Share News

Bike Crash Stunt: బైక్ యాక్సిడెంట్.. మెరుపులాంటి స్టంట్‌తో బయటపడ్డ యువకుడు

ABN , Publish Date - Jun 02 , 2025 | 06:58 PM

కాలవలో పడబోతున్న బైక్‌పై నుంచి మెరుపు వేగంతో దూకి తన అపాయాన్ని తప్పించుకున్న ఓ యువకుడి వీడియో వైరల్ అవుతోంది. మెరుపువేగంతో అతడు స్పందించిన తీరు జనాలను షాక్‌‌కు గురిచేస్తోంది.

Bike Crash Stunt: బైక్ యాక్సిడెంట్.. మెరుపులాంటి స్టంట్‌తో బయటపడ్డ యువకుడు
Vietnam bike crash

టామ్ క్రూయిజ్.. ఈ హాలీవుడ్ స్టార్ పేరు చెబితే ముందుగా గుర్తొచ్చేది భారీ స్టంట్స్. ఒళ్లు గగుర్పొడిచే స్టంట్స్ చేయడంలో ఈ స్టార్‌కు తిరుగే లేదు. అయితే, అంతకుమించిన ఓ యువకుడిపై నెట్టింట ప్రశంసలు కురుస్తున్నాయి. అత్యంత వేగంగా స్పందించి బారీ ప్రమాదం నుంచి తప్పించుకున్న ఈ వియత్నాం యువకుడి వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. క్రూయిజ్‌ను మించిపోయాడంటూ జనాలు జేజేలు పలుకుతున్నారు.

వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ముగ్గురు వ్యక్తులు బైక్‌పై ప్రయాణిస్తూ రోడ్డుపై దూసుకెళ్లారు. అదే సమయంలో ఎడమవైపు నుంచి ఓ కారు వారికి అడ్డంగా రావడంతో బైక్ నడుపుతున్న వ్యక్తి బెదిరిపోయాడు. కారు‌ను ఢీకొట్టకుండా ఉండేందుకు బైక్‌ను పక్కకు తిప్పాడు. ఫలితంగా బైక్ అదుపు తప్పి ఎదురుగా వంతెన కింద ఉన్న కాలవలోకి దూసుకుపోయింది.

అయితే, బైక్ వెనక సీటుపై కూర్చున్న వ్యక్తి మాత్రం అత్యంత వేగంగా స్పందించాడు. బైక్ కాలవలో పడే లోపే కిందకు దూకి బ్రిడ్జి‌పై ఉన్న రెయిలింగ్‌ను పట్టుకుని కాలవలో పడకుండా ఆగాడు. ఆ మరుక్షణమే బ్రిడ్జిపైకి ఎక్కేశాడు. అంతా క్షణకాలంలో పూర్తి చేసేశాడు. అతడి ముందున్న వ్యక్తి జరగబోయేదేంటో గుర్తించే లోపే వెనక సీటులోని వ్యక్తి మాత్రం తనను తాను ఎలా రక్షించుకోవాలో ప్లాన్ చేసి అమలు కూడా చేసేశాడు.


క్షణాల వ్యవధిలో స్పందిస్తూ అత్యంత చాకచక్యంగా అపాయం నుంచి బయటపడ్డ సదరు వ్యక్తిపై నెట్టింట ప్రశంసలు కురుస్తున్నాయి. ఇతను టామ్ క్రూయిజ్‌ను మించిపోయాడంటూ జనాలు తెగ పొగిడేస్తున్నారు. ప్రమాద సమయంలో కూడా ఎలాంటి కంగారు లేకుండా ఇంతటి వేగంతో స్పందించడం మామూలు విషయం కాదన్నారు. స్పీడుగా వెళుతున్న బైక్ నుంచి లాఘవంగా కిందకు దూకడం, బ్రిడ్జి రెయిలింగ్ పట్టుకుని నీళ్లలో పడకుండా ఆపుకోవడం చూస్తే అబ్బురంగా ఉందని కామెంట్ చేశారు.


కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా దాదాపు ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. ఓ స్కైడైవర్‌‌కు గాల్లోనే ఫిట్స్ రావడంతో అదుపు కోల్పోయి ప్రమాదంలో పడ్డాడు. గాల్లో ఉన్న అతడు వేగంగా భూమిపైకి దూసుకురావడం చూసిన సహచర స్కైడైవర్ అత్యంత చాకచక్యంగా స్పందించాడు. అతడిని జాగ్రత్తగా సమీపించి పారషూట్ తెరుచుకునేలా చేసి అతడిని సురక్షితంగా కిందకు చేర్చాడు. ఈ ఘటనపై కూడా నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వచ్చింది.

Updated Date - Jun 02 , 2025 | 07:08 PM