4 వేల షార్ప్‌నర్లు ఉన్నాయక్కడ...
ABN , Publish Date - Jul 06 , 2025 | 10:06 AM
పిల్లల కోసం పెన్సిళ్లతో పాటు షార్ప్‌నర్లను కూడా కొంటుంటారు. ఇంతకుముందు షార్ప్‌నర్ ఒకేలా ఉండేది కానీ, ఈమధ్య పిల్లల్ని ఆకట్టుకునేందుకు బొమ్మల రూపంలో కూడా వస్తున్నాయి. అయినాసరే అటుఇటుగా ఓ పది రకాలని చూసి ఉంటారు.

పిల్లల కోసం పెన్సిళ్లతో పాటు షార్ప్‌నర్లను కూడా కొంటుంటారు. ఇంతకుముందు షార్ప్‌నర్ ఒకేలా ఉండేది కానీ, ఈమధ్య పిల్లల్ని ఆకట్టుకునేందుకు బొమ్మల రూపంలో కూడా వస్తున్నాయి. అయినాసరే అటుఇటుగా ఓ పది రకాలని చూసి ఉంటారు.
అమెరికాలోని లోగాన్ ప్రాంతానికి వెళ్తే ఒకేచోట నాలుగు వేల రకాల పెన్సిల్ షార్ప్‌నర్లని చూడొచ్చు. జంతువులు, పక్షులు, బార్బీ డాల్, ఇళ్లు, పిజ్జా, బర్గర్, బ్రెడ్, కూల్‌డ్రింక్స్, గిటార్, సెల్‌ఫోన్, షూ, విమానం షేపుల్లోనే కాకుండా... పిల్లలు ఎంతగానో ఇష్టపడే చాక్లెట్స్, ఐస్‌క్రీమ్ ఆకారాల్లోనూ ఉన్నాయి. వీటిలో చాలావరకు అమెరికాలో సేకరించినవే. ప్రపంచంలోనే మొదటి షార్ప్‌నర్ మ్యూజియం ఇది.
ఒకే ఒక్కడు...
పౌల్ ఎ జాన్సన్ అనే వ్యక్తికి షార్ప్‌నర్‌లు సేకరించడం సరదా. ఆ సరదానే సీరియస్‌గా తీసుకుని, ఏకంగా పెన్సిల్ షార్ప్‌నర్ మ్యూజియం ఏర్పాటు దిశగా సాగాడు. ఎక్కడికి వెళ్లినా ఆయన దృష్టి మొత్తం షార్ప్‌నర్ల మీదే ఉండేదట. ఆ విధంగా 20 ఏళ్ల కృషితో దాదాపు నాలుగు వేల రకాల షార్ప్‌నర్లను సేకరించాడు. పౌల్ చనిపోయిన తర్వాత ఆయన కుటుంబసభ్యులు మ్యూజియం నిర్వహణ చూసుకుంటున్నారు. ప్రతీరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ మ్యూజియంలోకి సందర్శకులను అనుమతిస్తారు. ఆదివారాలయితే ఇంకాస్త ఎక్కువసేపే ఉంటుంది. ఎలాంటి ప్రవేశ రుసుం ఉండదు. హాకింగ్ హిల్స్‌కు ఈ మ్యూజియం దగ్గరగా ఉండటంతో, పర్యాటకులకు ఇదొక సందర్శనీయ స్థలంగా మారింది. షార్ప్‌నర్ ప్రపంచంలోకి అడుగుపెట్టి, సంభ్రమాశ్చరాలకు గురవుతూ, వాటిని పట్టుకుని ఫొటోలు దిగుతూ మురిసి పోతుంటారు.