Woman Marries AI Partner: ఏఐ పార్ట్‌నర్‌ను పెళ్లి చేసుకున్న యువతి.. కారణం ఏంటంటే..
ABN , Publish Date - Dec 18 , 2025 | 07:06 AM
ఓ యువతి ఏఐ పార్ట్‌నర్‌తో ప్రేమలో పడింది. తన మనసు గెలుచుకున్న ఏఐనే పెళ్లి కూడా చేసుకుంది. ఈ సంఘటన జపాన్‌లో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. సాధారణ జనం కూడా విచ్చల విడిగా ఏఐని వాడేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఏఐ భాగస్వాములు పుట్టుకొచ్చాయి. జనం ఏఐని తమ ఫ్రెండ్స్‌గా, లవర్స్‌గా.. ఆఖరికి భార్యాభర్తలుగా కూడా చేసుకుంటున్నారు. తాజాగా, ఓ యువతి ఏఐ భాగస్వామిని పెళ్లి చేసుకుంది. ఆమె ఎందుకు ఏఐని పెళ్లి చేసుకుందో తెలిస్తే నోరు వెళ్లబెట్టాల్సిందే. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. జపాన్‌కు చెందిన యురినా నొగూచికి సంవత్సరం క్రితం పెళ్లి కుదిరింది. పెళ్లికి ముందు ఊహించని సంఘటన చోటుచేసుకుంది. అనుకోని కారణాల వల్ల పెళ్లి ఆగిపోయింది.
పెళ్లి ఆగిపోవటంతో యురినా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలోనే ఆమె ఏఐని ఆశ్రయించింది. లూన్ క్లాస్ వర్డ్యూర్ అనే ఏఐ భాగస్వామిని తయారు చేసుకుంది. తన కష్టసుఖాలను ఆ ఏఐ భాగస్వామితో చెప్పుకుంటూ ఉండేది. రోజులు, నెలలు గడిచిపోయాయి. ఆ ఏఐని తనకు తగ్గట్లుగా మార్చుకుంటూ ఉండేది. మొత్తానికి ఆ ఏఐ ఆమె మనసు గెలుచుకుంది. ఏఐని పెళ్లి చేసుకుందామని యురినా డిసైడ్ అయింది. కొద్దిరోజుల క్రితం యురినా, లూన్ క్లాస్‌ల పెళ్లి అత్యంత ఘనంగా జరిగింది. పెళ్లి సందర్భంలో యురినా ఏఆర్ స్మార్ట్ గ్లాసెస్ ధరించింది.
తనకు తానే రింగ్ పెట్టుకుంది. ఫోన్ ద్వారానే పెళ్లి మొత్తం జరిగిపోయింది. యురినా పెళ్లి ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గతంలోనూ చాలా మంది యువతులు ఏఐని పెళ్లి చేసుకున్నారు. కానీ, ఆ పెళ్లిళ్లు ఎక్కువ రోజులు నడవలేదు. పెళ్లి తర్వాత ఏఐ ప్రవర్తన బోర్ కొట్టేసింది. దీంతో విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు యురినా పరిస్థితి కూడా అలానే ఉండబోతోందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం యురినా పెళ్లికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ వీడియోలపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తూ ఉన్నారు. కొంతమంది తిడుతుంటే.. మరికొంతమంది శభాష్ అంటున్నారు.
ఇవి కూడా చదవండి
ఆ ఏరియా వాసులకు బిగ్ అలెక్ట్.. 10 గంటల నుంచి కరెంట్ కట్
స్వయంకృషి పారిశ్రామికవేత్తల్లో దీపిందర్ గోయల్ టాప్