Share News

అందమైన ప్రాంతంలో అద్భుతమైన గ్రామం..

ABN , Publish Date - Sep 07 , 2025 | 12:23 PM

ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో చిట్టచివరన ఉంటుంది ‘మనా’. ఇండో-టిబెట్‌ సరిహద్దుల్లో సముద్ర మట్టానికి 10 వేల 500 అడుగుల ఎత్తులో ఉంది. గ్రామ జనాభా సుమారు 1300. అంతకుముందు ‘మనా’ విషయంలో చాలా గందరగోళం ఉండేది. ఇది భారతదేశపు చిట్టచివరి గ్రామమని, కాదు కాదు... మొట్టమొదటి గ్రామమనేవారు.

అందమైన ప్రాంతంలో అద్భుతమైన గ్రామం..

- ‘మనా’ తొలి ఊరు..

‘దేవభూమి’గా పిలుచుకునే ఉత్తరాఖండ్‌ను చూడటానికి రెండుకళ్లు చాలవు. చుట్టూ హిమాలయాలు, దట్టమైన అడవులు, కొండలతో ప్రకృతి రమణీయత మధ్య ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. అలాంటి అందమైన ప్రాంతంలో అద్భుతమైన గ్రామం ఉంది. అదే ‘మనా’. దీనినే భారతదేశపు తొలి గ్రామంగా పిలుస్తారు. దాని విశేషాలివి...

ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో చిట్టచివరన ఉంటుంది ‘మనా’. ఇండో-టిబెట్‌ సరిహద్దుల్లో సముద్ర మట్టానికి 10 వేల 500 అడుగుల ఎత్తులో ఉంది. గ్రామ జనాభా సుమారు 1300. అంతకుముందు ‘మనా’ విషయంలో చాలా గందరగోళం ఉండేది. ఇది భారతదేశపు చిట్టచివరి గ్రామమని, కాదు కాదు... మొట్టమొదటి గ్రామమనేవారు. అయితే ఇటీవలే దీనిని భారతదేశపు తొలి గ్రామంగా గుర్తిస్తూ సరిహద్దు రోడ్ల సంస్థ సైన్‌ బోర్డును ఏర్పాటు చేసింది.


పురాణ ఇతిహాసాల్లో కూడా ‘మనా’ గ్రామాన్ని ప్రస్తావించడంతో మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది.

ఈ గ్రామాన్ని మహాభారత కాలానికి సంబంధించినదిగా చెబుతారు. హిందూ పురాణాల ప్రకారం మహాభారతాన్ని ఈ గ్రామంలోనే వేదవ్యాసుడు చెబుతుంటే గణేషుడు రాశారని చెబుతుంటారు. పాండవులు స్వర్గానికి ప్రయాణం చేసినప్పుడు ‘మనా’ గ్రామం గుండా వెళ్లారని నమ్ముతారు.


book10.jpg

భీముడు నిర్మించిన ‘పూల్‌’

ఈ ప్రాంతంలో సరస్వతీ నదికి సమీపంలో ఉన్న రాతి వంతెనను ‘భీమా పూల్‌’ అని పిలుస్తారు. పంచపాండవుల్లో ఒకరైన భీముడు దీనిని నిర్మించినట్లు ప్రచారంలో ఉంది. హిందూ పురాణాల ప్రకారం ఈ గ్రామంలోనే మహాభారత రచన జరిగిందని హిందువుల నమ్మకం. గ్రామ వీధుల్లో నడిచివెళ్లేవారికి అందంగా గోడలపై దేవతామూర్తుల పెయింటింగులు ఆకట్టుకుంటాయి. వేదవ్యాస గుహ, గణేష్‌ గుహ, పసుధార జలపాతం, భీమశిల ప్రదేశాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. సరస్వతి నది పుట్టుక కూడా ఈ ప్రాంత పరిసరాల్లోనే అంటారు. సరస్వతి - అలకనంద నదులు ఈ గ్రామంలోనే కలుస్తాయి. మిగతా ప్రాంతాలతో పోల్చితే ‘మనా’ గ్రామ ప్రజల జీవనం కాస్త వైవిధ్యంగా ఉంటుంది. ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు అందర్నీ ఆకట్టుకుంటాయి. బంగాళాదుంపలు అధికంగా పండిస్తారు. వీటితోనే వంటకాలు తయారు చేస్తారు.


ఉన్ని దుస్తులకు ప్రఖ్యాతి...

‘మనా’ గ్రామం ఉన్ని దుస్తులకు ప్రఖ్యాతిగాంచింది. గొర్రెల నుంచి సేకరించిన ఉన్నితో స్వెటర్లు, శాలువాలు, మఫ్లర్లు, టోపీలు, తివాచీలు, చేతితో అల్లిన రంగురంగుల వస్త్రాలు తయారు చేస్తూ... వీటినే ఆదాయ వనరుగా మార్చుకున్నారు.

బద్రీనాథ్‌ ఆలయానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండటంతో చార్‌ధాం యాత్రకు వెళ్లే పర్యాటకులంతా ఈ గ్రామాన్ని సందర్శి స్తుంటారు. ప్రకృతి ఒడిలో సేద తీరుతూ మైమరిచిపోతారు. గత కొన్ని సంవత్సరాలుగా పర్యాటకుల తాకిడి కారణంగా గ్రామంలో చిన్న చిన్న దుకాణాలు ఏర్పాటు చేసుకొని పర్యాటకుల అభిరుచికి తగ్గట్టు ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారు. పర్యాటకు లను ఆకర్షించేందుకు ప్రభుత్వం కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోంది. మే నుంచి అక్టోబర్‌ నెల మధ్య ఈ గ్రామం సందర్శనకు అనువుగా ఉంటుంది.


చలికాలంలో ఈ ప్రాంతమంతా మంచుతో కప్పబడి ఉంటుంది. అందుకే గ్రామస్తులు ఆ సమయంలో దిగువ ప్రాంతాలకు వెళ్తారు. చలి ప్రదేశం కాబట్టి ఇక్కడి అనేక టీ దుకాణాల్లో ‘భారత సరిహద్దు చివరి దుకాణం’ తమదని పర్యాటకులకు తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేసుకోవడం కనిపిస్తుంది. ఇన్ని విశేషాలున్న ‘మనా’కు విమాన మార్గంలో వెళ్లాలంటే, దానికి 222 కిలోమీటర్ల దూరంలో ఉన్న డెహ్రాడూన్‌ విమానాశ్రయంలో దిగాలి. అక్కడి నుంచి ట్యాక్సీ, బస్సు సర్వీసులు ఉంటాయి.

- వెంకట మహేష్‌ వెల్లంకి, విశాఖపట్నం

Updated Date - Sep 07 , 2025 | 12:23 PM