Man Bites 12 Year Old: లిఫ్ట్‌లో బాలుడిపై దారుణం.. మృగంలా కొట్టి, కొరికి..
ABN , Publish Date - Jul 10 , 2025 | 02:01 PM
Man Bites 12 Year Old: లిఫ్ట్ లోపలికి అడుగుపెట్టగానే కైలాష్ రెచ్చిపోయాడు. బాలుడి చెంపపై పలుమార్లు గట్టిగా కొట్టాడు. పక్కన ఉన్న మహిళ ఎంత ఆపినా ఆగలేదు. బాలుడి చేతిని కూడా కొరికాడు. లిఫ్ట్‌లోంచి బయటకు వచ్చిన తర్వాత కూడా బాలుడిపై దాడికి దిగాడు.
మహారాష్ట్రలోని థానే జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తనకోసం లిఫ్ట్ డోర్ ఆపలేదన్న కోపంతో ఓ వ్యక్తి చిన్న పిల్లాడిపై దాడికి దిగాడు. అత్యంత క్రూరంగా వ్యవహరించాడు. పిల్లాడిని ఇష్టం వచ్చినట్లు కొట్టటమే కాకుండా.. కొరికి తన కోపాన్ని తీర్చుకున్నాడు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. 12 ఏళ్ల ఓ బాలుడు అంబర్‌ఈస్ట్‌లోని ఓ భవంతిలో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయంలో ట్యూషన్‌కు వెళ్లడానికి 14వ అంతస్తులో లిఫ్ట్ ఎక్కాడు. లిఫ్ట్ 9వ అంతస్తులోకి వచ్చి ఆగింది.
కైలాష్ తవానీ అనే వ్యక్తి .. ఓ మహిళతో కలిసి లిఫ్ట్ ఎక్కడానికి తలుపు దగ్గరకు వచ్చాడు. లోపల ఉన్న బాలుడికి వారు సరిగా కనిపించలేదు. లిఫ్ట్ డోర్ క్లోజ్ చేశాడు. కైలాష్ వెంటనే బయట ఉన్న లిఫ్ట్ డోర్ తెరుచుకునే బటన్ నొక్కాడు. డోర్ ఓపెన్ అయింది. కైలాష్, ఆ మహిళ లోపలికి వచ్చారు. లిఫ్ట్ లోపలికి అడుగుపెట్టగానే కైలాష్ రెచ్చిపోయాడు. బాలుడి చెంపపై పలుమార్లు గట్టిగా కొట్టాడు. పక్కన ఉన్న మహిళ ఎంత ఆపినా ఆగలేదు. బాలుడి చేతిని కూడా కొరికాడు. ‘కిందకు రా చంపేస్తా’ అంటూ వార్నింగ్ ఇచ్చాడు. లిఫ్ట్‌లోంచి బయటకు వచ్చిన తర్వాత కూడా బాలుడిపై దాడికి దిగాడు.
అక్కడున్న వాళ్లు కైలాష్‌ను అడ్డుకుని బాలుడ్ని అక్కడినుంచి పంపేశారు. బాలుడు నేరుగా ఇంటికి వెళ్లి తల్లికి విషయం చెప్పాడు. ఆమె శివాజీ నగర్ పోలీసులకు దీనిపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం సంఘటనకు సంబంధించిన సీసీటీవీ కెమెరాల ఫుటేజీల తాలూకా దృశ్యాలు వైరల్‌గా మారాయి. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ఇలాంటి వారిని ఊరికే వదిలిపెట్టకూడదు. కఠిన చర్యలు తీసుకోవాలి’..‘నువ్వు మనిషివా.. మృగానివా’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
వృద్ధాశ్రమంలో ప్రేమ.. 79 ఏళ్ల వయసులో పెళ్లి..
ఆశీస్సుల పేరుతో నటిని వేధించిన పూజారి