US Immigration: ట్రంప్ దెబ్బకు అమెరికాకు భారీగా తగ్గిన వలసలు.. ఆర్థికంగా దెబ్బ తప్పదంటున్న సర్వే
ABN , Publish Date - Aug 23 , 2025 | 12:49 PM
ట్రంప్ సర్కారు కఠిన వైఖరి కారణంగా అమెరికాలోకి వలసలు భారీగా తగ్గాయని ప్యూ రీసెర్చ్ సెంటర్ నిర్వహించిన అధ్యయనంలో తాజాగా వెల్లడైంది. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ మధ్య కాలంలో వలసలు ఏకంగా 1.5 మిలియన్‌ల మేర తగ్గినట్టు సంస్థ అధ్యయనంలో తేలింది. ఫలితంగా జనాభాలో వలసదారుల వాటా 15.8 శాతం నుంచి 15.4 శాతానికి పడిపోయింది.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న కఠిన వైఖరి కారణంగా వలసలు భారీగా పడిపోయాయి. 1960ల తరువాత తొలిసారిగా అమెరికాలో వలసదారుల సంఖ్య ఏకంగా 1.5 మిలియన్‌ల మేర తగ్గింది. ప్యూ రీసెర్చ్ సెంటర్ ఈ విషయాన్ని వెల్లడించింది. వలసదారుల తగ్గుదల కారణంగా అమెరికా ఆర్థికవ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడొచ్చని అంచనా వేసింది.
గురువారం విడుదలైన ఈ అధ్యయనం ప్రకారం, అమెరికాలో జనవరి-జూన్ మధ్యకాలంలో వలసదారుల సంఖ్య ఏకంగా 1.5 మిలియన్‌ల మేర పడిపోయింది. ఫలితంగా మొత్తం వలసదారుల సంఖ్య 53.3 మిలియన్‌ల నుంచి 51.9 మిలియన్‌లకు చేరుకుంది. ఇది నాటకీయ మార్పు అని ప్యూ రీసెర్చ్ సెంటర్ సీనియర్ అధికారి జెఫ్రీ పాసెల్ మీడియాతో వ్యాఖ్యానించారు. ఇది లేబర్ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపిస్తోందని అన్నారు. వలసలకు అడ్డుకట్ట పడటంతో అమెరికాలో కార్మికుల సంఖ్య సుమారు 7.5 లక్షల మేర తగ్గిందని చెప్పారు.
‘ఉద్యోగం, ఉపాధి పొందే వయసులో ఉన్న అమెరికన్ల సంఖ్య పెరగట్లేదు. ఈ నేపథ్యంలో కార్మికుల సంఖ్య పెరగాలంటే వలసలను అనుమతించడం ఒక్కటే మార్గం. దేశంలో పని చేసే వారి సంఖ్య పెరగకపోతే ఆర్థికంగా కష్టమే’ అని అన్నారు. వలసదారుల సంఖ్య ఈ స్థాయిలో తగ్గడం మునుపెన్నడూ చూడలేదని కూడా పేర్కొన్నారు. ట్రంప్ చర్యల కారణంగా అక్రమ వలసలు కూడా తగ్గాయని అన్నారు. 2023లో 14 మిలియన్‌లుగా ఉన్న అక్రమ వలసలు ఆ తరువాత క్రమంగా తగ్గడం ప్రారంభించాయని తెలిపారు. ట్రంప్ సర్కారు భారీ స్థాయిలో డిపోర్టేషన్‌లు చేపడుతుండటమే ఇందుకు కారణమని తెలిపారు.
వలసలు తగ్గినప్పటికీ వలసదారుల సంఖ్యా పరంగా అమెరికా ఇప్పటికీ ప్రపంచంలో అగ్రస్థానంలో ఉందని అన్నారు. అయితే, దేశ జనాభాలో వలసదారుల వాటా అత్యధికంగా ఉన్న దేశాల్లో కెనడా, యూఏపీ టాప్‌లో ఉన్నాయని చెప్పారు. అమెరికా జనాభాలో వలసదారుల వాటా జనవరిలో 15.8 శాతంగా ఉందని అన్నారు. కానీ జూన్ నాటికి ఇది 15.4 శాతానికి పడిపోయిందని చెప్పారు. ఒకప్పుడు మెక్సికో, సెంట్రల్ అమెరికా నుంచి యూఎస్ఏకు వలసలు ఎక్కువగా ఉండేవని, ప్రస్తుతం దక్షిణ అమెరికా దేశాల నుంచి వలసలు పెరిగాయని కూడా జెఫ్రీ పేర్కొన్నారు. వలసదారుల సంఖ్యా పరంగా కాలిఫోర్నియా, టెక్సాస్ ముందు వరుసలో ఉన్నాయని చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి:
న్యూయార్క్‌లో రోడ్డు ప్రమాదం.. టూరిస్టు బస్సు పల్టీ కొట్టడంతో ఐదుగురి దుర్మరణం
ట్రంప్ సర్కార్ మరో నిర్ణయం.. విదేశీయులకు మళ్లీ మొదలైన టెన్షన్