NRI: ప్రభుత్వ పథకానికి ప్రచారం.. సౌదీలో ఇద్దరు మలయాళీ ప్రముఖుల అరెస్ట్
ABN , Publish Date - Oct 29 , 2025 | 10:37 PM
ప్రభుత్వ బీమా పథకంపై సౌదీలోని కేరళ వారికి అవగాహన కల్పించేందుకు ప్రయత్నించిన ఇద్దరు ప్రవాసీ ప్రముఖులను స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సభలు, సమావేశాలపై సౌదీ అరేబియాలో నిషేధం ఉన్న నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: గల్ఫ్ దేశాలలోని ప్రవాసీ మలయాళీల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న బీమా పథకంపై అవగాహన కల్పించేందుకు ప్రయత్నించడం ఇద్దరు ఎన్నారైలను చిక్కుల్లోకి నెట్టేసింది. సౌదీ అరేబియా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. సౌదీలోని ఈశాన్య ప్రాంతంలో ఓ చోట ప్రవాసీయులు గుమిగూడినప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది.
కేరళ ప్రభుత్వం చేపడుతున్న ఈ పథకం ఆపదకాలంలో ఆపన్నహస్తంగా ఉంటుందని వివరిస్తున్న క్రమంలో వీరిని అరెస్ట్ చేసినట్లుగా తెలిసింది. అరెస్టయిన ఇద్దరు కూడా మలయాళీ సమాజంలో పేరుప్రతిష్ఠలు కల్గిన ప్రముఖులు. అందులో ఒకరు కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి అధ్యక్షుడుగా ఉన్న ప్రవాసీ వ్యవహారాల సంస్థలో డైరెక్టర్‌గా ఉన్నారు.
అరెస్టయిన ఈ ఇద్దర్నీ విడిపించడానికి కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా రంగంలో దిగారు. రియాద్‌లోని భారతీయ ఎంబసీ కూడా వారిని బెయిల్‌పై విడిపించడానికి గత కొన్ని రోజులుగా శతవిధాలుగా ప్రయత్నిస్తున్నా ఇప్పటి వరకు ప్రయోజనం దక్కలేదు.
సభలు, సమావేశాలపై సౌదీ అరేబియాతో పాటు ఇతర గల్ఫ్ దేశాలలో నిషేధం ఉన్నా తెలుగు వారితో సహా అనేకులు ఎలాంటి అనుమతులు పొందకుండా సమావేశాలు నిర్వహిస్తుంటారు. ఈ రకమైన కార్యకలాపాలపై పోలీసులు ఎప్పుడు ఓ కన్నేసి ఉంచుతారు.
ఈ వార్తలు కూడా చదవండి..
దుబాయ్‌లో దేవతా వనాల మధ్య జనసేన వనభోజనాలు
గల్ఫ్ నుండి ఆంధ్రప్రదేశ్‌కు అంతర్జాతీయ విమానాలు నడపాలి..ఏపీ సీఎంకు ఎన్నారైల విజ్ఞప్తి