Himalayan Brown Bear: హిమాలయాల్లో ఐరన్ టిన్.. పాపం ఆ ఎలుగుబంటి..
ABN , Publish Date - Nov 03 , 2025 | 08:52 PM
ఎలుగు బంటిని తాళ్లతో కట్టేసి దూరంగా తీసుకువచ్చారు. ఆర్మీ క్యాంప్ షెడ్‌లో ఎంతో కష్టపడి దాని తలకు ఉన్న టిన్‌ను కట్ చేశారు. తర్వాత బయటకు తీసుకు వచ్చి విడుదల చేశారు.
మనిషి తన స్వార్థ బుద్ధితో జనావాసాలు, అడవులు, సముద్రాలను విపరీతంగా పాడు చేస్తున్నాడు. తోటి జీవులు బతకడానికి ఇబ్బందిపడేలా చెత్తతో నింపేస్తున్నాడు. ఇప్పుడు హిమాలయాలను పాడు చేసేందుకు సిద్ధమయ్యాడు. క్రమంగా హిమాలయాలపై వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. తద్వారా అక్కడ నివసించే జీవులు ఇబ్బందులు పడుతున్నాయి. ఇందుకు తాజా సంఘటనే ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది.
ఇంతకీ ఏం జరిగిందంటే.. సాధారణ జనం వెళ్లడానికి కూడా ఆలోచించే హిమాలయాల్లోని సియాచెన్‌లో హిమాలయన్ బ్రౌన్ ఎలుగు బంటి ఐరన్ టిన్ కంటైనర్‌లో తలపెట్టింది. తల ఆ టిన్‌లో ఇరుక్కుపోయింది. అది తలను దాన్నుంచి బయటకు తీయడానికి చాలా ప్రయత్నించింది. అయినా దాని వల్ల కాలేదు. ఊపిరి ఆడక అటు, ఇటు తిరగసాగింది. ఇండియన్ ఆర్మీ సైనికులు ఎలుగుబంటిని చూశారు. వెంటనే దాన్ని రక్షించడానికి రంగంలోకి దిగారు.
ఎలుగు బంటిని తాళ్లతో కట్టేసి దూరంగా తీసుకువచ్చారు. ఆర్మీ క్యాంప్ షెడ్‌లో ఎంతో కష్టపడి దాని తలకు ఉన్న టిన్‌ను కట్ చేశారు. తర్వాత బయటకు తీసుకు వచ్చి విడుదల చేశారు. ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కశ్వాన్ ఇందుకు సంబంధించిన వీడియోను తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. 2 నిమిషాల 40 సెకన్ల నిడివి ఉన్న ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న కొంతమంది నెటిజన్లు ‘హిమాలయాల్లోకి ఆ టిన్ ఎలా వచ్చింది. ఆఖరికి హిమాలయాలను కూడా పాడు చేస్తున్నారా’ అంటూ మండిపడుతున్నారు. మరి కొంతమంది ‘ఆ టిన్ ఆర్మీ వాళ్లది అయి ఉండొచ్చు’ అని అంటున్నారు.
ఇవి కూడా చదవండి
యువతి ప్రేమ వివాహం.. దారుణానికి ఒడిగట్టిన తండ్రీకొడుకులు..
కార్తీక పౌర్ణమి నుంచి ఈ రాశులకు గజకేసరి యోగం..