుకు కోసం వెక్కి వెక్కి ఏడ్చిన తల్లి
ABN , Publish Date - Jul 10 , 2025 | 07:33 AM
Vadodara Bridge Collapse: ఈ ప్రమాదంలో చనిపోయిన మిగిలిన 12 మంది కుటుంబాలు కూడా శోక సంద్రంలో మునిగిపోయాయి. కాగా, గంభీర బ్రిడ్జిని దాదాపు 40 ఏళ్ల క్రితం నిర్మించారు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఓ కన్‌స్ట్రక్షన్ కంపెనీ దాన్ని నిర్మించింది.
గుజరాత్‌లోని వడోదరలో మహీ సాగర్ నదిపై ఉన్న గంభీర బ్రిడ్జి కూలిన సంగతి తెలిసిందే. బుధవారం ఉదయం ఈ విషాదం చోటుచేసుకుంది. బ్రిడ్జి ఒక్కసారిగా కుప్పకూలటంతో బ్రిడ్జిపై వెళుతున్న వాహనాలు కొన్ని నదిలో పడిపోయాయి. దీంతో పలువురు మృత్యువాతపడ్డారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 13 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషాదానికి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వాటిలో ఓ వీడియో నెటిజన్లను కంటతడి పెట్టిస్తోంది.
నీటిలో మునిగిపోయిన తన కొడుకు కోసం ఓ తల్లి వెక్కి వెక్కి ఏడుస్తున్న దృశ్యాలు అందులో ఉన్నాయి. కొడుకు గురించి తెలియగానే.. ఏ మాత్రం ఆలోచించకుండా ఆ మహిళ నదిలోకి దిగింది. నీళ్ల మధ్యలో కొడుకు కోసం గంటకుపైగా వెతికింది. ‘కొడుకా.. కొడుకా’ అంటూ కన్నీరుమున్నీరుగా విలపించింది. తన కొడుకును కాపాడాలంటూ జనాన్ని ప్రాధేయపడింది. ఆమె ఏడుపు బ్రిడ్జిపై నుంచి వీడియో తీస్తున్న వారికి కూడా స్పష్టంగా వినిపిస్తోంది. మరో వీడియోలో ఆమె నది తీరంలో ఉంది. నదిలోకి వెళ్లడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. పోలీసులు, స్థానికులు ఎంత ప్రయత్నించినా ఆమె వినలేదు.
ఎంతో కష్టం మీద కుటుంబసభ్యులు ఆమెను ఒప్పించి అక్కడినుంచి తీసుకెళ్లారు. ఈ ప్రమాదంలో చనిపోయిన మిగిలిన 12 మంది కుటుంబాలు కూడా శోక సంద్రంలో మునిగిపోయాయి. కాగా, గంభీర బ్రిడ్జిని దాదాపు 40 ఏళ్ల క్రితం నిర్మించారు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఓ కన్‌స్ట్రక్షన్ కంపెనీ దాన్ని నిర్మించింది. మహీ సాగర్ నది చుట్టు పక్కల ఉండే చాలా ఊర్లకు చెందిన ప్రజలు ఈ బ్రిడ్జినే వాడుతున్నారు. మరీ ముఖ్యంగా ఆనంద్, పండ్ర గ్రామాల వారికి ఈ బ్రిడ్జే ప్రధాన మార్గం. ఈ బ్రిడ్జి ద్వారా పక్క ఊరికి వెళితే 16 కిలోమీటర్ల ప్రయాణం తగ్గుతుంది.
ఇవి కూడా చదవండి
రాజకీయాలను ఆస్వాదించలేకపోతున్నా: కంగన