Share News

ఫారెస్ట్‌ బాత్‌.. ప్రకృతితో మమేకం

ABN , Publish Date - Sep 28 , 2025 | 01:40 PM

‘మానసిక ప్రశాంతత కరువైంది. ఎనర్జీ లెవెల్స్‌ తగ్గిపోతున్నాయి... ఇంట్లో, ఆఫీసులో ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాను. డిప్రెషన్‌లోకి కూరుకుపోతున్నాను...’ ఈ మధ్యకాలంలో ఎవరిని కదిలించినా వినిపించే మాటలివి.

ఫారెస్ట్‌ బాత్‌.. ప్రకృతితో మమేకం

‘మానసిక ప్రశాంతత కరువైంది. ఎనర్జీ లెవెల్స్‌ తగ్గిపోతున్నాయి...

ఇంట్లో, ఆఫీసులో ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాను. డిప్రెషన్‌లోకి కూరుకుపోతున్నాను...’ ఈ మధ్యకాలంలో ఎవరిని కదిలించినా వినిపించే మాటలివి. అయితే ‘ఇలాంటి సమస్యల నుంచి బయటపడేందుకు తిరగాల్సింది ఆసుపత్రుల చుట్టూ కాదం’టున్నారు పరిశోధకులు. అడవిలో రెండు గంటలు ప్రకృతితో మమేకమైతే చాలట.‘ఫారెస్ట్‌ బాతింగ్‌’ అని ముద్దుగా పిలిచే ఈ తాజా థెరపీ ఈమధ్య ట్రెండ్‌గా మారుతోంది.

కళ్లు మూసుకుని అడవిలో నడుస్తున్నట్టు ఊహించుకోండి. చల్లటి గాలి ముఖానికి తగులుతుంది. గాలికి ఊగుతున్న కొమ్మల సవ్వడి వినిపిస్తుంది. కాళ్ల కింద నలుగుతున్న ఆకుల చప్పుడు చెవిని చేరుతుంది. మట్టి వాసన పరిమళభరితంగా అనిపిస్తుంది. ప్రశాంతమైన అనుభూతి సొంతమవుతుంది. ఊహల్లోనే ఇంత బాగుంటే... అడవిలోకి వెళ్లి ప్రశాంతమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తే... తనువూ, మనస్సు కొత్త ఉత్సాహంతో నిండిపోతాయి. దాంతో ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటారు. ఈ థెరపీని ‘ఫారెస్ట్‌ బాతింగ్‌’ అని పిలుస్తారు. ఫారెస్ట్‌ థెరపీ, నేచర్‌ థెరపీ అని కూడా అంటారు.


ఫారెస్ట్‌ బాతింగ్‌ అంటే ఆరుబయట స్నానం చేయడమో, సెలయేరులో ఈత కొట్టడమో కాదు. ప్రకృతితో కలిసిపోవడం. ప్రకృతిలోని శబ్దాలు, వాసనలను ఆస్వాదించడం. ప్రశాంతతను అనుభూతి చెందడం. ఇంకా చెప్పాలంటే ప్రకృతితో మనస్సును మమేకం చేయడం. ఇంద్రియాలతో ప్రకృతిని ఆస్వాదించడాన్నే ‘ఫారెస్ట్‌ బాతింగ్‌’ అంటారు. పంచేంద్రియాలతో పరిసరాలకు కనెక్ట్‌ కావడం ద్వారా కొత్త ఉత్సాహం సొంతమవుతుంది. కాసేపు అడవిలో గడపడంతోనే శరీరం ప్రశాంతమైన స్థితిలోకి వెళుతుంది. గుండె వేగం సాధారణ స్థితికి చేరుతుంది. మెదడు మరింత చురుగ్గా మారుతుంది.


book11.2.jpg

నెమ్మదిగా నడవడం, చెట్లను పరిశీలించడం, పక్షుల కిలకిలరావాలను వినడం, పరిసరాలను గమనించడం, మట్టివాసనను పీల్చడం వంటివన్నీ ఈ థెరపీలో భాగమే. ఫారెస్ట్‌ బాతింగ్‌కు వెళ్లినప్పుడు ఇతర యాక్టివిటీస్‌ను ట్రై చేయవచ్చు. ఉదాహరణకు యోగా, మెడిటేషన్‌, బొమ్మలు వేయడం, పుస్తకం చదవడం వంటివి. ఈ థెరపీ శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఇల్లు, ఉద్యోగం, షాపింగ్‌ వంటి వాటితో ముఖ్యంగా నగర జీవులు ప్రకృతిలో గడిపే అవకాశమే ఉండటం లేదు. అలాంటి వారికి ఈ థెరపీ అద్భుతమైన ఆప్షన్‌ అంటున్నారు మానసిక నిపుణులు. ‘ఫారెస్ట్‌ బాతింగ్‌’ అన్ని వయస్సుల వారు చేయవచ్చు. సిటీలైఫ్‌ నుంచి బ్రేక్‌ కోరుకునే వారికి మంచి ఆప్షన్‌. ప్రకృతి వైపు తిరిగి వెళ్లడం వల్ల పాజిటివ్‌ ఎఫెక్ట్‌ ఉంటుంది.


ఎక్కడ చేయాలి?

మీరు నివసించే ప్రాంతానికి దగ్గరలో అటవీ ప్రాంతం ఉంటే వెళ్లొచ్చు. నగరాల్లో నివసించే వారైతే అర్బన్‌ ఫారెస్టులో లేక పార్కుల్లో చేయవచ్చు. నగరాల్లోని పార్కుల్లో నిశ్శబ్దం కావాలని కోరుకోవడం అత్యాశే అవుతుంది. అందుకే వీలైనంత వరకు సిటీకి దూరంగా ఉండే అటవీ ప్రాంతాలను ఎంచుకోవడం ఉత్తమం. నగరవాసులు బొటానికల్‌ గార్డెన్‌లాంటి ప్రదేశాలు ఎంచుకోవచ్చు.


book11.3.jpg

ఏం చేయాలి?

- ఫోన్‌ స్విచాఫ్‌ చేయాలి.

- నెమ్మదిగా నడవాలి.

- పంచేంద్రియాలపై ఫోకస్‌ పెట్టాలి.

- సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రదేశాన్ని ఎంపిక చేసుకుని కూర్చోవాలి.

- ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించాలి.

- మీ గుండె చప్పుడును వినాలి.

- డీప్‌ బ్రీత్‌ తీసుకోవాలి.

- జరిగిపోయిన వాటి గురించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు వదిలేయాలి.

- ఈ థెరపీని వెల్‌నెస్‌ రొటీన్‌లో భాగం చేసుకోవాలి.


ప్రయోజానాలెన్నో...

- ఫారెస్ట్‌ బాతింగ్‌తో రక్తపోటు నియంత్రణలోకి వస్తుందా? అంటే అవుననే అంటున్నారు పరిశోధకులు. ‘‘ఫారెస్ట్‌ బాతింగ్‌తో అధిక రక్తపోటు గణనీయంగా తగ్గడాన్ని మేం అధ్యయనంలో గుర్తించాం’’ అంటారు యూనివర్సిటీ ఆఫ్‌ వెస్ట్‌లండన్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తోన్న నమ్యున్‌ కిల్‌.

- అడవిలో ప్రశాంతమైన వాతావరణంలో కొద్దిసేపు గడిపినా కార్టిసాల్‌ లెవెల్స్‌ గణనీయంగా తగ్గుతాయి. దీనివల్ల నరాలు సాంత్వన చెందుతాయి. టెన్షన్‌ తగ్గిపోతుంది. మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.

- ఫారెస్ట్‌ బాతింగ్‌ ప్రాక్టీస్‌ చేసే వారు సంతోషంగా ఉంటున్నట్టు ఒక అధ్యయనంలో వెల్లడయింది. ఒత్తిడి, ఆందోళన స్థాయి బాగా తగ్గినట్టు తేలింది. భావోద్వేగాలకు ఇది రీసెట్‌ బటన్‌గా ఉపయోగపడుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు.


book11.4.jpg

- చెట్లు ఫైటానిసైడ్స్‌ అనే మిశ్రమాలను విడుదల చేస్తాయి. వీటిని పీల్చడం వల్ల రోగనిరోధక కణాల యాక్టివిటీ పెరుగుతుంది. ఫలితంగా ఇన్ఫెక్షన్లపై పోరాడే శక్తి శరీరానికి లభిస్తుంది. రోగనిరోధక శక్తి బలోపేతం అవుతుంది. ఎనర్జీ లెవెల్స్‌ పెరుగుతాయి.

- క్రియేటివిటీ పెరుగుతుంది. పచ్చదనం మధ్య గడపడం వల్ల అటెన్షన్‌, సృజనాత్మకత పెరుగుతాయి. ఏ విషయంపైనా ఏకాగ్రత నిలపలేని వారికి ఫారెస్ట్‌ బాతింగ్‌ పరిష్కారం చూపుతుంది. ఫోకస్‌ రీస్టోర్‌ అవుతుంది. మెంటల్‌ క్లారిటీ వస్తుంది.

- ఫారెస్ట్‌ బాతింగ్‌ తరువాత మంచి నిద్ర పడుతుంది. నరాల వ్యవస్థకు సాంత్వన చేకూరుతుంది. రాత్రుళ్లు గాఢనిద్ర పోవడం వల్ల ఉదయం హుషారుగా ఉంటారు.

- ప్రకృతికి, మానసిక ఆరోగ్యానికి సంబంధం ఉన్నట్టుగా పలు అధ్యయనాల్లో తేలింది. పచ్చదనం చెంతన నివసించే వారిలో ఒత్తిడి, ఆందోళన తక్కువగా ఉన్నట్టు గుర్తించారు.


- స్ట్రెస్‌, మూడ్‌ డిజార్డర్స్‌తో బాధపడే వారికి ఫారెస్ట్‌ థెరపీ మందులా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు.

ఎవరికి ఉపయోగం?

- పాఠశాలలో ఒత్తిడికి గురవుతున్న విద్యార్థులు

- జాబ్‌ స్ట్రెస్‌ను ఎదుర్కొంటున్న ప్రొఫెషనల్స్‌

- డిప్రెషన్‌, యాంగ్జయిటీతో బాధపడుతున్నవారు

- నిద్ర సమస్యలను ఎదుర్కొంటున్న వారెవరైనా...

- సృజనాత్మకత పెంచుకోవాలనుకునేవారికి

- ఏకాగ్రత పెంచుకోవాలని చూస్తున్న వారు

- ప్రశాంతతను కోరుకుంటున్నవారు


ఏ సీజన్‌లోనైనా....

ఫారెస్ట్‌ బాతింగ్‌ ఏ సీజన్‌లోనైనా చేయవచ్చు. వర్షాకాలంలో అయితే అటవీ ప్రాంతంలో చిత్తడిగా ఉంటుంది. అందుకు తగిన విధంగా ప్రిపేర్‌ అవ్వాలి. వానలు కురిసిన తరువాత పెరిగే గడ్డి, మొక్కలపై ప్రత్యేకంగా ఫోకస్‌ చేయాలి. వర్షాలకు పారుతున్న నీటి పాయల చప్పుళ్లను, కప్పల బెకబెకలను వినాలి. వేసవిలో వెళ్లినట్టయితే చెట్ల నుంచి వచ్చే సువాసనలను డీప్‌ బ్రీత్‌తో ఆస్వాదించాలి. జంతువులు, కీటకాలపై దృష్టి పెట్టాలి. చెప్పులు లేకుండా నడవాలి. వసంత కాలంలో వెళ్లినట్టయితే ఆకులు రంగు మారడాన్ని గమనించాలి. అడవిలో రాలిన, తిన దగిన ఫలాల రుచి చూడాలి. చలికాలమైతే చలి నుంచి రక్షించే దుస్తులు వేసుకోవాలి. ప్లాస్కులో వేడి పానీయాలను తీసుకెళ్లాలి.


ఎక్కడ మొదలైందంటే...

ఈ థెరపీకి చరిత్ర ఉంది. 1980లో జపాన్‌లో పుట్టిన థెరపీ ఇది. జపనీస్‌ భాషలో ‘షిన్రిన్‌ యోకు’ అంటారు. డా. క్వింగ్‌ లీని ఫారెస్ట్‌ థెరపీ ఫౌండర్‌గా భావిస్తుంటారు. జపాన్‌లోని ‘సొసైటీ ఆఫ్‌ ఫారెస్ట్‌ మెడిసిన్‌’కు ఆయన ప్రెసిడెంట్‌గా ఉన్నారు. కొరియా ప్రభుత్వం 2000లో ఫారెస్ట్‌ థెరపీని అడాప్ట్‌ చేసుకుంది. ఇక్కడ తరచూ ఫారెస్ట్‌ థెరపీ ప్రోగ్రామ్స్‌ నిర్వహిస్తుంటారు. 80 అడవులను ఫారెస్ట్‌ థెరపీ ప్రదేశాలుగా గుర్తించారు. కొరియాలో ‘నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఫారెస్ట్‌ థెరపీ సెంటర్‌’ ఉంది. అమెరికాలోని ‘అసోసియేషన్‌ ఆఫ్‌ నేచర్‌ అండ్‌ ఫారెస్ట్‌ థెరపీ గైడ్స్‌ అండ్‌ ప్రోగ్రామ్స్‌’ అనే ప్రైవేటు సంస్థ ప్రపంచవ్యాప్తంగా నేచర్‌, ఫారెస్ట్‌ థెరపీ కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ఔత్సాహికులకు శిక్షణ అందిస్తోంది.


పంచేంద్రియాలే కీలకం

వినడం: పక్షుల అరుపులు, గాలికి చెట్ల ఆకులు చేసే శబ్దాలు, గలగలా పారుతున్న సెలయేటి చప్పుడు... ఇలా అడవిలో ప్రతి శబ్దాన్ని వినండి. ఆ శబ్దాలపైనే మనసు కేంద్రీకరించండి.

వాసన చూడటం: కళ్లు మూసుకుని డీప్‌ బ్రీత్‌ తీసుకోండి. రకరకాల చెట్ల నుంచి వచ్చే పరిమళాలు మీ ముక్కు పుటాలను తాకుతాయి. అడవిలో వచ్చే మట్టి వాసన, చెట్టు వేర్ల వాసనలు మీకు కొత్త అనుభూతిని అందిస్తాయి.

ప్రకృతిని వీక్షించండి: ప్రకృతి అత్యంత రమణీయంగా ఉంటుంది. మనసారా వీక్షించండి. అటవీ అందాలు మీ దృష్టి కోణాన్ని మార్చేస్తాయి.

అనుభూతి చెందండి: ఒక చెట్టును పట్టుకోండి. నడిచే క్రమంలో చెట్ట ఆకులను స్పృశించండి. పూలను చేతుల్లోకి తీసుకోండి. వేళ్ల మధ్య వాటి ఆకృతిని, మృదుత్వాన్ని అనుభూతి చెందండి.

పండ్లను తినండి: అడవిలో దొరికే నేరేడు, మేడి పండ్ల రుచి చూడండి. చెట్టు పై నుంచి అప్పుడే తెంపుకొని తినే పండు రుచిని ఎంజాయ్‌ చేయండి. ఏది పడితే అది తినొద్దు.

Updated Date - Sep 28 , 2025 | 01:40 PM