Share News

ఆ రిసార్టులో వింత స్నానాలు ఎన్నో... సమ్‏థింగ్ ‘స్పా’షల్..

ABN , Publish Date - Oct 19 , 2025 | 01:11 PM

రిసార్ట్‌ అన్న తర్వాత ఓ ఈత కొలను తప్పకుండా ఉంటుంది. కాసేపు ఉల్లాసం కోసం అందులో ఈత కొడతారెవరైనా. అయితే వైన్‌ కొలను, గ్రీన్‌ టీ టబ్‌, కాఫీ తొట్టెల్లో ఎప్పుడైనా జలకాలాడారా? ఆ రిసార్టులోకి అడుగిడితే ఇలాంటి వింత స్నానాలు ఎన్నో...

ఆ రిసార్టులో వింత స్నానాలు ఎన్నో... సమ్‏థింగ్ ‘స్పా’షల్..

రిసార్ట్‌ అన్న తర్వాత ఓ ఈత కొలను తప్పకుండా ఉంటుంది. కాసేపు ఉల్లాసం కోసం అందులో ఈత కొడతారెవరైనా. అయితే వైన్‌ కొలను, గ్రీన్‌ టీ టబ్‌, కాఫీ తొట్టెల్లో ఎప్పుడైనా జలకాలాడారా? ఆ రిసార్టులోకి అడుగిడితే ఇలాంటి వింత స్నానాలు ఎన్నో...

శరీరం తిరిగి ఉత్తేజితం కావాలా? అయితే రెడ్‌వైన్‌లో జలకాలాడండి... చర్మం నిగారింపు సంతరించుకోవాలా? గ్రీన్‌టీలో సేద తీరండి... హకోన్‌ (జపాన్‌)లోని ‘యునెస్సన్‌ స్పా రిసార్టు’లోకి అడుగుపెడితే వినిపించే మాటలివి. అక్కడి విశాలమైన స్పా ప్రాంగణంలో ఒకవైపు వైన్‌ కొలను, మరోవైపు గ్రీన్‌ టీ టబ్‌, ఇంకోవైపు కాఫీ కొలను... ఇలా రకరకాల ‘బాత్‌ స్పా’లు కనిపిస్తాయి. రిలాక్స్‌ కోసం కాఫీ తాగుతారు. ఆరోగ్యానికి మంచిదని గ్రీన్‌ టీ సేవిస్తారు. కానీ యునెస్సన్‌ రిసార్టులో మాత్రం ఇందుకు భిన్నంగా వాటిలోనే జలకాలాడొచ్చు. అక్కడికి వెళ్లేవారు కాఫీ తొట్టెలో మునిగి తేలుతారు. గ్రీన్‌టీలో చిందు లేస్తారు. వైన్‌లో ఈత కొడతారు. సేక్‌బాత్‌ చేస్తారు. ఒక్కోదాంట్లో సేదతీరితే ఒక్కోరకమైన ఆరోగ్య ప్రయోజనం చేకూరుతుందని ‘స్పా’ నిర్వాహకులు చెబుతారు.


ప్రయోజనాలివి...

వైన్‌లో స్నానం చేస్తే శరీరం పునరుత్తేజం చెందుతుంది. ఒకప్పటి ఈజిప్టు రాణి క్లియోపాత్ర తరచుగా వైన్‌ బాత్‌ చేసేదని చెబుతారు. రెడ్‌వైన్‌లో ‘రెస్వెరటాల్‌’ అనే యాంటిఆక్సిడెంట్‌ ఉంటుంది. ఇది కాలుష్యం నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. స్పాలో ప్రతిరోజూ కొలను శుభ్రం చేసి కొత్త వైన్‌తో నింపుతుంటారు. వైన్‌ను సిప్‌ చేస్తూ వైన్‌లో స్నానం చేయడం సరికొత్త అనుభూతిని పంచుతుందని సందర్శకులు అంటున్నారు. ‘సాక్‌ బాత్‌’ వల్ల శరీరంపై ఉన్న చిన్న చిన్న మచ్చలు తొలగిపోతాయి. ‘సాక్‌’ అనేది జపాన్‌లో లభించే ఒక రకమైన ఆల్కహాల్‌. సాక్‌ స్పాలో సేదతీరితే... రైస్‌ వైన్‌లోని కోజిక్‌ యాసిడ్‌ వల్ల కలిగే ప్రయోజనాలను పొందవచ్చు.


book10.2.jpg

ఇది యాంటీ ఏజింగ్‌ అంటే వయసు పైబడటం వల్ల వచ్చే లక్షణాలను తగ్గిస్తుంది. సన్‌ స్పాట్స్‌ను తొలగిస్తుంది. ‘గ్రీన్‌ టీ బాత్‌’ చర్మ ఆరోగ్యాన్ని, రోగ నిరోధకశక్తిని పెంచుతుంది. టాంజావా, హకోన్‌ పర్వత ప్రాంతాల నుంచి సేకరించిన ఆకులతో ఈ గ్రీన్‌టీ తయారుచేస్తారు. గ్రీన్‌ టీలో కాటెచిన్స్‌ అనే యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మ కణాలను రక్షిస్తాయి. చర్మం యవ్వనంగా ఉండేలా చూస్తాయి. టీ స్పా వద్ద 42 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండేలా చూస్తారు. ఇక ‘కాఫీ బాత్‌’ విషయాని కొస్తే... హకోన్‌లోని సహజ సిద్ధమైన వేడి నీటి బుగ్గల నుంచి వచ్చిన నీటితో కాఫీ తయారుచేస్తారు. ఎప్పటికప్పుడు కొలనులో తాజా కాఫీ పోస్తుంటారు. కాఫీలో కెఫెన్‌ ఉంటుందనే విషయం తెలిసిందే. ఇది వాపు, ఉబ్బరం లాంటి వాటిని తగ్గిస్తుంది.


‘డెడ్‌ సీ’ తరహాలో...

ఇక్కడే కాదు... ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల ఇలాంటి ‘వైన్‌ స్పా’లు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటన్నింటిలోనూ జపాన్‌లో ఉన్న ‘యునెస్సన్‌ స్పా’ అతి పెద్దది. అంతేకాకుండా ఇక్కడ రకరకాల పానీయాలలో బాత్‌ చేసే సౌలభ్యం కూడా ఉంది. చాక్లెట్‌ బాత్‌, సాల్ట్‌ వాటర్‌ బాత్‌ వంటి అనేక స్నానాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ‘సాల్ట్‌ వాటర్‌ బాత్‌’లో స్నానం చేసే వారు ‘డెడ్‌సీ’ తరహాలో నీటిపై తేలియాడటం చూడొచ్చు. ‘కొత్తదనంతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతుండటంతో... ఈ తరహా వెరైటీ స్పాలను సందర్శించేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంద’ని పర్యాటకరంగ నిపుణులు చెబుతున్నారు.

Updated Date - Oct 19 , 2025 | 01:11 PM