అక్కడ.. ఎనీ టైమ్ మనీకాదు.. ఎనీ టైమ్ మిల్క్..
ABN , Publish Date - Jul 06 , 2025 | 12:14 PM
ఎవరైనా సరే డబ్బుల కోసం ఏటీఎంకు వెళ్తుంటారు. కానీ మహారాష్ట్రలోని మహాగావ్‌లో ‘ఎనీ టైమ్ మిల్క్’ (ఏటీఎం) ను అందించే మెషీన్‌ను ఏర్పాటు చేశాడో పాడిరైతు. ఇంకేం... వినియోగదారులు పాల కోసం కిరాణషాపులు కాదని ఆ ఏటీఎం ముందు క్యూ కడుతున్నారు...
ఎవరైనా సరే డబ్బుల కోసం ఏటీఎంకు వెళ్తుంటారు. కానీ మహారాష్ట్రలోని మహాగావ్‌లో ‘ఎనీ టైమ్ మిల్క్’ (ఏటీఎం) ను అందించే మెషీన్‌ను ఏర్పాటు చేశాడో పాడిరైతు. ఇంకేం... వినియోగదారులు పాల కోసం కిరాణషాపులు కాదని ఆ ఏటీఎం ముందు క్యూ కడుతున్నారు...
ఏటీఎం అంటే డబ్బులు ఇచ్చే యంత్రం అని అందరికీతెలుసు. అయితే ఏటీఎం అంటే ఎనీ టైం మిల్క్ అని కూడా కొత్త అర్థం చెప్పాల్సి ఉంటుంది. మహారాష్ట్రలోని ఫుల్సావాంగీకి చెందిన 43 ఏళ్ల సునిల్ కోల్పే ఒక పాడిరైతు. పది లీటర్ల పాలతో ప్రారంభమైన ఆయన పాల వ్యాపారం ప్రస్తుతం రోజూ 350 లీటర్లు అమ్మే దశకు చేరుకుంది. ప్రారంభంలో ఆయన ఇంటింటికీ తిరిగి పాలు పోసేవారు. ఆ తరువాత మహాగావ్ గ్రామంలో ఒక మిల్క్ ఏటీఎంను ఏర్పాటు చేశారు. తద్వారా వినియోగదారు లకు పాలను మరింత చేరువ చేశారు. పుణే, నాసిక్‌లలో మిల్క్ ఏటీఎంలు ఉండటాన్ని చూసిన కోల్పేకు తను కూడా ఒక ఏటీఎం పెడితే బాగుంటుంది కదా అనే ఆలోచన తట్టింది. వెంటనే రూ. 2.5 లక్షలు వెచ్చించి 150 లీటర్ల సామర్థ్యం ఉన్న మిల్క్‌ఏటీఎంను కొనుగోలు చేసి మహాగావ్‌లో పెట్టారు.

ఆయన ఆలోచన సూపర్ సక్సెస్ అయ్యింది. ఊర్లో వాళ్లందరూ పాల కోసం ఏటీఎంకు రావడం మొదలుపెట్టారు. ఈ యంత్రంలో ఉష్ణోగ్రత 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. కాబట్టి పాలు ఎట్టి పరిస్థితుల్లోనూ పాడవవు. వినియోగదారులు స్మార్ట్ కార్డు, క్యూఆర్ కోడ్‌తో డబ్బు చెల్లించి పాలు కొనుగోలు చేయవచ్చు. నగదుతో కొనుగోలు చేసే సదుపాయం కూడా ఉంది. అయితే వినియోగదారులు వారి వెంట ప్లాస్టిక్ బ్యాగ్ లేదా బాటిల్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ఏటీఎం నుంచి 200 నుంచి 250 మంది వినియోగదారులు పాలు కొనుగోలు చేస్తున్నారు. 200 చెల్లించి స్మార్ట్ కార్డును రీఛార్జ్ చేసుకునే సదుపాయం కూడా ఉంది. సాధారణంగా మిల్క్ ఏటీఎం యంత్రాలను ప్రైవేటు డెయిరీ, కో-ఆపరేటివ్ సంస్థలు కొనుగోలు చేస్తుంటాయి. కానీ వ్యక్తిగత వ్యాపారం కోసం కొనుగోలు చేసిన మొట్టమొదటి వ్యక్తి కోల్పేనే కావడం గమనార్హం. ఈ విధంగా పాడిరంగంలో ఉన్న ఎంతోమందికి కోల్పే స్ఫూర్తిగా నిలిచాడు.

తొలి ‘ఏటీఎం’...
ఇదిలా ఉంటే... మనదేశంలో మొట్టమొదటి మిల్క్ ఏటీఎంను ప్రారంభించిన ఘనత అమూల్ సంస్థకు దక్కుతుంది. గుజరాత్‌లోని ఆనంద్ పట్టణంలో ఉన్న అమూల్ డెయిరీ గేట్ దగ్గర ఈ మిల్క్ వెండింగ్ ఏటీఎంను ఏర్పాటు చేసింది. అయితే ఇందులో పాల ప్యాకెట్‌లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. 300 మి.లీ ప్యాకెట్లతో పాటు అరలీటరు ప్యాకెట్లు లభిస్తాయి. నగదును యంత్రంలో ఇన్‌సెర్ట్ చేసిన వెంటనే పాల ప్యాకెట్ బాక్స్‌లో పడుతుంది. ఈ విధంగా 24 గంటలూ పాల ప్యాకెట్లు వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి.