Biker Skull: బైకుపై వెళుతుండగా విషాదం..ఆస్పత్రికి తీసుకెళ్లగా షాక్..
ABN , Publish Date - Jun 20 , 2025 | 02:58 PM
Biker Skull: అక్షయ్ శివరామ్ ఓ కంపెనీలో హెచ్‌ఆర్‌గా పని చేస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం ఇంటికి సరుకులు కొనడానికి షాపుకు వెళ్లాడు. ఒంటి గంట సమయంలో సరుకులు కొనుక్కుని ఇంటికి తిరిగి వస్తూ ఉన్నాడు.
మనిషి జీవితం చాలా విచిత్రమైంది. చావు తప్పదని తెలిసి కూడా ఏదో ఒక దానికి కోసం ఎప్పుడూ ఆరాటపడుతూనే ఉంటుంది. ఆరాటపడ్డంలో తప్పులేదు. అది మితిమీరితేనే జీవితం కూడా నరకంలా అనిపిస్తుంది. ప్రశాంతత కరువవుతుంది. మనకు నచ్చినట్లుగా జీవితం గడిపే సమయానికి అంతా ముగిసిపోతుంది. ఆరు అడుగుల ప్రదేశంలో హాయిగా గడపాల్సి వస్తుంది. చావుకు మన అంతస్తులు, హోదాలతో.. వేల కోట్ల ఆస్తులతో, బంధు జనంతో, భార్యా పిల్లలతో సంబంధం లేదు. మనం ఎక్కడ ఉన్నా.. గంట కొట్టినట్లు తీసుకెళ్లిపోతుంది. తాజాగా, ఓ హెచ్ఆర్ మేనేజర్ తలపై చెట్టు కొమ్మ పడింది. దీంతో పుర్రె 12 ముక్కలు అయింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ సంఘటన కర్ణాటకలోని బెంగళూరులో గురువారం చోటుచేసుకుంది.
సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని శ్రీనివాస నగర్‌కు చెందిన 29 ఏళ్ల అక్షయ్ శివరామ్ ఓ కంపెనీలో హెచ్‌ఆర్‌గా పని చేస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం ఇంటికి సరుకులు కొనడానికి షాపుకు వెళ్లాడు. ఒంటి గంట సమయంలో సరుకులు కొనుక్కుని ఇంటికి తిరిగి వస్తూ ఉన్నాడు. బైకు తోలుకుంటూ బ్రహ్మ చైతన్య మందిరం దగ్గరకు రాగానే అతడి తలపై పెద్ద చెట్టు కొమ్మ పడింది. అతడి తలకు హెల్మెట్ లేకపోవటంతో పుర్రె పగిలింది.
దెబ్బకు బైకు అదుపు తప్పి పక్కనే ఉన్న వాహనాన్ని ఢీకొట్టుకుని రోడ్డుపై పడిపోయాడు. రోడ్డుపై వెళుతున్న వారు అతడ్ని గుర్తించి వెంటనే ఆస్పత్రికి తరలించారు. తర్వాత అక్కడినుంచి అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు తలకు ఎక్స్‌రే తీసి చూడగా .. అది 12 ముక్కలు అయింది. దీంతో అతడి తలకు సర్జరీ చేశారు. తర్వాత ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అక్షయ్ ఆ గాయాల నుంచి కోలుకోలేకపోయాడు. చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశాడు. ప్రస్తుతం సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇవి కూడా చదవండి
శరీరంలో టెంపరేచర్‌కు ఓ లిమిట్.. ఈ లక్ష్మణ రేఖ దాటితే..
తెలంగాణ జాగృతి రౌండ్ టేబుల్ సమావేశం