Fire: అక్కడివారు నిప్పుతో చెలగాటమాడుతారంటే నమ్ముతారా..
ABN , Publish Date - Oct 26 , 2025 | 01:26 PM
కొన్ని సంప్రదాయాలు ఆహ్లాదకరంగా ఉండి ఆనందాన్నిస్తే... మరికొన్ని భయంగొల్పే విధంగా కనిపిస్తాయి. యూకేలోని ఒట్టేరి సెయింట్ మేరీ గ్రామంలో జరిగే ‘బ్యారెల్ బర్నింగ్ ఫెస్టివల్’ రెండో కోవకు చెందినదే. స్థానికులు అగ్నిగోళంలా మండుతున్న బ్యారెల్స్‌ను వీపుపై మోసుకుంటూ వీధుల్లో పరుగెడుతుంటే.. చూపరులకు ముచ్చెమటలు పడతాయి. కొన్ని వందల ఏళ్లనాటి సంప్రదాయ విశేషాలివి...
కొన్ని సంప్రదాయాలు ఆహ్లాదకరంగా ఉండి ఆనందాన్నిస్తే... మరికొన్ని భయంగొల్పే విధంగా కనిపిస్తాయి. యూకేలోని ఒట్టేరి సెయింట్ మేరీ గ్రామంలో జరిగే ‘బ్యారెల్ బర్నింగ్ ఫెస్టివల్’ రెండో కోవకు చెందినదే. స్థానికులు అగ్నిగోళంలా మండుతున్న బ్యారెల్స్‌ను వీపుపై మోసుకుంటూ వీధుల్లో పరుగెడుతుంటే.. చూపరులకు ముచ్చెమటలు పడతాయి. కొన్ని వందల ఏళ్లనాటి సంప్రదాయ విశేషాలివి...
తారు పూసిన డ్రమ్ములు అగ్నిగోళాల్లా మండుతుంటాయి. ఆ వేడికి వాటి దగ్గరకు కూడా వెళ్లలేని పరిస్థితి ఉంటుంది. అలాంటి అగ్నితో కూడిన డ్రమ్ములను వీపుపై పెట్టుకుని వీధుల్లో పరుగెడుతుంటారు స్థానికులు. యూకేలోని ఒట్టేరి సెయింట్ మేరీ గ్రామంలో ప్రతి ఏటా నవంబర్ 5న జరిగే ఈ ఉత్కంఠభరిత వేడుకను చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో సందర్శకులు వెళ్తుంటారు.

17వ శతాబ్దంలో ప్రారంభం...
బ్రిటిష్ సంప్రదాయాలలో అత్యంత విచిత్రమైన సంప్రదాయం ‘బ్యారెల్ బర్నింగ్ ఫెస్టివల్’. దీన్ని సదరు గ్రామస్థులు నేటికీ కొనసాగిస్తుండటం విశేషం. సంప్రదాయంలో భాగంగా అక్కడి చాలా గ్రామాల్లో బ్యారెల్స్‌కు నిప్పు అంటించి వీధుల్లో దొర్లించుకుంటూ తీసుకెళతారు. కానీ ఒట్టేరి సెయింట్ మేరీ గ్రామస్థులు మాత్రం ఆ బ్యారెల్స్‌ను భుజాలపై మోస్తూ వీధుల్లో పరుగెడుతారు. ఈ వినూత్న సంప్రదాయం 17వ శతాబ్దంలో ప్రారంభమైందని విశ్లేషకులు చెబుతారు. 1605 నవంబర్ 5న పార్లమెంట్ భవనాలను పేల్చివేయడానికి జరిపిన కుట్రను ‘గన్‌పౌడర్ ప్లాట్’ అని పిలుస్తారు. ఈ కుట్రను ఒకరోజు ముందే చేధించారు. ఈ గన్‌పౌడర్ ప్లాట్‌కి, బ్యారెల్ బర్నింగ్ ఫెస్టివల్‌కు లింక్ ఉన్నట్టు పరిశోధకులు చెబుతారు. బ్యారెల్ మోసేవారిని ‘బ్యారెల్ రోలర్స్’ అని పిలుస్తారు.

కార్నివాల్‌లో భాగం
ఒట్టేరిలోని ప్రతీ సెంట్రల్ పబ్లిక్ హౌజ్ వేడుక కోసం ఒక్కో బ్యారెల్‌ని విరాళంగా అందిస్తుంది. అలా సేకరించిన బ్యారెల్స్‌ను వేడుకకు కొన్ని వారాల ముందే తారులో నానబెడతారు. బ్యారెల్ బాగా మండేందుకు ఇలా చేస్తారు. వేడుక రోజు బ్యారెల్‌కు నిప్పంటించిన తరువాత స్థానికుల వీపుపై పెడతారు. తరువాత వాళ్లు ఆ బ్యారెల్స్‌తో వీధుల గుండా, ఇరుకైన సందుల గుండా ఎంతో సాహసోపేతంగా పరుగెడుతూ ప్రేక్షకులకు కనువిందు చేస్తారు. జనం మధ్య ఈ ప్రక్రియ రిస్క్‌తో కూడుకున్నదే అయినా ఎంతో ఇష్టంగా బ్యారెల్స్‌ను మోస్తుంటారు. ప్రమాదకరమైన ఈ ఫీట్‌ని చూసేందుకు స్థానికులతో పాటు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు తరలివస్తుంటారు. సాయంత్రం మొదలయ్యే ఈ వేడుకను చూసేందుకు పిల్లలు, పెద్దలు, మహిళలు అనే తేడా లేకుండా అందరూ వస్తారు. పిల్లలు, మహిళలు చిన్న చిన్న పీపాలు మోసుకెళతారు. పురుషులు మాత్రం 30 కిలోలదాకా బరువుండే బ్యారెల్స్‌ను మోస్తారు.

బ్యారెల్స్‌ను మోసే క్రమంలో ఒకరి నుంచి మరొకరికి అందిస్తుంటారు. స్థానికులు అంటే అక్కడ పుట్టిన వారు లేక చాలా ఏళ్లుగా ఆ గ్రామంలో నివసిస్తున్న వారు మాత్రమే ఆ బ్యారెల్స్‌ను మోస్తారు. వేడుకను చూసేందుకు వచ్చిన పర్యాటకులు లేక ఇతర గ్రామస్థులు మోసేందుకు అనుమతించరు. ఒకసారి బ్యారెల్‌కు నిప్పంటించిన తరువాత అది పూర్తిగా కాలే వరకు వేడుక కొనసాగుతుంది. చివరగా అన్ని బ్యారెల్స్‌ను ఒట్టేర్ నది ఒడ్డుకు తీసుకెళ్లడంతో వేడుక ముగుస్తుంది. ఏటా అక్కడ జరిగే కార్నివాల్‌లో అంతర్భాగంగా ఈ వేడుకను జరుపుకొంటారు. మన దగ్గర కొన్ని ప్రాంతాల్లో నిప్పుల గుండంలో పరుగెత్తే సంప్రదాయం ఉందిగానీ, నిప్పులు కక్కుతున్న బ్యారెల్స్‌ను వీపు మీద మోయడమంటే... ఒకరకంగా నిప్పుతో చెలగాటమే కదా!