అక్కడికి వెళితే.. ఒకేచోట వేల దిష్టిబొమ్మలు కనిపిస్తాయి
ABN , Publish Date - Oct 26 , 2025 | 12:42 PM
పక్షుల బారి నుంచి పంటను కాపాడుకోవడానికి... రైతులు కర్రలకు బట్టలు తొడిగి, వాటిని బొమ్మల్లాగా పొలం గట్టు మీద పెడుతుంటారు. కానీ అక్కడికి వెళితే... ఒకేచోట వేల బొమ్మలు కనిపిస్తాయి. ఇంతకీ వాటిని ఎవరు పెట్టారు? ఎందుకు పెట్టారు? సంద ర్శకులను విశేషంగా ఆకర్షిస్తోన్న ఆ ప్రదేశం ఎక్కడుంది?
- దిష్టిబొమ్మల సమూహం...
పక్షుల బారి నుంచి పంటను కాపాడుకోవడానికి... రైతులు కర్రలకు బట్టలు తొడిగి, వాటిని బొమ్మల్లాగా పొలం గట్టు మీద పెడుతుంటారు. కానీ అక్కడికి వెళితే... ఒకేచోట వేల బొమ్మలు కనిపిస్తాయి. ఇంతకీ వాటిని ఎవరు పెట్టారు? ఎందుకు పెట్టారు? సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తోన్న ఆ ప్రదేశం ఎక్కడుంది?
అత్యంత సంతోషకరమైన దేశాలలో ఫిన్‌లాండ్ మొదటి స్థానంలో నిలుస్తున్న సంగతి తెలిసిందే. అక్కడ నేరాలు అతి తక్కువ. ప్రజలు ఎలాంటి బాదరాబందీ లేకుండా సంతోషకరమైన జీవనం గడుపుతుంటారు. ఆ దేశంలోని ఒక చిన్న పట్టణం ‘స్యూముస్సల్మీ’. ఈ పట్టణానికి దగ్గరి నుంచి 5వ నంబరు జాతీయ రహదారి వెళుతుంది. ఈ రహదారిపై ప్రయాణించే వారెవరైనా ఒకచోట మాత్రం మాయ చేసినట్టుగా ఆగిపోతారు.

ఎందుకంటే... రహదారి పక్కన మైదానంలో కొన్ని వేల బొమ్మలు రంగురంగుల దుస్తులతో కనువిందు చేస్తూ కనిపిస్తాయి. ఒక్క క్షణం... దూరం నుంచి చూస్తే ఊరి జనం సమూహంగా నిలుచున్నారేమో అనిపిస్తుంది. దగ్గరికి వెళితేగానీ తెలియదు... వాళ్లు మనుషులు కాదు... అవి బొమ్మలని. పంటపొలాల్లో పెట్టే దిష్టిబొమ్మల్లా ఉంటాయవి. స్థానికులు వాటిని ‘సైలెంట్ పీపుల్’ అని పిలుస్తారు. పెళ్లి దుస్తులు, గడ్డి టోపీలు, బిజినెస్ సూట్లు... ఇలా రకరకాల దుస్తులు ధరించిన బొమ్మలు ఇక్కడ చూడొచ్చు. ఆ ప్రాంతమంతా నిశ్శబ్దంగా ఉంటుంది.

ఎవరు పెట్టారు?
ఈ బొమ్మల సృష్టికర్త డ్యాన్సర్, కొరియోగ్రాఫర్ అయిన రెయిజో కెలా. స్థానికుడైన కెలా నిజానికి మొదట బొమ్మలను ఇక్కడ ఏర్పాటు చేయలేదు. 1988లో లాస్సిలా అనే ప్రాంతంలో మొదటిసారి ఒక బొమ్మను ఏర్పాటు చేశాడు. తరువాత 1994లో హెల్సింకీ సెనెట్ స్క్వేర్‌లోని మార్కెట్ ప్రాంతంలో కొన్ని పెట్టాడు. కొద్దిరోజులకు జలోనుయుమా నది ఒడ్డున కొన్నింటిని పెట్టాడు. చివరగా 1994లో ఇప్పుడున్న హైవే పక్కకు వాటిని మార్చాడు. అతడికి సమయం దొరికినప్పుడల్లా బొమ్మలు పెట్టుకుంటూ పోయాడు.

నిలువు, అడ్డం కర్రలు పెట్టి, వాటికి దుస్తులు తొడిగి, పైన గడ్డితో జుట్టులాగా అలంకరించేవాడు. ఇప్పుడవి కొన్ని వేల సంఖ్యలో ఉన్నాయి. దాంతో ఆ ప్రాంతం పర్యాటక ప్రదేశంగా మారింది. తమ పట్టణానికి ప్రత్యేక గుర్తింపు రావడంతో అక్కడి యువత సైతం ఆ బొమ్మల తయారీలో నిమగ్నమైంది. ప్రస్తుతం ‘స్యూముస్సల్మీ యూత్ వర్క్‌షాప్’ చెక్కబొమ్మలను తయారుచేస్తోంది. అంతేకాకుండా విరాళాల ద్వారా సేకరించిన బట్టలను మార్చే పనులు చూస్తోంది. ఈ హైవేపై వెళ్లే వాహనదారులు సైలెంట్ పీపుల్‌ని చూసి ఆశ్చర్యానికి గురవుతుంటారు. ఆర్టిస్ట్ ఆలోచనను అభినందిస్తుంటారు.
అయితే ‘బొమ్మలు పెట్టడం వెనక కారణం ఏంట’ని కెలాను అడిగితే మాత్రం సమాధానం చెప్పడానికి నిరాకరిస్తాడు. అతని మానసిక స్థితి బాగాలేదని స్థానికులు కొందరు అంటుంటారు. అతను మరచిపోయిన కొంతమంది వ్యక్తుల గుర్తుగా బొమ్మలు పెడుతున్నాడని స్థానికులు చెబుతారు. 1939-40 మధ్య కాలంలో ఫిన్‌లాండ్-రష్యా మధ్య జరిగిన యుద్ధంలో చనిపోయిన వారి గుర్తుగా ఇది చేస్తున్నాడని మరికొందరు అంటారు. ఆ బొమ్మలు వారికి ప్రతిరూపాలా? లేదా మరేదైనా కారణముందా? ఏదేమైనా బొమ్మల ప్రదేశం మాత్రం సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. వాటివల్ల తమ పట్టణానికి పర్యాటక ప్రాంతంగా గుర్తింపు రావడంతో స్థానికులూ సంతోషం వ్యక్తం చేస్తుంటారు.