Kannada At Hyderabad Kantara Event: హైదరాబాద్ ఈవెంట్లో కన్నడ.. క్లారిటీ ఇచ్చిన రిషబ్ శెట్టి..
ABN , Publish Date - Oct 10 , 2025 | 11:42 AM
రిషబ్ శెట్టి హనుమాన్ సీక్వెల్ జైహనుమాన్‌లో నటిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో రిషబ్ ఆంజనేయస్వామిగా కనిపించనున్నారు.
కన్నడ హీరో రిషబ్ శెట్టి హైదరాబాద్‌లో జరిగిన కాంతార చాప్టర్ 1 ఈవెంట్లో కన్నడలో మాట్లాడి విమర్శల పాలైన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌కు వచ్చి కన్నడలో మాట్లాడటం ఏంటని కొంతమంది తెలుగు వారు ఆయనపై మండిపడ్డారు. కాంతారను బాయ్‌కాట్ చేయాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే విజయవాడలో జరిగిన ఈవెంట్లో రిషబ్ వచ్చీరానీ తెలుగులో మాట్లాడారు. జై హనుమాన్ ఈవెంట్‌కు వచ్చినపుడు తెలుగులో చక్కగా మాట్లాడతానని స్పష్టం చేశారు. తాజాగా, ఓ నేషనల్ మీడియా హైదరాబాద్‌లో కన్నడ స్పీచ్‌పై రిషబ్ శెట్టిని ఓ ప్రశ్న వేసింది. దీంతో హైదరాబాద్ ఈవెంట్లో కన్నడలో ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో ఆయన క్లారిటీ ఇచ్చారు.
ఆ స్పీచ్ కేవలం జూనియర్ ఎన్టీఆర్ కోసం మాత్రమే ఇచ్చినట్లు చెప్పేశాడు. ఇంటర్వ్యూలో రిషబ్ మాట్లాడుతూ.. ‘నేను ఓ కన్నడ వ్యక్తిని. నాకు నా భాష మీద ప్రేమ ఉంది. తన భాషను ప్రేమించే వాడు ఇతర భాషను ఎందుకు అవమానిస్తాడు. తెలుగు భాష నా సోదర భాష. నాకు ఆ భాషపై అదే అభిమానం, గౌరవం, స్థానం ఉంది. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ అతిథిగా వచ్చాడు. నాకు అతడితో ఆత్మీయం బంధం ఉంది. జూనియర్ ఎన్టీఆర్ నా ఫ్రెండ్, సోదరుడి లాంటి వాడు.
నేను అతడికి నా మనసులోని భావాలను చెప్పాలనుకున్నాను. నాకు తెలుగు సరిగా రాదు. హిందీ, ఇంగ్లీష్‌కూడా అంతంత మాత్రమే. అందుకే నా మాతృభాషలో మాట్లాడాను. నేను నా సహజ భావాలను కేవలం నా మాతృభాష కన్నడలో మాత్రమే చెప్పగలను’ అని అన్నాడు. కాగా, రిషబ్ శెట్టి హనుమాన్ సీక్వెల్ జైహనుమాన్‌లో నటిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో రిషబ్ ఆంజనేయస్వామిగా కనిపించనున్నారు. హనుమాన్‌కంటే పది రెట్లు అద్భుతంగా జైహనుమాన్‌ను తీర్చిదిద్దాలని ప్రశాంత్ వర్మ భావిస్తున్నారట.
ఇవి కూడా చదవండి
చాణక్యుడి ప్రకారం.. ఇలాంటి వ్యక్తులు భూమికి భారం.!
ఫిలిప్పిన్స్‌లో భారీ భూప్రకంపనలు.. సునామీ హెచ్చరికలు జారీ..