Share News

Anand Mahindra: ఇలా చేస్తే మన దేశంలోని నగరాల రూపురేఖలు మారిపోతాయి: ఆనంద్ మహీంద్రా

ABN , Publish Date - Nov 20 , 2025 | 09:17 PM

భారత నగరాలను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఓ సులువైన పరిష్కారాన్ని సూచించారు. ఈ పరిష్కారంతో నగరాల లుక్ మారిపోతుందని చెప్పారు. ఈ సూచనతో అనేక మంది ఏకీభవించడంతో ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.

Anand Mahindra: ఇలా చేస్తే మన దేశంలోని నగరాల రూపురేఖలు మారిపోతాయి: ఆనంద్ మహీంద్రా
Anand Mahindra on Footpaths' Importance

ఇంటర్నెట్ డెస్క్: ఒక దేశం సాధించిన ప్రగతికి అక్కడి నగరాలే ప్రతిబింబాలు అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, నగరాల డిజైనింగ్‌లో లోటుపాట్ల కారణంగా భారత దేశ నగరాలకు ఆశించిన మేర గుర్తింపు లభించట్లేదు. ఈ సమస్యకు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఓ పరిష్కారాన్ని సూచించారు. నెట్టింట ఆయన పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ ట్రెండవుతోంది (Anand Mahindra).

ఫుట్‌పాత్‌లను సక్రమంగా నిర్వహిస్తే నగరాల రూపు రేఖలు మారిపోతాయని ఆనంద్ మహీంద్రా అన్నారు. గుజరాత్‌లోని మెహసానా నగరంలోగల రాధన్‌పూర్‌లో ఫుట్‌పాత్‌ల నిర్మాణానికి సంబంధించిన ఓ వీడియోను షేర్ చేశారు. నగర స్వరూప స్వభావాల్ని, జనాభిప్రాయాన్ని మార్చగలిగే శక్తి ఫుట్‌పాత్‌లకు ఉందని ఆయన అన్నారు. ప్రతి రోడ్డుపై అందంగా తీర్చిదిద్దన ఫుట్‌పాత్‌లను చూస్తే ఎవరికైనా అక్కడి ప్రజలపై, ప్రభుత్వ నిర్వహణపై సదభిప్రాయం కలుగుతుందని చెప్పారు (Important of Footpaths in Urban planning).


అయితే, పరిశుభ్రమైన ఫుట్‌పాత్‌ల ఏర్పాటు, నిర్వహణపై భారత్‌లో తగినంత ప్రాధాన్యం లభించట్లేదని ఆనంద్ మహీంద్రా విచారం వ్యక్తం చేశారు. నగర జీవనంపై అత్యధిక ప్రభావం చూపించే ఫుట్‌పాత్‌లతో ఖర్చు కూడా చాలా తక్కువని చెప్పారు. నగర ప్రజలు రోజువారీ జర్నీ మరింత సులువు అవుతుందని, టూరిస్టులకు నగరం ఆకర్షణీయంగా మారుతుందని వివరించారు. ఫలితంగా స్థానిక వ్యాపారాలకు వినియోగదారులు పెరిగి లాభాలు వచ్చిపడతాయని అన్నారు. నగరాలను ఆకర్షణీయంగా భద్రంగా, సౌకర్యవంతంగా తీర్చిదిద్దాలనుకుంటే ఫుట్‌పాత్‌ల నిర్వహణకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఫుట్‌పాత్‌లను మిగులు భూమిగా కాకుండా, ప్రజల హక్కుగా పరిగణించాలని చెప్పారు. ఈ పోస్టుపై జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. అనేక మంది ఆయన అభిప్రాయంతో ఏకీభవించారు. ఈ మేరకు ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాలని నెట్టింట కోరారు.

Updated Date - Nov 20 , 2025 | 09:27 PM