Share News

భళా... బిలియనీర్‌ పిల్లి

ABN , Publish Date - Jun 29 , 2025 | 12:33 PM

ఒక పిల్లి వందల కోట్లకు అధిపతి అంటే నమ్ముతారా? ప్రపంచంలోనే అత్యంత ధనవంతురాలైన పిల్లిగా గుర్తింపు పొందిన ఆ పిల్లికి ఉన్న ‘ఇన్‌స్టా’ ఫాలోవర్స్‌ సంఖ్య చూస్తే అసూయపడతారెవరైనా.

భళా... బిలియనీర్‌ పిల్లి

ఒక పిల్లి వందల కోట్లకు అధిపతి అంటే నమ్ముతారా? ప్రపంచంలోనే అత్యంత ధనవంతురాలైన పిల్లిగా గుర్తింపు పొందిన ఆ పిల్లికి ఉన్న ‘ఇన్‌స్టా’ ఫాలోవర్స్‌ సంఖ్య చూస్తే అసూయపడతారెవరైనా. ‘గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు’ల్లోకి ఎక్కిన దాని యజమాని ఎవరు? ఎక్కడుంది? అన్ని కోట్ల రూపాయలు ఎలా సంపాదిస్తోందంటే...

చాలామంది పిల్లులను పెంచుకుంటారు. పెంపుడు పిల్లుల గురించి ఏమైనా చెప్పమని వాటి యజమానులను అడిగితే... పాలు తాగుతాయి, ఎలుకల్ని వేటాడతాయి, ఆడుకుంటాయి అని రెగ్యులర్‌ సమాధానాలే చెబుతారు. కానీ ఈ పిల్లి మాత్రం అలాంటిది కాదు. దాని యజమానికి నెలకు లక్షల్లో ఆర్జించి పెడుతోంది. ఇప్పటిదాకా వందల కోట్లు సంపాదించి ప్రపంచంలోనే ధనవంతురాలైన పిల్లిగా గుర్తింపు పొందింది. కాలిఫోర్నియాకు చెందిన ఈ పిల్లి పేరు ‘నాలా’.


సోషల్‌మీడియా సెన్సేషన్‌...

మీకన్నా మీ పెట్‌ ఎక్కువ పాపులారిటీ సంపాదించవచ్చు. ఎక్కువ ఆర్జించవచ్చు. ఇందుకు మంచి ఉదాహరణ ‘నాలా’. దీని జీవితం జంతుసంరక్షణ కేంద్రంలో మొదలైంది. 2010లో వరిసిరి మతచిట్టిఫాన్‌ (పూకీ) అనే మహిళ ఈ పిల్లిని జంతు సంరక్షణ కేంద్రం నుంచి ఇంటికి తెచ్చుకుంది. అప్పుడు దాని వయస్సు ఐదు నెలలు. ఆకట్టుకునే నీలి కళ్లతో ఆ పిల్లి ముద్దుగా ఉంటుంది. దాంతో పూకీ తన పిల్లికి ‘నాలా’ అని పేరు పెట్టింది. ఆ తరువాత 2012లో నాలా కోసం ఒక ఇన్‌స్టా ప్రొఫైల్‌ని క్రియేట్‌ చేసి... సరదాగా దాని ఫొటోలు, వీడియోలు పోస్ట్‌ చేయడం మొదలు పెట్టింది పూకీ. ఆ పిల్లిని చూసి ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లు తెగ ఇష్టపడ్డారు. దాని అల్లరి చేష్టలకు అభిమానులై పోయారు. అనతికాలంలోనే ఆ ఫొటోలు సెన్సేషన్‌ క్రియేట్‌ చేశాయి. కొద్దికాలంలోనే ‘నాలా’ సోషల్‌మీడియా సూపర్‌స్టార్‌గా మారింది.


ఒక్క పోస్ట్‌కు రూ.12 లక్షలు...

ప్రస్తుతం ‘నాలా’ ఇన్‌స్టా అకౌంట్‌కి 45 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారంటే నమ్ముతారా? ఇన్‌స్టాలో ఎక్కువ మంది ఫాలో అవుతున్న పిల్లిగా ‘నాలా’ గిన్నిస్‌ రికార్డుల్లోకి కూడా ఎక్కింది. సోషల్‌మీడియాలో సగటున ఒక్కో పోస్టుకు నాలాకు అందుతున్న మొత్తం 12 లక్షల రూపాయలుగా ఉంది. ప్రస్తుతం నాలా వయస్సు 15 ఏళ్లు. క్యాట్స్‌.కామ్‌ అంచనా ప్రకారం ‘నాలా’ ఆస్తుల విలువ సుమారు రూ. 839 కోట్లు. సోషల్‌ మీడియాలో విపరీతమైన పాపులారిటీ రావడంతో పూకీ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించింది. ‘లవ్‌ నాలా’ పేరుతో క్యాట్‌ ఫుడ్‌ బ్రాండ్‌ను ప్రారంభించింది.

book8.2.jpg


అందులో ఇన్వెస్టర్లు వంద కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టారు. ఆ సంస్థ పెంపుడు జంతువుల పోషణ, ఆవిష్కరణలతో సరికొత్త ప్రమాణాలు నెలకొల్పుతోంది. ‘‘నేటికీ నాలాకు వచ్చిన పాపులారిటీని నమ్మలేక పోతున్నాను. అందరికీ నేను కృతజ్ఞురాలిని’ అంటోంది ‘నాలా’ యజమాని పూకీ. బెస్ట్‌ వెట్‌ క్యాట్‌ ఫుడ్‌, బెస్ట్‌ డ్రై క్యాట్‌ ఫుడ్‌ను అందించినందుకు గానూ ‘పెట్‌ ఇన్నోవేషన్‌’ అవార్డును అందుకుంది పూకీ. ఇప్పటికీ ‘నాలా’ రోజువారి వీడియోలు, ఆకట్టుకునే విన్యాసాలను వీడియోలు పోస్ట్‌ చేస్తూనే ఉంది. వాటిని ఆసక్తిగా చూస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది.

Updated Date - Jun 29 , 2025 | 04:31 PM