Schoolboy Narrowly Escapes: ఆ దేవుడే కాపాడాడు.. కొంచెం ఉంటే ప్రాణాలు పోయేవి..
ABN , Publish Date - Nov 23 , 2025 | 09:45 PM
కారు కిందపడ్డ బాలుడు స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. స్కూలు నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఓ బాలుడు అనుకోకుండా కారు కిందపడిపోయాడు. కారు అతడి మీద నుంచి వెళ్లినా కూడా అతడికి ఏమీ కాలేదు. స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. గ్రేటర్ నోయిడాకు చెందిన ఓ బాలుడు తన తల్లిదండ్రులతో కలిసి అజ్‌నారా హోమ్స్ సొసైటీలో ఉంటున్నాడు. నవంబర్ 19వ తేదీన స్కూలుకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే సొసైటీ గేటు దగ్గర అనుకోని ప్రమాదం చోటుచేసుకుంది.
ఆ బాలుడు సొసైటీ గేటు ముందు పరుగులు పెడుతూ కిందపడిపోయాడు. అప్పుడే అటు వైపు ఓ కారు వచ్చింది. కింద పడ్డ బాలుడ్ని కారు డ్రైవర్ చూసుకోలేదు. కారును బాలుడి మీదకు పోనిచ్చాడు. కారు బాలుడ్ని కొద్ది దూరం లాక్కుపోయింది. బాలుడు గట్టిగా కేకలు వేయటం మొదలెట్టాడు. దీంతో కారు డ్రైవర్ వెంటనే కారు ఆపేశాడు. అక్కడున్న వారు హుటాహుటిన కారు దగ్గరకు వచ్చారు. కారు కింద పడ్డ బాలుడ్ని బయటకు తీశారు. అదృష్టం బాగుండి ఆ బాలుడికి ఏమీ కాలేదు. స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.
కారు దగ్గరకు వచ్చిన కొంతమంది స్థానికులు కారు డ్రైవర్‌ను తిట్టి, కొట్టడానికి కూడా ప్రయత్నించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘నిజంగా ఆ బాలుడ్ని దేవుడే కాపాడాడు. లేదంటే ప్రాణాలు పోయేవి’..‘కారు మధ్యలో పడ్డంతో బాలుడికి ఏమీ కాలేదు. కొంచెం అటు, ఇటు అయినా చక్రాల కిందపడి నలిగిపోయేవాడు’..‘ఆ డ్రైవర్ కళ్లు నెత్తిన పెట్టుకుని కారు నడుపుతున్నాడా? ముందు ఏం జరుగుతోందో చూసుకోవాలి కదా’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
సింధ్ భారత్‌లోకి రావచ్చు, సరిహద్దులు మారవచ్చు.. రాజ్‌నాథ్ కీలక వ్యాఖ్యలు
మీ ప్రతిభకు టెస్ట్.. ఈ ఫొటోల్లోని నాలుగు తేడాలను 30 సెకెన్లలో కనిపెట్టండి