Beer Into Elephants Trunk: ఏనుగు తొండంలో బీరు పోసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే..
ABN , Publish Date - Aug 30 , 2025 | 05:06 PM
ఆ వ్యక్తి బుప దగ్గరకు వెళ్లాడు. దాని పక్కనే నిలబడి తనతో పాటు తెచ్చుకున్న టిన్ బీర్ తాగుతూ ఉన్నాడు. ఆ వ్యక్తి బీర్ తాగటం బుప చూసింది. తనకు కూడా కొంచెం పోయమన్నట్లు తొండంతో సైగలు చేసింది.
ఏనుగు నోట్లో బీరు పోయటం ఓ వ్యక్తి కొంప ముంచింది. సరదాగా చేసిన ఆ పని అతడ్ని విమర్శల పాలు చేయటమే కాకుండా.. చట్టపరమైన చిక్కుల్లో పడేసింది. ఈ సంఘటన కెన్యాలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. బుప అనే మగ ఏనుగును 1989లో జోగి కన్సర్వెన్సీకి తీసుకువచ్చారు. అప్పుడు దాని వయసు 8 సంవత్సరాలు. అప్పటినుంచి అది అక్కడే ఉంటోంది. బుపతో పాటు చాలా రకాల వన్య మృగాలు అక్కడ ఉన్నాయి. పర్యాటకులు దేశ, విదేశాలనుంచి పెద్ద సంఖ్యలో వాటిని చూడ్డానికి వస్తూ ఉంటారు.
స్పెయిన్‌కు చెందిన ఓ వ్యక్తి తాజాగా జోగి కన్సర్వెన్సీకి వచ్చాడు. వన్య మృగాలను చూసి ఎంజాయ్ చేయటమే కాదు.. వాటితో ఫొటోలు, వీడియోలు తీసుకుని తెగ మురిసిపోయాడు. ఈ నేపథ్యంలోనే ఓ ఖడ్గ మృగానికి క్యారెట్లు పెట్టాడు. ఆ తర్వాత బుప దగ్గరకు వెళ్లాడు. దాని పక్కనే నిలబడి తనతో పాటు తెచ్చుకున్న టిన్ బీర్ తాగుతూ ఉన్నాడు. ఆ వ్యక్తి బీర్ తాగటం బుప చూసింది. తనకు కూడా కొంచెం పోయమన్నట్లు తొండంతో సైగలు చేసింది. ఆ వ్యక్తి వెంటనే బీరును దాని తొండంలో పోశాడు. అది దాన్ని తాగేసింది.
తాగింది కొంచెమే కాబట్టి దానిపై పెద్దగా ప్రభావం చూపలేదు. ఆ వ్యక్తి ఇందుకు సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు. ‘తొండం ఉన్న స్నేహితుడితో టస్కర్ బీరు తాగాను’ అని పోస్ట్ పెట్టాడు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై కెన్యా నెటిజన్లు విరుచుకుపడ్డారు. దారుణమైన కామెంట్లు చేశారు. దీంతో ఆ వ్యక్తి ఆ వీడియోను డిలీట్ చేశాడు. అయితే, అప్పటికే ఆ వీడియో మిగిలిన మాధ్యమాల్లో వైరల్ అయింది. కెన్యా ఉన్నతాధికారుల దృష్టికి కూడా వెళ్లింది. అధికారులు ఈ సంఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్యాప్తు ఆదేశించారు.
ఇవి కూడా చదవండి
తండ్రి దారుణం.. కూతురు వేరే కులం అబ్బాయిని ప్రేమించిందని..
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రేసులో కాంగ్రెస్ నుంచి వీరికే సీటు