సూర్యుడు కనిపించని ఊరు కూడా ఉందంటే నమ్ముతారా..
ABN , Publish Date - Jun 29 , 2025 | 09:05 AM
సూర్యుడు కనిపించని ఊరు ఉంటుందా? భానుడి వెలుగులు సోకకుంటే... ఊరంతా చీకటేగా? సృష్టి విచిత్రమేమిటంటే అలాంటి ఊరు కూడా ఒకటుంది. అంతమాత్రాన చీకటిని తిట్టుకుంటూ స్థానికులు కూర్చోలేదు.
- అద్దంలో సూరీడు..
సూర్యుడు కనిపించని ఊరు ఉంటుందా? భానుడి వెలుగులు సోకకుంటే... ఊరంతా చీకటేగా? సృష్టి విచిత్రమేమిటంటే అలాంటి ఊరు కూడా ఒకటుంది. అంతమాత్రాన చీకటిని తిట్టుకుంటూ స్థానికులు కూర్చోలేదు. సూర్యభగవానుడి వెలుగు కిరణాల కోసం ఒక బృహత్తరమైన ఆలోచన చేశారు. అదే ఆ ఊరును ప్రత్యేకంగా నిలిపింది.
చుట్టూ కొండలు... మధ్యలో ఊరు. ఏడాదిలో ఆరునెలల పాటు ఆ ఊరి ప్రజలకు సూర్యుడు కనిపించడు. ఊరంతా పట్టపగలే మబ్బులు కమ్మినట్టుగా ఉంటుంది. నార్వేలోని రుకాన్ అనే పట్టణంలో కనిపించే దృశ్యం ఇది. అనేకానేక ప్రయత్నాలు చేసి, చివరికి ఊరి నడిబొడ్డున వెలుగులు ప్రసరించేలా చేసుకున్నారు.
ఆరునెలలు ఎండ పడదు...
నార్వేలోని టెలిమార్క్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న చిన్న పారిశ్రామిక పట్టణం రుకాన్. చుట్టూ ఎత్తైన కొండల మధ్య... లోయలో ఉన్నట్లుగా ఉంటుందీ పట్టణం. ఆ కొండల మూలంగా ఆరు నెలలపాటు ఆ ఊర్లో ఎండ అనేది పడదు. సెప్టెంబరు నుంచి మార్చి వరకు కొండల నీడ కమ్ముకునే ఉంటుంది. రుకాన్‌లో సుమారు 4 వేల మంది నివసిస్తున్నారు. వందేళ్ల క్రితం... ఈ ఊరిలో వెలుతురు పడేలా చేయాలని సామ్ అనే పారిశ్రామికవేత్త అనేక ప్రయత్నాలు చేశారు.

రుకాన్ సమీపంలో ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ పెట్టారాయన. అక్కడికి సమీపంలో 340 అడుగుల ఎత్తైన జలపాతం ఉంది. పెద్ద ఎత్తున విద్యుత్తు ఉత్పత్తి చేయవచ్చనే ఆలోచనతో అక్కడ ఫ్యాక్టరీ పెట్టారు. దాని నిర్మాణం తరువాతే రుకాన్ పట్టణం అభివృద్ధి చెందింది. అయితే టెక్నాలజీ అందుబాటులో లేకపోవడంతో పట్టణానికి కావలసిన వెలుతురు అందించలేకపోయారు సామ్. అయితే సూర్యున్ని చూసే అవకాశం పట్టణ ప్రజలకు అందించడం కోసం 1928లో సొంత ఖర్చుతో కేబుల్ కార్ నిర్మాణం చేయించారు. ఆ కేబుల్ కార్‌లో ప్రయాణించి, కొండపైకి చేరుకుని ప్రజలు ఎండలో కాసేపు గడిపి ఆనందించి వచ్చేవారు. ఇప్పటికీ అక్కడి ప్రజలు కేబుల్ కార్‌ను ఉపయోగించే కొండపైకి చేరుకుంటుంటారు.
స్థానికుడి ఆలోచనతో...
సూర్యకిరణాలు సోకకుండా ఎన్నాళ్లు గడపడం? తమ జీవితాలు చీకట్లోనే ముగిసి పోవాలా? ఇలాంటి ఆలోచనలు చేసేవారు స్థానికులు. 2005లో మార్టిన్ అండర్సన్ అనే స్థానికుడికి కొండపై అద్దాలు బిగించడం ద్వారా పట్టణంలో సూర్యరశ్మి పడేలా చేయవచ్చని ఆలోచన తట్టింది. ఇటలీలోని విగనెల్లా అనే గ్రామంలో సూర్యుని వెలుతురు ప్రతిబింబించడం కోసం అద్దాలు ఏర్పాటు చేసిన విషయం అండర్సన్ తెలుసు కున్నాడు. అదే ఆలోచనను ఇక్కడా అమలు చేయాలని నిర్ణయించుకున్నాడు.

స్థానికులతో ఒక సమావేశం ఏర్పాటు చేసి, తన ఆలోచనను వివరించాడు. ప్రజల పెట్టుబడి, ప్రైవేటు భాగస్వామ్యంతో అద్దాల బిగింపునకు అందరూ ఓకే చెప్పారు. సామ్ స్థాపించిన కంపెనీ ఆర్థిక సహాయం అందించింది. దాంతో పట్ణణంలోని మార్కెటో సమీపంలో ఉండే ఎత్తైన కొండపై 450 మీటర్ల ఎత్తులో మూడు పెద్ద పెద్ద అద్దాలు అమర్చారు. సూర్యుని వెలుతురు ఆ అద్దాలపై పడి సరిగ్గా మార్కెట్ సెంటర్‌లోకి పరావర్తనం చెందేలా ఏర్పాటు చేశారు. వారి ప్రయత్నం ఫలించింది. సూర్యరశ్మి నేరుగా అద్దాలపై పడి మార్కెట్ సెంటర్‌ను వెలుగుల్లో కాంతులీనేలా చేసింది.
పొద్దుతిరుగుడు అద్దాలు...
కథ ఇక్కడితోనే అయిపోలేదు. మరింత తెలివిగా ఈ అద్దాలను కంప్యూటర్‌కు అనుసంధానించారు. దానివల్ల సూర్యుని కదలికలకు అనుగుణంగా అద్దాలు పొద్దు తిరుగుడు పువ్వుల్లా కదులుతుంటాయి.
ప్రతీ పది సెకన్లకొకసారి అద్దాలు కొద్దిగా కదులుతుంటాయి. అలా రోజులో సూర్యుడు ఉన్నంత సమయం పట్టణంలో వెలుతురు పడేలా చేసుకున్నారు. ఒకప్పుడు చీకటి కొట్టంలా మగ్గిపోయిన రుకాన్‌లో ఇప్పుడు పట్టపగలు వెలుగులు ప్రసరిస్తున్నాయి. ఆ వెలుతురు ప్రజల ముఖాల్లో సంతోషాలు వెల్లివిరిసేలా చేసింది.
సూర్య కిరణాల కోసం ఇప్పుడు స్థానికులు కేబుల్ కార్‌లో కొండపైకి వెళ్లడం లేదు. పట్టణంలోని సెంటర్‌కు వచ్చి ఆనందిస్తున్నారు.