ఎర్రనత్త.. ఎంత అరుదో..
ABN , Publish Date - Aug 31 , 2025 | 08:01 AM
అంతరించిపోయే జంతుజాలం పట్ల ప్రపంచదేశాలన్నీ ఎంత అప్రమత్తంగా ఉంటున్నాయో చూస్తున్నాం. పుడమితల్లిని, ప్రకృతిని, పర్యావరణాన్ని సమతుల్యంగా కాపాడుకోవాలంటే.. ప్రతీ జంతువూ బతకాల్సిందే!. జీవచక్రంలో ఏది అంతరించిపోయినా.. మానవ మనుగడకే ముప్పు వాటిల్లుతుంది.
అంతరించిపోయే జంతుజాలం పట్ల ప్రపంచదేశాలన్నీ ఎంత అప్రమత్తంగా ఉంటున్నాయో చూస్తున్నాం. పుడమితల్లిని, ప్రకృతిని, పర్యావరణాన్ని సమతుల్యంగా కాపాడుకోవాలంటే.. ప్రతీ జంతువూ బతకాల్సిందే!. జీవచక్రంలో ఏది అంతరించిపోయినా.. మానవ మనుగడకే ముప్పు వాటిల్లుతుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న జీవశాస్త్రవేత్తలు, పర్యావరణవేత్తలు అంతరించిపోతున్న జంతువులు, కీటకాలు, సర్పాలు, పక్షుల గురించి ఆయా ప్రభుత్వాలకు హెచ్చరికలు జారీ చేస్తుంటారు. అవసరమైతే అంతర్జాతీయ వేదికల్లోనూ, పరిశోధన పత్రాల్లోనూ ప్రముఖంగా ప్రస్తావిస్తుంటారు శాస్త్రవేత్తలు. ఇప్పుడు అలాంటి అంశమే చర్చకు వచ్చింది.
మలేసియాలోని కామెరన్ పర్వతాల్లో నివశిస్తున్న అరుదైన జీవి ‘ఫైర్ స్నెయిల్’. దీనిని ఎర్ర నత్త అని పిలుచుకోవచ్చు. అగ్నికణంలా ఎర్రెర్రగా ఉంటుంది కాబట్టి ఆ పేరొచ్చింది. ఇదెంత ప్రత్యేకమైౖనదంటే.. ప్రపంచంలోని అత్యంత విశాలమైన, దట్టమైన అడవుల్లో కూడా ఇలాంటి నత్త లేదంటే లేదు. కేవలం మలేసియాలోని కామెరన్ పర్వతాల్లో మాత్రమే ఉంది. అది కూడా కొండసానువుల్లోని వంద కి.మీ. పరిధిలోనే కనిపిస్తుందని జీవశాస్త్రవేత్తల పరిశోధనల్లో వెల్లడైంది. ఇప్పుడిది అంతరించిపోతే భూగోళంలో ఒక జీవి అంతర్థానం అయినట్లేనని మలేసియా ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. ఎర్రనత్త కోసం కొన్ని సంరక్షణ చర్యలు చేపట్టింది.

ఈ నత్తను 1939లో తొలిసారి కామెరన్ పర్వతాల్లోని టెలోమ్ లోయలో గుర్తించారు. ఇది ఏడు సెం.మీ.వ్యాసార్థంలో డొప్ప పెంకును వృద్ధి చేసుకుంటుంది. మేఘావృతమైన చల్లటి ప్రదేశాల్లోనే జీవిస్తుంది. సముద్రమట్టానికి ఈ ప్రాంతం వెయ్యి అడుగుల ఎత్తులో ఉంది. ‘‘1947 నుంచి 1997 వరకు మూడోవంతు అటవీప్రాంతం నాశనమైంది. ఇక్కడ రకరకాల పరిశ్రమలు, తవ్వకాలతో ఈ పరిస్థితి వచ్చింది. కొందరు స్మగ్లర్లు అరుదైన ఎర్రనత్తలను అక్రమ రవాణా చేస్తున్నారు. ధర కూడా అధికమే!. అమెరికా, ఇంగ్లండ్, ఐరోపా దేశాలకు పంపిస్తుంటారు.
ఇది చాలా దారుణం. కొన్నాళ్లకు ఈ ఎర్రనత్త అంతరించిపోతుందన్న ఆందోళన మాకుంది’’ అంటున్నారు మలేసియా జీవశాస్త్రవేత్తలు. భూమి మీద సుమారు 40 నుంచి 80 వేల రకాల నత్తజాతులు ఉన్నాయి. వాటన్నిటికంటే ఎర్రనత్త భిన్నం. అడవుల్లోని వృథా పదార్థాలను పోషకాలుగా మార్చుకుని రక్షణ కవచంలా పెంకును తయారు చేసుకుంటుందీ నత్త. భూమి సారవంతంగా మారేందుకు, ఆకులు త్వరగా కుళ్లిపోవడానికి నత్త అవసరం. కొన్ని జంతువులకు ఆహారంగా కూడా పనికొస్తాయివి. జీవచక్రంలో నత్త పాత్ర ఎనలేనిది. అందుకే మలేసియా ఎర్రనత్తను కాపాడేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.