ఈ దీవి వైపు.. పర్యాటకుల చూపు..
ABN , Publish Date - Mar 16 , 2025 | 09:56 AM
ఆ దీవికి పర్యాటకుల తాకిడి పెరిగింది. నిత్యం వేలాది మంది పర్యాటకులు విచ్చేస్తుండడంతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది.

థాయ్‌లాండ్ అనగానే పుకెట్ మాత్రమే చాలామందికి తెలుసు. అయితే ఇటీవలి కాలంలో అక్కడి ‘కో సముయ్’ దీవి వైపు పర్యాటకులు చూస్తున్నారు. అందమైన బీచ్‌లు, చూడచక్కని దేవాలయాలు, ప్రకృతి సహజ సౌందర్యం, రాతి కొండలు... యువతరాన్ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఆన్‌లైన్ ట్రావెల్ ప్లాట్‌ఫామ్ ‘అగోడా’ ప్రకారం ఈ దీవి కోసం వెదుకుతున్న పర్యాటకుల సంఖ్య గత ఏడాదితో పోల్చితే 50 శాతం పెరిగింది. ఇంతకీ ‘కో సముయ్’ ప్రత్యేకత ఏమిటి?
ఇటీవల కాలంలో భారతీయ పర్యాటకులను థాయ్‌లాండ్ బాగా ఆకర్షిస్తోంది. వీసా ఫ్రీ పర్యాటకాన్ని అందిస్తోంది. 60 రోజుల వీసా ఫ్రీ కన్నా ఎక్కువ రోజులు ఉండాలంటే.. ఈ- వీసా విధానాన్ని కూడా అందు బాటులోకి తెచ్చింది.
అత్యంత సుందరమైన బీచ్‌లకు ‘కో సముయ్’ కేరాఫ్‌గా చెప్పవచ్చు. ఇక్కడి చావెంగ్ బీచ్, లమాయ్ బీచ్, మీనమ్ బీచ్‌ల్లో విదేశీయులు అధికసంఖ్యలో సేదతీరుతూ కనిపిస్తారు. ఇవి అత్యంత స్వచ్ఛమైనవి. ఈ బీచుల్లో అడ్వెంచర్ గేమ్స్‌ను పర్యాటకులు ఎంజాయ్ చేస్తారు.
థాయ్‌లాండ్‌లో కో యావో, కో తావో, కో లాంటా, పుకెట్ వంటి అనేక ద్వీపాలున్నాయి. వాటిలో పుకెట్ తర్వాత అత్యంత ఆకర్షణీయమైన పెద్ద ద్వీపం ‘కో సముయ్’. విదేశీయులతో పాటు భారతీయులు కూడా అక్కడికి వెళ్లేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.
ఇక్కడి రెయిన్ ఫారెస్ట్‌లో ఉన్న ‘నా మ్యువాంగ్’ జలపాతం పర్యాటకులకు ఉల్లాసాన్ని అందిస్తుంది. 80 మీటర్ల పై నుంచి భూమ్మీదికి జారిపడే జలపాతం దగ్గర ఈత కొడుతూ ఆనందిస్తారు.
ఇక్కడ అతి పెద్ద బౌద్ధ ఆలయం ‘ వాట్ ప్రా యాయ్’ మరో గొప్ప ఆకర్షణ. 39 అడుగుల బుద్ధుడి విగ్రహం బంగారు వర్ణంలో మెరిసిపోతుంది. 1972లో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. పర్యాటకులు దీనిని తప్పక సందర్శిస్తారు.
ప్రముఖ థాయ్ కళాకారుడు జరిత్ ఫుమ్‌డోమింగ్ రూపొందించిన ఆధునిక బౌద్ధ ఆలయం ‘వాట్ ప్లై లామ్’. ఈ ఆలయ రూపకల్పనలో చైనీస్, థాయ్ సంప్రదాయాలు కనిపిస్తాయి. ఇక్కడ ఉన్నది గౌతమ బుద్ధుడి విగ్రహం కాదు... బోధిసత్వుడైన అవలోకితేశ్వరుడి రూపం. దీనిని అక్కడ ‘కండి’ అని పిలుస్తారు. పద్దెనిమిది చేతులతో శ్వేత రూపంలో ఉంటుంది.