Share News

Google Doodle: నేటి గూగుల్ డూడుల్.. వివరణ తెలుసా...

ABN , Publish Date - Nov 12 , 2025 | 01:20 PM

2025 నవంబర్ 12న ఓ ప్రత్యేకతను చాటుకుంటూ గూగుల్ డూడుల్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్‌పై దృష్టి సారించింది. దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవండి.

Google Doodle: నేటి గూగుల్ డూడుల్.. వివరణ తెలుసా...
Google Doodle

ఇంటర్నెట్ డెస్క్: ఏరోజు ప్రత్యేకతను ఆరోజు చాటుకుంటూ కొంతకాలంగా యూజర్లకు మరింత ఆకర్షణగా నిలుస్తోంది గూగుల్ డూడుల్(Google Doodle). ఏటా నవంబర్ 12న.. గూగుల్ ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ గణిత సూత్రాలలో ఒకదానిని ఎంచుకుని దానిని హైలెట్ చేస్తుంది. ఇలా నేడు వర్గ సమీకరణం(Quadratic Equation)పై ఫోకస్ చేసింది. ఇండియా(India)లోని డూడుల్ ax²+bx+c=0 అనే వర్గ సమీకరణాన్ని చూపిస్తోంది. ఫిజిక్స్, ఇంజినీరింగ్, స్పోర్ట్స్, వ్యాపార రంగంలో కూడా ఈ సాధారణ సమీకరణం ఎలా ఉపయోగపడుతుందో డూడుల్ తెలియజేస్తోంది.


డూడుల్‌పై క్లిక్ చేయడం వల్ల గూగుల్ జెమిని ఏఐ(Gemini AI)లోకి ప్రవేశిస్తుంది. ఇది వర్గ సమీకరణం బాస్కెట్‌బాల్ కదలికను ఎలా మోడల్ చేస్తుందో చూపిస్తుంది. వినియోగదారుల వేగం, సమయం, ఎత్తు కోసం సంఖ్యలను ప్లగ్‌ఇన్ చేయవచ్చు. ఇందులో బంతి మార్గం మార్పునూ గమనించవచ్చు. ఇది నిజ జీవితంలో తరగతి గది ఫార్ములా ఎలా పనిచేస్తుందో పరిశీలించడాన్ని సులభతరం చేస్తుంది.


క్లాస్‌రూమ్ నుంచి బాస్కెట్‌బాల్ కోర్టుకు..

బీజగణితంలో వర్గ సమీకరణం అనేది ఒక కీలకమైన అంశం. చాలా మంది విద్యార్థులకు ఇది మొదట్లో కష్టంగా అనిపిస్తుంది. కానీ ప్రపంచంలోని అనేక వాస్తవ పరిస్థితులను వివరిస్తుంది. అలాగే భౌతిక శాస్త్రంలో ఇది కదలికలో ఉన్న వస్తువుల మార్గాన్ని చూపుతుంది. ఇంజనీర్లు వంతెనలు, రోలర్ కోస్టర్లు, ర్యాంప్‌లను రూపొందించడానికి ఇది ఎంతగానో ఉపకరిస్తుంది. భవనాలలో వక్రతలను లెక్కించడానికి ఆర్కిటెక్ట్‌లు దీనిని ఉపయోగిస్తారు. వ్యాపారంలోనూ ఇది ఆదాయ, వ్యయాలను లెక్కించడంలో తోడ్పడుతుంది. ఈ ఫార్ములా ద్వారా బాస్కెట్ బాల్ ఎత్తునూ గణించవచ్చు.


చరిత్ర..

ఈ వర్గ సమీకరణం ఫార్ములాకు ఏళ్ల చరిత్ర ఉంది. బాబిలోనియన్లు, ఈజిప్షియన్లు సహా భారతదేశంలోని ప్రాచీన గణిత శాస్త్రజ్ఞులు వీటిపై ఎంతో కృషి చేశారు. క్రీ.శ.7వ శతాబ్దంలో భారతీయ గణితవేత్త బ్రహ్మగుప్తుడు వాటిని పరిష్కరించే పద్ధతుల గురించి రాశారు.


గూగుల్ ఎందుకు హైలెట్ చేస్తోందంటే..

గూగుల్ ఈ డూడుల్‌ను తొలుత 2025 సెప్టెంబర్‌లో అమెరికాలో ప్రదర్శించింది. ఆ తర్వాత నేడు ఇండియాలో ప్రదర్శిస్తోంది. ఈ ఫార్ములా ద్వారా గూగుల్.. గణితమనేది పాఠ్యపుస్తకాలలో ఉన్న విషయం మాత్రమే కాదని సంకేతమిస్తోంది. ఇది విద్యార్థులకు తరగతి గది పాఠాలను నిజ జీవిత ఉదాహరణలతో అనుసంధానించడానికి సాయపడుతుందని ఉపాధ్యాయులు అంటున్నారు. ఫార్ములాలు ఆచరణాత్మక అనువర్తనాలను కలిగి ఉన్నాయని, అనేక వృత్తులలో భాగమని కూడా విద్యార్థులకు తెలియపరుస్తుందీ డూడుల్.


గణితాన్ని కనిపించేలా చేయడం..

గణితాన్ని సులభతరం చేసుకోవడానికి పాఠశాలలు ఇంటరాక్టివ్ లెస్సన్స్, యాప్‌లను ఉపయోగిస్తున్నాయి. బాస్కెట్‌బాల్ షాట్ లేదా ఫౌంటెన్‌లో పారాబొలాను చూడటం వల్ల విద్యార్థులు సంఖ్యలను వాస్తవ ప్రపంచానికి అనుసంధానించడంలో సాయపడుతుంది. విద్యార్థులు a, b, c విలువలను మార్చడం ద్వారా వర్గ సమీకరణంతో ప్రయోగాలు చేయవచ్చు. ఇది బీజగణితానికి ప్రాణం పోసే ఒక సాధారణ కార్యకలాపం.


ఇవీ చదవండి:

ఢిల్లీ పేలుళ్లు.. నిధులు సమీకరణలో కీలకంగా మహిళా డాక్టర్

ఎన్డీయేదే విజయం.. 7 ఎగ్జిట్ సర్వేలు జోస్యం

Updated Date - Nov 12 , 2025 | 01:48 PM