ఈ గ్రామాన్ని మర్చిపోలేరు మరి.. ఎందుకో తెలిస్తే..
ABN , Publish Date - Oct 19 , 2025 | 09:44 AM
ఆ గ్రామంలోని వాళ్లంతా ఒక ప్రణాళిక బద్ధమైన జీవనం గడుపుతుంటారు. అయితే నిఘా కెమెరాలు వారి చర్యలను అనుక్షణం గమనిస్తుంటాయి. సరుకులు ఇచ్చే వ్యక్తి నుంచి... హెయిర్ స్టయిలిస్ట్, డెంటిస్ట్, వెయిటర్... ఇలా ప్రతీ ఒక్కరు ప్రణాళికలో భాగంగా అక్కడ పనిచేస్తుంటారు.
ఒక చిన్న గ్రామం... తెలతెలవారుతుండగానే ఆ ఊళ్లో ఎవరి పనుల్లో వాళ్లు బిజీ అయిపోయారు. కొంతమంది ఇంట్లోకి అవసరమైన కూరగాయలు, సరుకులు తెస్తుంటే... మరికొందరు స్నేహితులతో పిచ్చాపాటిగా ముచ్చటిస్తున్నారు. ఇంకొందరు రెస్టారెంట్లలో కాఫీ సిప్ చేస్తూ పేపర్ తిరగేస్తున్నారు. అయితే అది సాధారణ గ్రామం అనుకుంటే... మీరు పొరబడినట్టే. ఎందుకంటే... ప్లాన్ ప్రకారం సెట్ చేసిన గ్రామం అది. అక్కడ నివసించే వారంతా ‘డిమెన్షియా’ వ్యాధిగ్రస్తులే. అలాంటి వారికోసం ఏర్పాటు చేసిన మొట్టమొదటి గ్రామంగా గుర్తింపు ఉంది. ఆ గ్రామ విశేషాలే ఇవి...
ఆ గ్రామంలోని వాళ్లంతా ఒక ప్రణాళిక బద్ధమైన జీవనం గడుపుతుంటారు. అయితే నిఘా కెమెరాలు వారి చర్యలను అనుక్షణం గమనిస్తుంటాయి. సరుకులు ఇచ్చే వ్యక్తి నుంచి... హెయిర్ స్టయిలిస్ట్, డెంటిస్ట్, వెయిటర్... ఇలా ప్రతీ ఒక్కరు ప్రణాళికలో భాగంగా అక్కడ పనిచేస్తుంటారు.
‘డిమెన్షియా’ వ్యాధిగ్రస్తుల కోసం ఏర్పాటు చేసిన ఆ ఊరి పేరు ‘హోగ్‌వే’. అమ్‌స్టర్‌డ్యామ్‌కు సమీపంలో ఉంది.
‘డిమెన్షియా’ బారిన పడినవారికి సాధారణంగా ఏదీ గుర్తుండదు. బయటకు వెళితే ఇంటి చిరునామా మరిచిపోతారు. వాళ్ల పేరు అడిగినా చెప్పలేకపోతారు. కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు ఎప్పుడూ వెంట ఉండి చూసుకోవాల్సి ఉంటుంది. వైద్య సేవలు అందించేందుకు ఒక నర్సు కావాల్సిందే. అరవై ఏళ్లు పైబడిన వారిలో ఎక్కువగా కనిపించే ఈ సమస్య కుటుంబసభ్యులను ఆందోళనకు గురిచేస్తుంది. ముఖ్యంగా అందరూ ఉద్యోగాలు చేసే వారైతే చెప్పనక్కర్లేదు. అలాంటి ఇబ్బందులను దూరం చేసేందుకు ఊరు లాంటి నర్సింగ్‌హోమ్‌ను ఏర్పాటు చేశారు. ఈ కమ్యూ నిటీలో అందరూ డిమెన్షియా వ్యాధిగ్రస్తులే.
అంతా సెట్టింగే...
చూడగానే అది ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఊరని అర్థమవుతుంది. ఇళ్లన్నీ ‘డిమెన్షియా’ వ్యాధిగ్రస్తుల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసి ఉంటాయి. అందరూ ఉమ్మడి ఇళ్లలో నివసిస్తారు. ఎవరు ఏ ఇంట్లోకి అయినా వెళ్లవచ్చు. ప్రత్యేకంగా నిబంధనలు అంటూ ఏమీ ఉండవు. థియేటర్, సరుకుల దుకాణాలు, పోస్టాఫీసు, గార్డెన్, క్లబ్... ఇలా సకల సదు పాయాలు ఉంటాయి. ఊరిలో డిమెన్షియాతో బాధపడుతున్నవారు సుమారు 150 మంది నివసిస్తున్నారు. ఇక కేర్‌టేకర్లు 250 మంది వరకు ఉంటారు. షాప్‌కీపర్, వెయిటర్, హౌజ్ కీపర్స్... ఇలా అక్కడ పనిచేసే ఉద్యోగు లందరూ హోగ్‌వే కమ్యూనిటీలో భాగమే.

‘హోగ్‌వే’ కాన్సెప్ట్‌ను ప్రవేశపెట్టింది వైవోన్ వాన్ అమెరొంజెన్. ఆమె డచ్ నర్సింగ్‌హోమ్‌లో స్టాఫ్ మెంబర్‌గా పనిచేసే సమయంలో తట్టిన ఆలోచనే ‘హోగ్‌వే’ జీవనం. 2009లో ఆమె దీన్ని ప్రారంభించారు. ప్రత్యేకంగా డిమెన్షియా బాధితుల కోసం ఏర్పాటయిన మొట్టమొదటి గ్రామంగా ఇది గుర్తింపు పొందింది. అక్కడ రెండతస్తుల ఇళ్లు 30 వరకు ఉన్నాయి. నాలుగు ఎకరాల క్యాంపస్‌లో ఇతర సదుపాయాలు కల్పించారు. ఒక్కో ఇంట్లో ఆరు నుంచి ఏడుగురు నివసిస్తుంటారు. ఒకరు లేక ఇద్దరు కేర్‌టేకర్లు ఉంటారు. అందరూ తమకు నచ్చిన ఆహారాన్ని తింటారు. నచ్చిన యాక్టివిటీస్ చేస్తుంటారు.
ప్రత్యేక పర్యవేక్షణ
సూపర్‌మార్కెట్, రెస్టారెంట్ల నుంచి వారికి నచ్చింది కొనుగోలు చేసుకునేందుకుకొంత డబ్బును అందజేస్తారు. ఆ డబ్బును సూపర్ మార్కెట్లో ఇచ్చి వారికి కావలసింది తెచ్చు కుంటారు. అయితే అది ఫేక్ కరెన్సీ అనే విషయం వారికి తెలియదు. కొన్నిసార్లు సూపర్‌మార్కెట్లో సరుకులు తీసుకుని డబ్బులు ఇవ్వకుండానే వచ్చేస్తుంటారు. ఈ ఏర్పాట్ల వెనక లక్ష్యం ఏమిటంటే... ప్రతి ఒక్కరూ స్వయంగా పనిచేసుకునే భావన కోల్పోకూడదని. ‘డిమెన్షియా’ బారిన పడినవారి విషయంలో చిన్న చిన్న అంశాలు కూడా ప్రభావాన్ని చూపి స్తుంటాయి. ‘‘కాఫీలో షుగర్ వేసిన విషయం మాకు తెలుసు. అయినా కూడా ప్రతిరోజూ ‘కాఫీలో షుగర్ వేసుకుంటారా?’ అని అడుగుతాం. ఇది వారికి ఇష్టమైనది ఎంపిక చేసుకునేందుకు ఉపయోగపడుతుంది’’ అని ఫెసిలిటీ మేనేజర్ వాన్ హాల్ అంటారు. డిమెన్షియా వ్యాధిగ్రస్తులు సంతృప్తికరమైన జీవనం గడిపేందుకు అవసరమైన చర్యలన్నీ అక్కడ తీసుకుంటారు. మందులు అందిస్తూ, మంచి ఆహారం ఇస్తూ సంతోషంగా ఉండేలా చూస్తారు.