Cycle: సైకిల్‌పై ఏకంగా ఈఫిల్ టవర్ ఎక్కి...
ABN , Publish Date - Oct 26 , 2025 | 01:57 PM
ఫ్రెంచ్ సైక్లిస్ట్, టిక్‌టాక్ స్టార్ అరోలియాన్ ఫాంటోనోయ్ మామూలోడు కాదు... సైకిల్‌పై ఏకంగా ఈఫిల్ టవర్ ఎక్కి అరుదైన రికార్డు సృష్టించాడు. ఎక్కడా ఆపకుండా, కాళ్లు నేలపై పెట్టకుండా ఏకంగా 686 మెట్లను కేవలం 12 నిమిషాల 30 సెకన్లలో ఎక్కి ప్రపంచ రికార్డు సృష్టించాడు.
- ఈఫిల్... సైకిల్...
ఫ్రెంచ్ సైక్లిస్ట్, టిక్‌టాక్ స్టార్ అరోలియాన్ ఫాంటోనోయ్ మామూలోడు కాదు... సైకిల్‌పై ఏకంగా ఈఫిల్ టవర్ ఎక్కి అరుదైన రికార్డు సృష్టించాడు. ఎక్కడా ఆపకుండా, కాళ్లు నేలపై పెట్టకుండా ఏకంగా 686 మెట్లను కేవలం 12 నిమిషాల 30 సెకన్లలో ఎక్కి ప్రపంచ రికార్డు సృష్టించాడు. గతంలో (రెండు దశాబ్దాల క్రితం) హ్యూగ్ రిచర్డ్ 19 నిమిషాల వ్యవధిలో ఈఫిల్ టవర్‌ను సైకిల్‌పై ఎక్కితే... ఈయనగారు సుమారు ఏడు నిమిషాల ముందుగానే చేరుకుని ఆ రికార్డును తిరిగరాశాడు.
ఇలాంటి ఫీట్స్ సాధించడం ఫాంటోనోయ్‌కు కొత్తేమీ కాదు. 2021లో ప్యారిస్‌లోని ట్రినిటీ టవర్, ఈ ఏడాది ఎస్టోనియాలోని టాలిన్ టీవీ టవర్‌ను సైకిల్‌పై అలవోకగా ఎక్కి ‘ఔరా’ అనిపించాడు. ‘నిజానికి ఈ ఫీట్ నాలుగేళ్ల క్రితమే పూర్తి చేయాలనుకున్నా. కానీ అదే సమయానికి కరోనా మహమ్మారి విజృంభించడం... మరోపక్క ఈఫిల్ టవర్‌కు రిపేర్లు జరుగుతుండడం... గతేడాది ప్యారిస్ ఒలింపిక్స్ కారణంగా నాకు సుదీర్ఘ నిరీక్షణ తప్పలేదు. ఏదైతేనేం... ఎట్టకేలకు ఈఫిల్ టవర్ ఎక్కాను. ఇక నా తదుపరి లక్ష్యం ప్రపంచంలోని అత్యంత ఎత్తైన భవనం ‘బుర్జ్ ఖలీఫా’ను సైకిల్‌పై ఎక్కడమే. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రసిద్ధ నిర్మాణాలను నాదైన స్టైల్‌లో సైకిల్‌పై ఎక్కి... కొత్త రికార్డులు సృష్టించాలనుకుంటున్నా’ అని అంటున్నాడీ 35 ఏళ్ల సైక్లిస్ట్.