Share News

మనసున్న మగామె.. ఈ జానూ.. ఇప్పుడు జానమ్మ!

ABN , Publish Date - Oct 19 , 2025 | 11:48 AM

కర్ణాటక, రాయచూర్‌లోని ఒక ముస్లిం కుటుంబంలో పుట్టాడు అబ్దుల్‌ ఖుద్దూస్‌. మగపిల్లాడే కాబట్టి ఆ పేరు పెట్టారు తల్లిదండ్రులు.. కానీ అమ్మాయిలా అలంకరించుకునేవాడు.. చీరలు కట్టుకోవడం, మేకప్‌ వేసుకోవడం, గోరింటాకు పెట్టుకోవడం చేసేవాడు.

మనసున్న మగామె.. ఈ జానూ.. ఇప్పుడు జానమ్మ!

‘‘అమ్మమ్మతో మాట్లాడతావా? ’’

‘‘నాకిష్టం లేదు. ఎప్పుడూ చాదస్తమే!. చెప్పిందే చెబుతుంటుంది..

పాత కాలం మనిషి.. ఒకటే నస’’

‘‘ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌ అన్నారు కదా.. అందుకే ఆమె అనుభవాలు వినాలి. అవి నీకు ఎంతో అమూల్యం. వికీపీడియాలో కూడా దొరకవు. అమ్మమ్మ బంగారం..’’

... ఇలా సాగుతుంది ‘జానూ’ వెంట్రిలాక్విజం. చేతిలో మాట్లాడే బొమ్మ ఉంటే చాలు.. ఆమె అలవోకగా మాట్లాడేస్తుంది... నవ్విస్తుంది.. ఏడిపిస్తుంది.. ఆలోచింపజేస్తుంది.. అప్పుడప్పుడు స్ఫూర్తినింపే కథలు కూడా చెప్పేస్తుంది. జానూ చేతిలోని ఆ బొమ్మ పలుకులు వెంట్రిలాక్విజం. ఆడబొమ్మలా ఆకర్షించే ఆ జానూ మాత్రం ఒకప్పుడు అబ్బాయి. ఇప్పుడు జానమ్మ!.. ముద్దుగా అందరూ జానూ అంటుంటారు. భారతదేశంలో వెంట్రిలాక్విజం చేస్తున్న తొలి ట్రాన్స్‌జెండర్‌గా పేరు సంపాదించిన జానూ జీవన ప్రయాణం.. విచిత్రమైనది!.


book7.jpg

కర్ణాటక, రాయచూర్‌లోని ఒక ముస్లిం కుటుంబంలో పుట్టాడు అబ్దుల్‌ ఖుద్దూస్‌. మగపిల్లాడే కాబట్టి ఆ పేరు పెట్టారు తల్లిదండ్రులు..

కానీ అమ్మాయిలా అలంకరించుకునేవాడు.. చీరలు కట్టుకోవడం, మేకప్‌ వేసుకోవడం, గోరింటాకు పెట్టుకోవడం చేసేవాడు. ‘‘ఏంటి ఎప్పుడూ అమ్మాయిలా తయారవుతున్నావు? నువ్వు అబ్బాయివి. ఇలా ఉండకూడదు’’ అని తిట్టేవారు కుటుంబసభ్యులు. అబ్దుల్‌ మనసులో గుబులు మొదలైంది. పదహారేళ్లకే ఇంట్లో నుంచి బెంగళూరు పారిపోయాడు. సోదరి దగ్గర తీసుకున్న నాలుగువేల రూపాయలతో కొన్నాళ్లు బతికాడు.


నగరంలో మెహెందీ ఆర్టిస్టుగా, డ్యాన్సర్‌గా పనిచేస్తూ కొంత డబ్బు పొదుపు చేసుకున్నాడు. పైకి మగాడే కానీ.. లోపలున్న మనసంతా ఆడతనంతో నిండిపోయింది. ఆ సంఘర్షణను భరించలేక లింగమార్పిడి చేయించుకున్నాడు. అప్పటి నుంచి అబ్దుల్‌ కాస్త జానూగా మారింది. ‘‘సమాజంలో లింగవివక్ష, వైషమ్యాలు, ధనిక-పేద తారతమ్యాలు, లైంగికహింస వంటివన్నీ ఉన్నాయి. ప్రజల్ని నవ్విస్తూనే మేల్కొల్పాలి అనుకున్నాను. అప్పుడు నన్ను ఆకర్షించిన కళ వెంట్రిలాక్విజం..’’ అని పేర్కొంది జానూ. అమెరికా నుంచి ఒక బొమ్మను తెప్పించుకుని.. నెలల తరబడి శిక్షణ తీసుకుని.. దేశంలోనే తొలి ట్రాన్స్‌జెండర్‌ వెంట్రిలాక్విస్టుగా మారింది. అనేక ప్రదర్శనలు ఇచ్చింది. టీవీషోల్లోనూ పాల్గొంది. కన్నడ, హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో ప్రావీణ్యం సంపాదించుకుని.. తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది జానూ.

Updated Date - Oct 19 , 2025 | 11:48 AM