Share News

కాళ్ల కింద ‘భూకంపం’

ABN , Publish Date - Oct 19 , 2025 | 01:40 PM

భూకంపం వచ్చినప్పుడు ఎలా ఉంటుందో తెలియాలంటే మీరున్న ప్రదేశంలోనే భూకంపం రావాలి. లేదంటే వీడియోలలో రికార్డయిన దృశ్యాలు చూడాలి. అదే జర్మనీలోని హెయిన్‌బర్గ్‌కు వెళితే మాత్రం ఎప్పుడు కావాలంటే అప్పుడు భూకంపం వస్తుంది.

కాళ్ల కింద ‘భూకంపం’

‘భూకంపం’... పదం వింటేనే కాళ్లు వణుకుతాయి. అలాంటిది భూకంపం అనుభవిస్తే... కళ్ల ముందే కాళ్ల కింద భూమి కదలినట్టయితే... కాసేపు కంగారుపడ్డా, తర్వాత థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. అలాగని... ఎప్పుడు కావాలంటే అప్పుడు భూకంపం వస్తుందా? అంటే జర్మనీలోని హెయిన్‌బర్గ్‌కు వెళితే తెలుస్తుంది. అక్కడ ఉన్న పురాతన భూకంప కేంద్రాన్ని సందర్శిస్తే ఎప్పుడంటే అప్పుడు భూకంప ప్రభావాన్ని అనుభూతి చెందొచ్చు. వందేళ్ల చరిత్ర ఉన్న ఈ స్టేషన్‌ ఇప్పటికీ పనిచేస్తోంది.

భూకంపం వచ్చినప్పుడు ఎలా ఉంటుందో తెలియాలంటే మీరున్న ప్రదేశంలోనే భూకంపం రావాలి. లేదంటే వీడియోలలో రికార్డయిన దృశ్యాలు చూడాలి. అదే జర్మనీలోని హెయిన్‌బర్గ్‌కు వెళితే మాత్రం ఎప్పుడు కావాలంటే అప్పుడు భూకంపం వస్తుంది. హెయిన్‌బర్గ్‌లో ఉన్న భూకంప కేంద్రాన్ని 1902లో జర్మన్‌ భూభౌతిక శాస్త్రవేత్త ఎమిల్‌ వీచర్ట్‌ నిర్మించారు. జియోఫిజిక్స్‌ రంగంలో పరిశోధనల కోసం ఆయన ఈ కేంద్రాన్ని నిర్మించారు. ప్రయోగాలలో ప్రకంపనలను రికార్డు చేయడానికి సిస్మోగ్రాఫ్‌ను కూడా ఏర్పాటు చేశారు. ‘వీచర్ట్‌ ఎర్త్‌క్వేక్‌ స్టేషన్‌’గా పిలుస్తున్న ఈ కేంద్రం ఇప్పటికీ వినియోగంలో ఉంది.

zzzzzzzzzzzzzzzz.jpg


book11.3.jpg

ప్రయోగాలకు వేదిక

కృత్రిమ భూకంపాన్ని సృష్టించడం కోసం అక్కడ 45 అడుగుల ఎత్తైన రిగ్‌ను ఏర్పాటు చేశారు. ఆ రిగ్‌పైకి తాడు సహాయంతో 4 టన్నుల బరువైన ఇనుప బంతిని పైకి లాగి వదులుతారు. బంతి కిందపడినప్పుడు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూమి స్వల్పంగా ప్రకంపిస్తుంది. సిస్మోగ్రాఫ్‌పై భూకంప తీవ్రత స్పష్టంగా నమోదవుతుంది. రాతిపొరలు ఏర్పడిన తీరు, వాటి సరిహద్దులను అర్థం చేసుకోవడానికి శాస్త్రవేత్తలకు ఈ కృత్రిమ భూకంపం ఉపయోగపడింది.


book11.4.jpg

భౌగోళిక నిర్మాణాల ఖచ్చిత స్వభావాన్ని తెలుసుకోవడానికి ప్రయోగం ఉపకరించింది. ముడిచమురు, సహజవాయువు, ఇతర నిక్షేపాల జాడను తెలుసుకునేందుకు ఈ భౌగోళిక అన్వేషణ పద్ధతిని ఇప్పటికీ కంపెనీలు అనుసరిస్తున్నాయి. ఈ ప్రాంతం పర్యాటక ప్రదేశంగానూ గుర్తింపు పొందింది. పర్యాటకులు వచ్చినప్పుడు వారి కోసం ప్రత్యేకంగా కృత్రిమ భూకంప ప్రయోగాన్ని నిర్వహిస్తుంటారు. ఆ సమయంలో పర్యాటకులు భూప్రకంపనలను స్పష్టంగా అనుభూతి చెందుతారు. ఆ తర్వాత ఎలక్ట్రిక్‌ మోటారుతో తిరిగి బంతిని పైకి లేపుతారు. ప్రస్తుతం ఈ ప్రయోగాన్ని రిమోట్‌ సహాయంతో ఆపరేట్‌ చేస్తున్నారు.

Updated Date - Oct 19 , 2025 | 01:40 PM