ఈ నీళ్లు... కూసింత ప్రత్యేకం
ABN , Publish Date - Mar 16 , 2025 | 02:17 PM
ఎండాకాలం.. రోజు రోజుకీ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. విపరీతంగా దాహం వేస్తోంది. గటాగటా నీళ్లు తాగాలనే అనిపిస్తోంది. దాహార్తికి తప్పకుండా మంచి నీళ్లే శరణ్యం. నిమ్మరసం, మజ్జిగ వంటి సాంప్రదాయ పానీయాలు వేడికి ఉసూరుమంటున్న ప్రాణానికి ఉపశమనాన్ని అందిస్తాయి.

మిగతా కాలాల్లో మంచినీళ్లని పట్టించుకోని వారు కూడా ఎండాకాలం వచ్చిందంటే... ‘దాహం దాహం’ అంటుంటారు. ఈ కాలంలో గొంతులో కొన్ని నీళ్లు పడితే గానీ స్థిమితంగా ఉండలేం. కుళాయి నీళ్లు, మినరల్ వాటర్ సాధారణమే. తాగే నీళ్లు కూడా రంగు, రుచీ, వాసనతో ఉండాలనుకుంటున్నారు చాలామంది. అలాగని ఆరోగ్యానికి హాని చేసే కూల్‌డ్రింక్స్ కాకుండా, ఆరోగ్యాన్నిచ్చే ‘ఇన్‌ఫ్యూజ్డ్’ వాటర్ వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ నీటితో రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.
ఎండాకాలం.. రోజు రోజుకీ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. విపరీతంగా దాహం వేస్తోంది. గటాగటా నీళ్లు తాగాలనే అనిపిస్తోంది. దాహార్తికి తప్పకుండా మంచి నీళ్లే శరణ్యం. నిమ్మరసం, మజ్జిగ వంటి సాంప్రదాయ పానీయాలు వేడికి ఉసూరుమంటున్న ప్రాణానికి ఉపశమనాన్ని అందిస్తాయి. అయితే అవే నీళ్లలో కాస్త పుదీనా, నిమ్మరసం, పుచ్చకాయ లేదా స్ట్రాబెర్రీ ముక్క కలిపి తాగితే ఆ రుచి, పరిమళమే వేరు. ఏదో మ్యాజిక్ చేసినట్టుగా నీళ్ల రుచి మారుతుంది. ఇలా పళ్లు, కూరగాయల ముక్కలు, మూలికలు చేరుస్తూ నీళ్ల సుగుణాలను, లవణాలను పెంచడమే ‘ఇన్‌ఫ్యూజ్డ్’ వాటర్ మహత్యం. పోషకాలు, లవణాలున్న ఈ నీళ్లని వేసవి తాపానికి చక్కని పరిష్కారంగా ఆహార నిపుణులు పేర్కొంటున్నారు.
శరీరంలో నీటి శాతాన్ని తగ్గకుండా చూడడం ఎంతో అవసరం. జీవనక్రియకు మూలాధారం మంచినీళ్లే. శరీరం ఉత్తేజభరితంగా ఉండటానికి, శక్తిసామర్థ్యాలను పెంచేందుకు ప్రాథమికంగా అవసరమైనదీ నీళ్లే. అందుకే శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూడాలి. లేకపోతే డీహైడ్రేషన్ అవుతుంది. అనారోగ్యం దరిచేరుతుంది. వేసవి కాలంలో ఈ సమస్య మరీ ఎక్కువ. ఎండ వేడికి స్వేదగ్రంథుల ద్వారా నీళ్లు బయటికి వెళతాయి. శరీరానికి ఎప్పటికప్పుడు నీళ్లని అందించడం అవసరం. తక్షణ ఉపశమనం కోసం సోడాలు, కూల్‌డ్రింకుల మీదకి మనసు మళ్లుతుంది. కానీ ఇవి ఆరోగ్యానికి హానికరం. వాటికి ప్రత్యామ్నాయంగా ఇన్‌ఫ్యూజ్డ్ నీళ్లని తీసుకుంటే సర్వత్రా శ్రేయస్కరమని అంటున్నారు పోషకాహార నిపుణులు. ఇన్‌ఫ్యూజ్డ్ అంటే... ఇష్టమైన పళ్లు, కూరగాయలు, మూలికలను ముక్కలుగా చేసి ఓ వెడల్పాటి గాజు మగ్గులోని నీళ్లలో వేసి ఉంచాలి. కొన్ని ఐస్‌క్యూబ్‌లూ వేసి పెట్టాలి. కాసేపటి తరవాత ఆ నీటిని తాగితే నీళ్ల రంగే కాదు, రుచీ అద్భుతం. ఈ నీళ్లలో పళ్లు, కూరగాయలు నానడం వల్ల ఔషధ గుణాలూ చేరతాయి. అయితే పళ్లు, కూరగాయల రకాలని బట్టి నీళ్లలో వాటిని నానబెట్టే సమయం ఆధారపడి ఉంటుంది.
అనేక రకాలు...
ఇన్‌ఫ్యూజ్డ్ నీళ్లను ఇంటిలోనే సులభంగా, తక్కువ బడ్జెట్‌తో చేసుకోవచ్చు. వీటికి సంబంధించిన రెసిపీలను ఇట్టే ఫాలో కావొచ్చు.
బ్లూబెర్రీ ఆరెంజ్ వాటర్ : రెండు సంత్రాలను ఒలిచి, పెద్ద గాజు సీసాలో వేయాలి. ఇందులోనే అర కప్పు బ్లూ బెర్రీలను వేసి సీసాను నీటితో నింపి, రెండు గంటల పాటు ఫ్రిజ్‌లో ఉంచి ఆ తర్వాత తాగాలి.
స్ట్రాబెర్రీ, నిమ్మ, కీరా, పుదీనా: కప్పు స్ట్రాబెర్రీలు, కప్పు కీరా, రెండు నిమ్మకాయలను ముక్కలుగా కోయాలి. పావు కప్పు పుదీనా ఆకులను చిన్నగా తుంచి గాజు సీసా అడుగున వేయాలి. పండ్ల ముక్కలను పైన వేసి సీసా అంతా ఐసు గడ్డలు, చల్లటి నీళ్లతో నింపేయాలి. పది నిమిషాల తరవాత చల్లగా తాగొచ్చు.
పుచ్చకాయ, తులసి ఆకులు: కప్పు పుచ్చకాయ ముక్కలు, కొన్ని తాజా తులసి ఆకులు, చల్లని నీళ్లు, ఐస్‌క్యూబ్‌లను ఓ వెడల్పాటి గాజు సీసాలో వేసి గంట పాటు ఫ్రిజ్‌లో ఉంచి, ఆ తరవాత తాగితే ఆ రుచే వేరు.
పైన పేర్కొన్న విధంగా ఇష్టమైన పళ్లు, కూరగాయలు, మూలికలతో రకరకాల ఇన్‌ఫ్యూజ్డ్ వాటర్‌ను తయారుచేసుకోవచ్చు. అయితే పండ్లని మాత్రం జాగ్రత్తగా కడగాలి. శుభ్రమైన కత్తితోనే వాటిని కత్తిరించాలి. అలాగే శుభ్రమైన నీటినే వినియోగించాలి. కేవలం వేసవి ఉపశమనం కోసమే కానీ ఇతర అనార్యోగాలను ఆహ్వానించడానికి ఈ నీటిని తయారుచేయడం లేదన్నది మర్చిపోకూడదు. ఈ నీళ్లని ఫ్రిజ్‌లో ఉంచి, ఎప్పుడు తాగాలనిపిస్తే అప్పుడు తాగవచ్చు. అయితే కత్తిరించిన పళ్ల ముక్కలు ఉండడం వల్ల, అవి చెడిపోక ముందే అంటే తయారుచేసిన రోజే తాగడం ఆరోగ్యకరం.
ప్రయోజనాలు ఎన్నో...
ఇళ్లలో తయారుచేసుకునే నీళ్లే కాబట్టి వీటి పోషక విలువల గురించి అంతగా చెప్పలేం. కానీ ఈ నీటి వల్ల కలిగే లాభాలు మాత్రం ఎక్కువే.
డీహైడ్రేషన్ నివారణ: చాలామంది రోజువారీ పనుల్లో పడి, తగిన మోతాదులో నీటిని తీసుకోవడం మరచిపోతున్నారు. దీంతో డీహైడ్రేషన్‌కి గురవుతారు. ఇది రక్తవిరేచనాలు, వాంతులు, జ్వరం తదితర అనారోగ్యాలకు దారితీస్తోంది. కాబట్టి ఎప్పటికప్పుడు సరిపడా నీటిని తాగడం మంచిది. మంచినీళ్లతో పాటు ఇన్‌ఫ్యూజ్డ్ వాటర్‌ని తాగడం వల్ల శరీరానికి తగినన్ని పోషకాలు, లవణాలు అందుతాయి. జీవనక్రియలు సాఫీగా జరుగుతాయి.
బరువుకు చెక్: మీరు కూల్‌డ్రింక్స్ ప్రియులా? తక్షణం చక్కెర ఎక్కువగా ఉండే ఆ ద్రావణాలను మానేసి ఇన్‌ఫ్యూజ్డ్ నీళ్లని తాగడం మొదలు పెట్టండి. ఇలా చేయడం వల్ల చక్కెర, కార్బోహైడ్రేట్స్‌ను తగ్గించడమే కాదు బరువు నియంత్రణకూ తోడ్పడినట్టు అవుతుంది.
మధుమేహులకు: షుగర్ తదితర వ్యాధులతో బాధపడుతున్న వాళ్లు, క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్న వాళ్లకు ఇన్‌ఫ్యూజ్డ్ నీళ్లు తాగమని ఆహార నిపుణులు సలహా ఇస్తుంటారు. ఈ పేషెంట్లు ఉపయోగించే కొన్ని రకాల మందుల వల్ల వాళ్లకి తెలియకుండానే డీహైడ్రేషన్‌కి గురవుతున్నారు. ఇటువంటి వాళ్లకి ఈ నీళ్లు పెద్ద ఉపశమనం.
శరీరంలో నీళ్లు లేకపోతే అనేక సమస్యలు ఉత్పన్నం అవుతాయి. అందులోనూ వేసవిలో ఎప్పుడూ శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచాలి. ఇన్‌ఫ్యూజ్డ్ నీళ్లని తయారుచేసేప్పుడు పళ్లు, నీళ్ల నాణ్యతలో రాజీ పడకూడదు. పండ్లని బాగా కడగాలి. తాగే నీళ్లు కూడా పరిశుభ్రంగా ఉండాలి. సాధారణంగా ఇన్‌ఫ్యూజ్డ్ నీళ్ల వల్ల రెండు రకాల నష్టం వాటిల్లుతుందని పరిశోధకులు తెలియజేస్తున్నారు. అవేమిటంటే...
ఫుడ్ పాయిజనింగ్: ప్రత్యేకమైన ఈ నీటి తయారీ సమయంలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా నీటి రుచి మారుతుంది. అనారోగ్యాన్ని కలిగిస్తుంది. చేదుగా ఉన్న కూరగాయలు, పండ్లని వాడొద్దు.
దంతాల ఎనామిల్ విషయంలో: సిట్రస్ పళ్లు ఎక్కువగా ఉంటే దంతాల మీది ఎనామిల్ తొలిగే ప్రమాదం ఉంది. ఆ పళ్లలో ఉండే ఆమ్లాలు పళ్లకు మెరుపునిచ్చే ఎనామిల్‌ను తొలగిస్తాయి. దంతక్షయాన్ని కూడా ఏర్పరిచే అవకాశం లేకపోలేదు. అందుకే ఎప్పుడూ సిట్రస్ జాతికి చెందిన పండ్లే కాకుండా ఇతరత్రా పండ్లను వాడడం మంచిది.
ఈ మధ్య కాలంలో సోషల్ ఇన్‌ఫ్లూయెన్సర్లు, లైఫ్‌స్టెయిల్ బ్లాగర్లు, వైద్యనిపుణలు, క్యాన్సర్ సంబంధిత పరిశోధకులు... సోషల్ మీడియాలో మంచినీళ్లతో పాటు ఇన్‌ఫ్యూజ్ట్ నీళ్లూ తాగమని బాగా ప్రచారం చేస్తున్నారు. ప్రతి వేసవిలో ఈ ప్రచారం మరీ ఎక్కువవుతుంది. దాంతో యువతరం ‘ఇన్‌ఫ్యూజ్డ్’ నీళ్లు తాగేందుకు ఇష్టపడుతున్నారు. సాదా నీళ్ల కన్నా పోషకాలు, లవణాలు అధికంగా ఉన్న ఈ తరహా పానీయాలు మంచిదే కదా.
రోజంతా హుషారు
పళ్ల ముక్కలు కలగలిసిన ఇన్‌ఫ్యూజ్డ్ నీళ్లతో ఉదయాల్ని మొదలుపెడితే రోజంతా హుషారుగా ఉండడమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. నీళ్లు తాగడం వల్ల బరువు నియంత్రణలో ఉండడంతో పాటు, జీవక్రియ కూడా చక్కగా జరుగుతుంది. అందుకే ఉదయం పూట ఓ గ్లాసు, రాత్రి, పగలు భోజనాలకు ముందు ఓ గ్లాసు ఇన్‌ఫ్యూజ్డ్ నీళ్లు తాగడం మంచిదని డైటీషియన్లు పేర్కొంటున్నారు.