హార్రర్ కామెడీ... ఫాంటసీ యాక్షన్... మహా వినోదం
ABN , Publish Date - Oct 19 , 2025 | 11:13 AM
తెరమీద ‘అద్భుతం’ ఆవిష్కృతమవుతోంది. సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తోంది. గ్రాఫిక్స్ మాయలతో యాక్షన్ విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోంది. మరోవైపు తెరమీద ‘హార్రర్’ ప్రేక్షకులను భయపెడుతూనే, చాలాసార్లు కామెడీతో నవ్విస్తోంది. ఈ రెండు జానర్‌ల సినిమాలకు ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.
తెరమీద ‘అద్భుతం’ ఆవిష్కృతమవుతోంది. సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తోంది. గ్రాఫిక్స్ మాయలతో యాక్షన్ విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోంది. మరోవైపు తెరమీద ‘హార్రర్’ ప్రేక్షకులను భయపెడుతూనే, చాలాసార్లు కామెడీతో నవ్విస్తోంది. ఈ రెండు జానర్‌ల సినిమాలకు ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అందుకే అన్ని భాషల్లో వీటి నిర్మాణం జోరందుకుంది. పెద్ద పెద్ద స్టార్లు సైతం ‘ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్స్’ను ఆవిష్కరించేందుకు... భయపెడుతూ నవ్వించేందుకు తెగ ఉత్సాహం చూపుతున్నారు. ఈ ‘మహా వినోదం’పైనే ఈ వారం కవర్‌స్టోరీ.
‘‘రాక్షసులు నిజమైతే... దెయ్యాలు కూడా నిజమైనవే. అవి మనలోనే నివసిస్తాయి. కొన్నిసార్లు అవి గెలుస్తాయి కూడా.’’
- ప్రసిద్ధ హార్రర్ నవలాకారుడు స్టీఫెన్ కింగ్ ‘ది షైనింగ్’లో అన్న మాటలివి.
. . .
‘‘హార్రర్‌కు కామెడీకి మధ్య సన్నటి తెర ఉంటుంది. మీరు భయపడి షాక్‌కు గురైన మరుక్షణం మీ రియాక్షన్ తప్పకుండా నవ్వే’’
- హార్రర్ సినిమాలతో వినోదాన్ని పంచిన ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ.
. . .

భయం అనేది ప్రతీ జీవికి సహజ లక్షణం. అయితే భయపడిన సందర్భాన్ని తలుచుకుని, ఆ తర్వాత హాయిగా నవ్వుకునేది మనిషి మాత్రమే. నిజానికి భయపడటం, భయపెట్టడం కూడా ఒకరకంగా వినోదమే. అందుకే తెర మీద హార్రర్ జానర్ అనేది ఎవర్‌గ్రీన్‌గా కనిపిస్తోంది. తరతరాలుగా వయోబేధం లేకుండా ప్రేక్షకులను భయపెడుతూనే వినోదాన్ని పంచుతోంది. బాడీ హార్రర్, వాంపైర్, జాంబీ, మాన్‌స్టర్, హార్రర్ థ్రిల్లర్స్, సైకలాజికల్ హార్రర్... ఇప్పుడిక హార్రర్‌కు కామెడీ కూడా జతకూడి ‘హార్రర్ కామెడీ’గా అన్ని భాషల్లో వెండితెర వినోదాన్ని రెట్టింపు చేస్తోంది.

‘స్ర్తీ2’ సంచలనం...
గత ఏడాది బాలీవుడ్‌లో విడుదలైన కామెడీ హార్రర్ ‘స్త్రీ2’ ప్రపంచవ్యాప్తంగా 857 కోట్ల రూపాయలు వసూలు చేసి సంచలనం సృష్టించింది. దర్శకుడు అమర్ కౌశిక్ ఏడేళ్ల క్రితం తీసిన ‘స్త్రీ’కి ఇది సీక్వెల్. రాజ్‌కుమార్ రావ్, శ్రద్ధాకపూర్, పంకజ్ త్రిపాఠీ తదితరులు నటించిన ఈ సినిమా ప్రేక్షకులను భయపెడుతూనే తెగ నవ్వించింది. ఫలితంగా 2024లో హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలవడమేగాకుండా, ఇప్పటిదాకా అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రాల్లో తొమ్మిదో స్థానంలో ఉంది. విడుదలైన కేవలం నాలుగు రోజుల్లోనే 200 కోట్ల రూపాయలను తన ఖాతాలో వేసుకుందంటే ప్రేక్షకులు ఈ కామెడీ హార్రర్ కోసం ఎంతగా ఎదురుచూశారో అర్థమవుతుంది. అదే ఏడాది దర్శకుడు అనీస్‌బాజ్మీ తీసిన ‘భూల్ భులయ్యా 3’ కూడా సూపర్‌హిట్ కావడంతో ఇలాంటి వినోదాత్మక చిత్రాలపై బాలీవుడ్ సీరియస్‌గా దృష్టి సారించింది.

కార్తీక్ ఆర్యన్, విద్యాబాలన్, మాధురీదీక్షిత్, త్రిప్తీ డిమ్రీ వంటి స్టార్లు నటించిన ‘భూల్ భులయ్యా 3’ ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 424 కోట్లు వసూలు చేసింది. అలాగే తక్కువ బడ్జెట్‌తో (రూ.30 కోట్లు) దర్శకుడు ఆదిత్య సర్పోత్‌దార్ తీసిన ‘ముంజ్యా’ కూడా సుమారు రూ. 133 కోట్లకు పైగా వసూలు చేసి సత్తా చాటింది. ఇందులో స్టార్ సపోర్ట్ లేకున్నా... 1952లో కొంకన్ ప్రాంతంలోని ఒక గ్రామంలో జరిగిన సంఘటనలకు, ప్రస్తుతాన్ని ముడిపెట్టి అందర్నీ భయపెడుతూనే నవ్వుల జల్లు కురిపించాడు. సత్యరాజ్ కూడా కీలక భూమిక పోషించడం విశేషం. బాలీవుడ్‌లో ఈ జోరు ఎక్కడా తగ్గకుండా కొనసాగుతూనే ఉంది. తాజాగా ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా విడుదలకు సిద్ధమైన (అక్టోబర్ 21) ‘ఽథామా’ కూడా ఇదే కోవలోకి వస్తుంది. ఈ రొమాంటిక్ కామెడీ హార్రర్‌పై భారీ అంచనాలే ఉన్నాయి. ఇదిలా ఉంటే... అక్షయ్‌కుమార్, అజయ్‌దేవగన్, సంజయ్‌దత్, అమితాబ్, దీపికా పదుకొణే, విద్యాబాలన్, కాజోల్, వంటి స్టార్లు సైతం ఈ తరహా చిత్రాల్లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

ప్రభాస్ కూడా ఇదే బాటలో...
పాన్ ఇండియా స్టార్‌గా పేరొందిన ప్రభాస్... యాక్షన్, రొమాన్స్‌కు ఈసారి హార్రర్‌ను కూడా జత చేస్తున్నట్టు కనిపిస్తోంది. ‘రాజాసాబ్’గా భయపెడుతూనే ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని పంచేందుకు దర్శకుడు మారుతీ సిద్ధమవుతున్నట్టు టీజర్, ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ‘పుట్టలో చేయి పెడితే కుట్టడానికి నేనేమైనా చీమనా... రాక్షసుణ్ణి’ అంటూ విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్న ప్రభాస్ వైపు పాన్ ఇండియా ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు. దర్శకుడు మారుతీ 12 ఏళ్ల క్రితం విజయవంతమైన హార్రర్ కామెడీ ‘ప్రేమకథా చిత్రమ్’కు రచయిత, నిర్మాత కావడం విశేషం.
ఈ ఏడాది సమంత నిర్మించిన ‘శుభం’ కూడా ఈ తరహా సినిమాలపై ఆసక్తిని రెట్టింపు చేసిందనే చెప్పొచ్చు. భీమిలీలో కేబుల్ టీవీ నిర్వహించే ముగ్గురు మిత్రులు, టీవీ సీరియల్స్ చూసే వారి భార్యల చుట్టూ తిరిగే ఈ హార్రర్ కామెడీ అందర్నీ భయపెడుతూనే తెగ నవ్వించింది. ఈ చిత్రాన్ని యువ దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల తీశారు. ‘ఊరు పేరు భైరవకోన’, ‘ఓం భీమ్ బుష్’వంటి చిత్రాలూ ఇదే కోవలోకి వస్తాయి.
గత దశాబ్దకాలంగా తెలుగులో ఇలాంటి ప్రయత్నాలు చాలానే జరిగాయి. ‘గీతాంజలి’, ‘రాజుగారి గది’, ‘ఆనందో బ్రహ్మ’, ‘ఇంట్లో దెయ్యం నాకేం భయం’ వంటి అనేక చిత్రాలు ప్రేక్షకులను భయపెడుతూనే ఆకట్టుకున్నాయి. దీనికితోడు ఇతర భాషల నుంచి వచ్చే అనువాద చిత్రాలు కూడా మనదగ్గర బాగానే ఆడాయి. వాటిలో ‘కాంచన’, ‘చంద్రముఖి’లను ప్రముఖంగా చెప్పుకోవాలి.

మలయాళం జోరు...
హార్రర్ కామెడీ జానర్ ట్రెండ్ మలయాళంలో ముందు నుంచి కాస్త ఎక్కువే. జితు మాధవన్ దర్శకుడిగా తన అరంగ్రేటానికి ఈ జానర్‌నే ఎంచుకోవడం విశేషం. రెండేళ్ల క్రితం అతను తీసిన ‘రోమాంచం’ (అంటే రోమాంచితం) పేరుకు తగ్గట్టే ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించింది. సరదాగా ‘ఓయిజా బోర్డు’ (స్పిరిట్ బోర్డ్)ను ఉపయోగించి మాట్లాడే దెయ్యాన్ని తీసుకొచ్చినట్టు నమ్మిస్తే... అది నిజంగానే వస్తే జరిగే పరిణామాల చుట్టూ అల్లుకున్న కథ ఆద్యంతం అలరిస్తుంది. 2023లో మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన ఐదో చిత్రంగా రికార్డుల్లోకి ఎక్కింది. మూడు కోట్ల లోపు బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా రూ.70 కోట్లకు పైగా వసూలు చేయడం ఓ సంచలనం. ఇదే చిత్రాన్ని హిందీలో ఈ ఏడాది ‘కప్కకీ’గా రీమేక్ చేశారు. దీనితో పాటు ‘హలో మమ్మీ’, ‘సుమతి వలపు’ వంటి అనేక సినిమాలతో ఇటు వెండితెరపై, అటు ఓటీటీల్లోనూ ఈ ట్రెండ్ దూసుకుపోతోంది.
తమిళంలో చాలా ఏళ్ల క్రితమే ఈ ట్రెండ్ మొదలైనప్పటికీ ఈమధ్య కాలంలో వెనక్కి తగ్గారనే చెప్పాలి. అప్పట్లో డ్యాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్ హీరోగా మారి ఈ ట్రెండ్‌కు తమిళంలో జోష్ తెచ్చాడు. ఆయన తీసిన ‘ముని’, ‘కాంచన’, ‘శివలింగ’ ప్రేక్షకులను భయపెడుతూనే తెగ నవ్వించాయి. తెలుగులోకి కూడా అనువాదమయ్యాయి. అదే స్ఫూర్తితో ‘అరణ్మయి’, ‘డార్లింగ్’, ‘డీడీ రిటర్న్స్’ వంటివి వెలుగుచూశాయి. ఈ విషయంలో తమిళుల కన్నా కన్నడీగులే ముందున్నారు. కన్నడంలో విడుదలైన ‘స్పూకీ కాలేజ్’, ‘నమో భూతాత్మ’, ‘మోదల మళే’, ‘ఛూమంతర్’ చక్కని విజయాలను నమోదు చేశాయి.

మహల్, మహిళ కామన్...
సాధారణంగా హార్రర్ కామెడీల కథాంశాలు పరిమితంగానే ఉంటాయనేది వాస్తవం. ఒక మిత్ర బృందం పాడుబడ్డ బంగ్లాలోకి లేదా మహల్‌లోకి వెళ్లడం... అప్పటికే ఏదో ఒక కారణం వల్ల మరణించిన మహిళ ఆత్మ భయపెట్టడం... ఆ భయంలోంచి కామెడీ పుట్టడం జరుగుతుంది. అంటే హార్రర్ కామెడీల్లో ఊరికి దూరంగా ఉండే మహల్, మహిళ ప్రధాన పాత్రలుగా కనిపిస్తాయి. అనుబంధంగా శ్మశానాలు, దెయ్యాల్ని పట్టి బంధించే క్షుద్ర స్వాములు, ఫకీరులు, అనుమానస్పదంగా కనిపించే కొన్ని పాత్రలు (వాచ్‌మ్యాన్, వంట మనిషి, డ్రైవర్), నేపథ్య సంగీతం ఈ తరహా సినిమాలకు బ్యాకప్ లాంటివి. అయినప్పటికీ ఇలాంటి భయపెడుతూ నవ్వించే సినిమాలకు తిరుగులేదని ఇటీవలి హిట్ చిత్రాలను చూస్తే అర్థమవుతుంది.
అద్భుతాల ‘ఫాంటసీ యాక్షన్’
తెర మీద హీరో దైవబలం, గ్రాఫిక్స్ సహకారంతో యాక్షన్ చేస్తుంటే... ఒక రకంగా రాక్షస సంహారం గావిస్తుంటే... ప్రేక్షకులకు కన్నుల పండగే. ఈ ‘ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్’ అనేది భారతీయ సినిమాకు ప్రధాన బలం. ప్రతీ హీరో ఇలాంటి ఒక అవకాశం కోసం ఎదురుచూస్తుంటారు. ఇటీవల కాలంలో పురాణ, ఇతి హాసాలను, జానపద, పౌరాణిక గాథల్లోని సంఘటనలను స్ఫూర్తిగా చేసుకుని అందమైన చందమామ కథలను అల్లుకుంటున్నారు. గ్రాఫిక్స్‌తో మాయాప్రపంచాన్ని సృష్టించి అందులోకి హీరోతో పాటు ప్రేక్షకుల్ని తీసుకెళ్తున్నారు. న్యూజనరేషన్‌లో తేజా సజ్జా ‘హనుమాన్’, ‘మిరాయ్’ ఈ కోవలోకే వస్తాయి.

దేశవ్యాప్తంగా ఇలాంటి ‘సూపర్ హీరో’ అద్భుతాలను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఉండటంతో వీటికి పాన్ ఇండియా స్థాయిలో ఆదరణ దక్కుతోంది. హనుమంతుడి రక్తపు చుక్క నుంచి పుట్టిన ఒక దైవిక రత్నాన్ని ధరించిన హీరో కథగా ‘హనుమాన్’ ఆకట్టుకుంటే... దుష్టశక్తి నుంచి కాపాడేందుకు, రాముడి కోదండాన్ని మిరాయ్ అనే అస్త్రంగా చేసుకున్న హీరో సాహసోపేతంగా చేసిన సాహసాలే ‘మిరాయ్’. ఈ రెండు సినిమాల విజయాలు ఈ తరహా జానర్‌కు మరింత శక్తినిచ్చినట్టయ్యింది. అంతకుముందు ‘కార్తికేయ’, ‘విరూపాక్ష’ వంటి కొన్ని చిత్రాలు ఇలాంటి ‘అద్భుతాలే’ చేశాయి.
అప్పట్లో ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’, ‘అంజి’ వంటి చిత్రాలతోనే ఇలాంటి మేజిక్‌లు చేసిన అగ్రహీరో చిరంజీవి ‘విశ్వంభర’తో మరోసారి మెస్మరైజ్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. మహేష్‌బాబుతో అగ్ర దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి హాలీవుడ్ లెవెల్లో తెరకెక్కిస్తున్న ‘ఎస్‌ఎస్‌ఎంబీ29’ (వర్కింగ్ టైటిల్) కూడా ‘యాక్షన్ అడ్వెంచర్’ కోవలోనిదే. తెలుగులో ఇంకా ఇలాంటి ప్రయత్నాలు చాలానే జరుగుతున్నాయి. హిందీలో ఇప్పటికే రణ్‌బీర్‌కపూర్ ‘బ్రహ్మాస్త్ర’, ప్రభాస్ ‘కల్కి’ ప్రేక్షకులకు థ్రిల్‌ను పంచాయి. ఇటీవల విడుదలైన రిషబ్‌శెట్టి ‘కాంతార చాప్టర్ 1’ మరోసారి ఈ తరహా యాక్షన్‌పై బలమైన ముద్ర వేసింది. తమిళ, మలయాళం స్టార్లు కమల్‌హాసన్, విక్రమ్, సూర్య, కార్తి, మోహన్‌లాల్, మమ్ముట్టి వంటివారు తరచూ ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు.

హీరోల స్టార్‌డమ్‌కు గ్రాఫిక్స్ తోడవ్వడంతో ఈ తరహా ‘ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్స్’... చందమామ కథల్లాగా ఉంటూ... హాలీవుడ్ స్థాయి చిత్రాల్లాగా కనిపించి, ప్రేక్షకులను సరికొత్త అద్భుత ప్రపంచంలోకి తీసుకెళ్తున్నాయి. మొత్తానికి ట్రెండ్‌ను జాగ్రత్తగా పరిశీలిస్తే ఇటీవల కాలంలో మన సినిమాల్లో భయం, అద్భుతం... ‘మహా వినోదం’గా విరాజిల్లుతున్నాయి. విజయాలతో విజృంభిస్తున్నాయి.
- చల్లా
సక్సెస్ జోష్
రెండు జానర్లలో విజయవంతమైన కొన్ని చిత్రాలివి...
సక్సెస్ జోష్
రెండు జానర్లలో విజయవంతమైన కొన్ని చిత్రాలివి...
- స్త్రీ2 (హిందీ)
- భూల్‌భులయ్యా3 (హిందీ)
- శుభం (తెలుగు)
- గీతాంజలి (తెలుగు)
- రాజుగారి గది (తెలుగు)
- రోమాంచం (మలయాళం)
- హలో మమ్మీ (మలయాళం)
- సుమతి వలపు (మలయాళం)
- స్పూకీ కాలేజ్ (కన్నడ)
- ఛూమంతర్ (కన్నడ)
- కాంచన (తమిళం)
- డీడీ రిటర్న్స్ (తమిళం)
- మిరాయ్ (తెలుగు)
- కార్తికేయ (తెలుగు)
- హనుమాన్ (తెలుగు)
- బ్రహ్మాస్త్ర (హిందీ)
- కాంతార (కన్నడ)
సీక్వెల్స్‌కు మంచి గిరాకీ
హిట్టయిన మిగతా జానర్‌లకు కొనసాగింపు కథలను తయారుచేసుకోవడం కాస్త కష్టమే. అయితే హార్రర్ కామెడీలకు ఈ విషయంలో ఆకాశమే హద్దు. అందుకే వీటికి సీక్వెల్‌తో పాటు మూడు, నాలుగు భాగాలు కూడా వస్తున్నాయి. ‘స్త్రీ’, ‘భూల్ భులయ్యా’తో పాటు ‘రాజుగారి గది’, ‘కాంచన’, ‘గీతాంజలి’ వంటి ఎన్నో ఉదాహరణలున్నాయి.
అతడు ప్రత్యేకం
ప్రస్తుతం హార్రర్ కామెడీ స్టార్‌గా బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావ్‌కు విశేష గుర్తింపు ఉంది. అతడు 2018లో ‘స్త్రీ’లో విక్కీగా అందరికీ గుర్తుండిపోయాడు. చక్కని టైమింగ్‌తో నటించే రాజ్‌కుమార్ రావ్ ఆ సినిమా తర్వాత విపరీతమైన స్టార్‌డమ్ సొంతం చేసుకున్నాడు. 2021లో వచ్చిన ‘రూహీ’లో దెయ్యం పట్టిన జాహ్నవీ కపూర్‌తో అతడు పడే బాధలు నవ్విస్తాయి. గత ఏడాది ‘స్త్రీ2’ బాక్సాఫీస్ సక్సెస్‌తో ఈ జానర్ చిత్రాల్లో తిరుగులేని స్టార్‌గా మారాడు. అతడి ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ‘స్త్రీ3’ కి కూడా సన్నాహాలు చేస్తున్నారు.