NRI: గల్ఫ్ నుండి ఆంధ్రప్రదేశ్‌కు అంతర్జాతీయ విమానాలు నడపాలి..ఏపీ సీఎంకు ఎన్నారైల విజ్ఞప్తి
ABN , Publish Date - Oct 29 , 2025 | 09:53 PM
సీఎం చంద్రబాబు దూబాయ్ పర్యటన సందర్భంగా పలువురు ఎన్నారై ప్రముఖులు ఆయనను కలిసి ఏపీ ప్రవాసాంధ్రుల సమస్యలను వివరించారు. ఈ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: గల్ఫ్ దేశాలలో పని చేస్తున్న ఏపీ ప్రవాసాంధ్రులు నిత్యం అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. డైరెక్ట్ అంతర్జాతీయ ఫ్లైట్ సర్వీసులు మొదలు గామ్క మెడికల్ సెంటర్లు, హౌజ్ మెయిడ్స్ వరకూ వివిధ సమస్యల గురించి ఒమాన్‌లోని ప్రవాసాంధ్ర ప్రముఖులు ఇటీవల ముఖ్యమంత్రి యన్.చంద్రబాబు నాయుడుకు (CM Chandrababu) వివరించారు .
సీఎం చంద్రబాబు దుబాయ్ పర్యటన సందర్భంగా ఒమాన్ ప్రవాసాంధ్ర ప్రముఖులు అనిల్ కుమార్ నగిడి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిని కలిసిన ఒమానీ ప్రవాసాంధ్రుల బృందం ఒకటి ప్రత్యేకంగా యూఏఈకి వచ్చి సీఎంతో సమావేశమై ఒమాన్, ఇతర గల్ఫ్ దేశాలలో నిరంతరంగా కొనసాగుతున్న సమస్యలను వివరించారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలలోని మహిళలు దళారుల మభ్యమాటలకు మోసపోయి గల్ఫ్ దేశాలకు వచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని చెప్పారు. దీనికి ఆంధ్రప్రదేశ్‌లోని కొందరు మధ్యవర్తులు కారణమని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
మెయిడ్‌ల సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేక సహాయక కేంద్రాన్ని నెలకొల్పాలని కూడా కోరారు. గల్ఫ్ దేశాలలో వీరికి అవసరమైన న్యాయసహాయం అందించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఆంధ్రప్రదేశ్ నుండి పెద్ద సంఖ్యలో ప్రవాసీయులు విదేశాలలో నివసిస్తున్నా విజయవాడకు అంతర్జాతీయ విమాన సదుపాయం లేదని కూడా అనిల్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. విజయవాడ, తిరుపతి నగరాలకు అంతర్జాతీయ విమాన సర్వీసులను విస్తరించడంతో పాటు విశాఖకు అనుసంధానత మరింత పెంచాలని కూడా ఆయన కోరారు.
గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వచ్చే వారికి అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించడానికి రాష్ట్రంలో ఎక్కడా కూడా గామ్క మెడికల్ సెంటర్లు లేవని, వీటిని రాష్ట్రంలో నెలకొల్పాలని కూడా అనిల్ కోరారు.
రాష్ట్రంలోని పర్యాటక, ఆతిథ్య రంగాలలో పెట్టుబడులు పెట్టడానికి గల్ఫ్ ప్రవాసాంధ్రులు అనేక మంది ఆసక్తి ప్రదర్శిస్తున్నారని వారికి ఈ విషయమై సహయమందించి ప్రత్యేక రాయతీలు ఇవ్వాలని కూడా కోరారు.
ముఖ్యమంత్రిని కలిసిన వారిలో అనిల్, చిన్నారావుతో పాటు కృష్ణా వంకాయలపల్లి, హరికృష్ణ పతిబండ్ల, వెంకటసాయి నిడుమోలు, బొళ్ళిన రామచంద్రరావు, సురేశ్ కుమార్ నూకల, బొంతు నాగరాజు, చంద్రశేఖర్ కొర్రపాటి, బమ్మిడి మధుబాబు, కొమ్మినేని రవికాంత్, గోరంట్ల వాసుబాబు, డాక్టర్ నల్లూరి వెంకటేశ్వర్లు, చిరంజీవి తిరుమలశెట్టిలు ఉన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నవ్యాంధ్రప్రదేశ్‌లో సంపద సృష్టిలో భాగస్వామ్యం అందిస్తాం: గల్ఫ్ తెలుగు వైశ్యవ్యాపారవర్గాలు
మహిళా శరణాలయాల్లో తానా, లీడ్ ది పాత్ ఫౌండేషన్ సేవా కార్యక్రమం