Tractor: ఈ ట్రాక్టర్‌కు డ్రైవర్ అవసరం లేదు...
ABN , Publish Date - Nov 02 , 2025 | 12:35 PM
పొలం పనులకు ట్రాక్టర్ ఉంటే ఆ భరోసానే వేరు. అయితే ట్రాక్టర్‌లో డీజిల్, దానిని నడిపేందుకు ఒక డ్రైవర్... కాస్త ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే. అదే ఈ మినీ ట్రాక్టర్‌ను పొలం గట్టుమీద కూర్చొని ఎంచక్కా రిమోట్‌తో నడపొచ్చు. డ్రైవర్‌తో పనే ఉండదు.
పొలం పనులకు ట్రాక్టర్ ఉంటే ఆ భరోసానే వేరు. అయితే ట్రాక్టర్‌లో డీజిల్, దానిని నడిపేందుకు ఒక డ్రైవర్... కాస్త ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే. అదే ఈ మినీ ట్రాక్టర్‌ను పొలం గట్టుమీద కూర్చొని ఎంచక్కా రిమోట్‌తో నడపొచ్చు. డ్రైవర్‌తో పనే ఉండదు. డీజిల్ కూడా అవసరం లేదు, పొలంలో రోజంతా నలుగురు కూలీలు చేసే పనిని కొన్ని గంటల్లోనే చక్కబెడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే రైతుకు పెట్టుబడి తగ్గించే నేస్తం ఈ ‘ఆటోమేటిక్ ట్రాక్టర్’.
రైతులకు ఎదురయ్యే సమస్యల్లో ముఖ్య మైనది పెట్టుబడి ఖర్చులు వివరీతంగా పెరిగిపోవడం. దీనివల్లనే రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని నిపుణులంటున్నారు. ఒకప్పటిలా పొలం పనులకు ఎద్దులను ఉపయోగించే పరిస్థితులు ఇప్పుడు లేవు. వాటిని పోషించే స్ధితిలో చిన్న రైతులు లేరు. అలాగని పెద్ద ట్రాక్టర్లను వాడే స్థోమత సన్నకారు రైతులకు లేదు. దానికి తోడు తీవ్రమైన కూలీల కొరత ఉంది. సేద్యంలో ఆర్థిక భారాన్ని తగ్గించడానికి ‘ఫార్మ్‌సాథీ’ అనే అంకుర సంస్థను హైదరాబాద్ శివారులో ఏర్పాటు చేసి, తన బృందంతో కలిసి అగ్రి టెక్నాలజీ పై మూడేళ్లుగా పరిశోధనలు చేస్తున్నాడు సుశాంత్.
అతని కృషిని గుర్తించిన హైదరాబాద్‌లోని ‘నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్‌మెంట్’ (ూఅఅఖక ) కొంత ఆర్థిక తోడ్పాటును అందించింది. దాంతో ఎలకా్ట్రనిక్ ట్రాక్టర్, డ్రైవర్ లెస్ ఆటోమేటిక్ ట్రాక్టర్‌లను రూపొందిం చారాయన. వీటితో ఏ పంటకైనా పిచికారీ చేయాలంటే ఎకరానికి కేవలం 50 రూపాయలకు మించి ఖర్చు కాదు, మహిళా రైతులు కూడా సులువుగా నడపవచ్చు. శబ్దకాలుష్యం ఉండదు.
‘ఎకరం పొలం దున్నాలన్నా, కలుపు తీయాలన్నా, మందులు పిచికారీ చేయాలన్నా పదిమంది కూలీలు కావాలి. ఇందుకోసం ఏడాదికి దాదాపు రూ.25 వేలకు పైగా ఖర్చు. రైతులకు ఈ ఆర్థిక భారం లేకుండా చేయడానికి, 22 హెచ్.పి.ఎలక్ట్రిక్ ట్రాక్టర్ రూపొందించాను.’ అని ‘ఫార్మ్‌సాఽథీ’ సీఈవో సుశాంత్ వివరించారు.

ఎవరైనా నడిపే ట్రాక్టర్
ఆటోమేటిక్ ట్రాక్టర్‌తో పాటు మరో బ్యాటరీ ట్రాక్టర్‌ను కూడా తయారు చేసిందీ సంస్ధ. ‘మూడేళ్ల క్రితం పొలం పనుల కోసం ఒక రోబో తయారు చేశాం. కొన్ని సాంకేతిక కారణాల వల్ల దానిని అన్ని రకాల పంటల మధ్య పనిచేయించడం కష్టమైంది. దానికి మరింత టెక్నాలజీ జోడించే పనిలో మా టీమ్ ఉంది. కొత్తగా ఇప్పుడు డ్రైవర్ లెస్ ట్రాక్టర్‌తో పాటు ఎలకా్ట్రనిక్ ట్రాక్టర్ రూపొందించాం. జహీరాబాద్‌లో కొందరు రైతులు వీటిని ఉపయోగిస్తున్నారు.
చెరకు, జామ, పామాయిల్, కొబ్బరి, మిర్చి తోటలు సహా పత్తి, జొన్న, వేరుశెనగ వంటి పంటల్లో వీటిని అన్ని పనులకు ఉపయోగించవచ్చు’ అన్నారు సుశాంత్.
విద్యుత్ లేనప్పుడు ఇన్వర్టర్‌గా...
‘గతంలో డీజిల్ ట్రాక్టరు వాడినపుడు ఏడాదికి రూ.10 వేలకు పైగా ఖర్చు అయ్యేది. ఇపుడు ఇ- ట్రాక్టర్ వాడటం వల్ల వెయ్యికి మించి ఖర్చు అవ్వడం లేదు. మా చుట్టు పక్కల రైతుల అవసరాలకు కూడా ఉచితం గానే ఇస్తున్నా. దీనివల్ల మరొక ఉపయోగం ఉంది. ఇ-ట్రాక్టర్ బ్యాటరీకి చిన్న పరికరం అమర్చితే, కరెంట్ పోయినపుడు ఇన్వర్టర్‌గా ఉపయోగపడుతుంది. సాగునీటి మోటారుగా పని చేస్తుంది. ఇంట్లో కూడా వాడుకోవచ్చు’ అన్నారు జహీరాబాద్ సమీపంలో వ్యవసాయం చేస్తున్న రైతు కిరణ్.
కాలుష్యానికి చెక్...
ఇ- ట్రాక్టర్ల వల్ల సేద్యం ఖర్చు తగ్గించడమే కాదు, పర్యావరణ ప్రయోజనం ఉంది. ఎలక్ట్రిక్ ట్రాక్టర్ వాడకంలో పొగ, కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ ఏవీ ఉండవు. ట్రాక్టర్ నడుస్తున్నప్పుడు ఇంజిన్ చప్పుడు ఉండదు. ఇంధన ఖర్చు లేదు. ఎలక్ట్రిక్ ట్రాక్టర్‌లో ఇంజిన్ ఆయిల్, ఫిల్టర్లు, గేర్‌బాక్స్ వంటి భాగాలు ఉండవు కాబట్టి మరమ్మతులు తక్కువే. ఒకసారి ఛార్జ్ చేస్తే వివిధ మోడల్స్‌ని బట్టి 4 నుంచి 6 గంటలు సులభంగా పనిచేస్తుంది. ప్రభుత్వం భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సిడీలు ఇస్తే రైతులకుమరింత లాభం. పర్యావరణ అనుకూల వ్యవసాయ పద్ధతులకు ఇ- ట్రాక్టర్లు ఒక రోల్ మోడల్.
- శ్యాంమోహన్, 94405 95858