Share News

టూ ఇన్‌ వన్‌.. ప్రయాణానికి సైకిల్‌, వ్యాయామానికి ట్రెడ్‌మిల్‌

ABN , Publish Date - Oct 05 , 2025 | 01:34 PM

ఒకరోజు వ్యాయామం చేస్తున్నప్పుడు నెదర్లాండ్‌కు చెందిన బ్రుయిన్‌ బెర్గ్‌మీస్టన్‌కు సడెన్‌గా ‘సైకిల్‌, ట్రెడ్‌మిల్‌ రెండూ కలగలిస్తే ఎలా ఉంటుంది?’ అనే ఆలోచన మెదిలింది. కట్‌ చేస్తే... ‘లోపిఫిట్‌’ ఆవిష్కరణ జరిగింది.

టూ ఇన్‌ వన్‌.. ప్రయాణానికి సైకిల్‌, వ్యాయామానికి ట్రెడ్‌మిల్‌

ప్రయాణానికి సైకిల్‌, వ్యాయామానికి ట్రెడ్‌మిల్‌... రెండూ కూడా ఒకరకంగా ఆరోగ్యకరమే. ఈ రెండింటినీ కలిపితే... అనే వినూత్న ఆలోచనకు ప్రతిరూపమే ‘వీల్స్‌ ఆన్‌ ట్రెడ్‌మిల్‌’. స్థానికంగా ‘లోపిఫిట్‌’ అని పిలిచే ఈ క్రేజీ సైకిల్‌ ప్రస్తుతం నెదర్లాండ్స్‌లో అందర్నీ ఆకట్టుకుంటోంది.

ఒకరోజు వ్యాయామం చేస్తున్నప్పుడు నెదర్లాండ్‌కు చెందిన బ్రుయిన్‌ బెర్గ్‌మీస్టన్‌కు సడెన్‌గా ‘సైకిల్‌, ట్రెడ్‌మిల్‌ రెండూ కలగలిస్తే ఎలా ఉంటుంది?’ అనే ఆలోచన మెదిలింది. కట్‌ చేస్తే... ‘లోపిఫిట్‌’ ఆవిష్కరణ జరిగింది. నిజానికి ఇదొక ఎలక్ట్రిక్‌ సైకిల్‌. అయితే దీనికి పెడల్స్‌, చైన్‌ వంటివి ఉండవు. సైకిల్‌ను ఒకసారి ఛార్జ్‌ చేస్తే సుమారు 60 నుంచి 80 కిలోమీటర్ల వరకు, గరిష్ఠంగా 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించొచ్చు.


అలా వెళ్తున్నప్పుడు నడవాలి అనిపిస్తే... ఒక్క అడుగు ముందుకు వేస్తే చాలు... సెన్సర్లు కాళ్ల కింద ఉన్న ట్రెడ్‌మిల్‌ మోటార్‌ను ఆన్‌ చేస్తాయి. అప్పుడిక సైకిల్‌ ముందుకు సాగుతుంటే... ఎంచక్కా ట్రెడ్‌మిల్‌ మీద నడవొచ్చు. అవసరం లేదనుకుంటే... ట్రెడ్‌మిల్‌ను యాక్టివేట్‌ చేసుకోకుండానే సైకిల్‌పై ప్రయాణించొచ్చు. అయితే ఈ సైకిల్‌పై కూర్చోవడం మాత్రం కుదరదు. నిల్చొనే ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ ట్రెడ్‌మిల్‌ సైౖకిల్‌ దాదాపు 120 కిలోల బరువును మోయగలదట. మొత్తానికి ఈ ‘టూ ఇన్‌ వన్‌’ ఆలోచన బాగుంది కదూ!

Updated Date - Oct 05 , 2025 | 01:34 PM