TANA: తానా ప్రపంచ సాహిత్యవేదిక ఆధ్వర్యంలో ‘తెలంగాణ గడ్డపై ప్రభవించిన ప్రతిభామూర్తులు’ సభ
ABN , Publish Date - Sep 29 , 2025 | 06:59 PM
తానా సాహిత్య విభాగం ‘తానా ప్రపంచసాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో ఆదివారం డా. కాళోజీ నారాయణరావు వర్ధంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర తెలుగు భాషాదినోత్సవం పురస్కరించుకుని ‘తెలంగాణ గడ్డపై ప్రభవించిన ప్రతిభామూర్తులు’ పేరిట నిర్వహించిన ఈ అంతర్జాల సమావేశం విజయవంతంగా జరిగింది.
డాలస్, టెక్సస్: తానా సాహిత్య విభాగం ‘తానా ప్రపంచసాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో ‘నెల నెలా తెలుగు వెలుగు’ పేరిట గత ఐదున్నర సంవత్సరాలగా ప్రతి నెలా ఆఖరి ఆదివారం సాహిత్య సదస్సులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం 84వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశం పద్మవిభూషణ్ డా. కాళోజీ నారాయణరావు వర్ధంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర తెలుగు భాషాదినోత్సవం పురస్కరించుకుని నిర్వహించారు. ‘తెలంగాణ గడ్డపై ప్రభవించిన ప్రతిభామూర్తులు’ పేరిట నిర్వహించిన ఈ అంతర్జాల సమావేశం విజయవంతంగా జరిగింది.
తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ అతిథులను ఆహ్వానించి సభను ప్రారంభిస్తూ తెలంగాణ గడ్డపై జన్మించిన ఎంతోమంది సాహితీవేత్తలు విశేష కృషి చేశారని అన్నారు. కాళోజీ జయంతి సందర్భంగా వారిలో కొంత మందిని ఈ రోజు స్మరించుకోవడం ఆనందదాయకం అని అన్నారు.
తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ తెలుగు నేలపై ప్రభవించిన ప్రతిభావంతులు కేవలం ఉభయ తెలుగు రాష్ట్రాలలోనే గాక, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారని అన్నారు. సాహిత్య, సంగీత, విద్య, వైజ్ఞానిక, వ్యాపార, శాస్త్ర, సాంకేతిక, సినీ, రాజకీయ, క్రీడా, సేవా రంగాలలో తెలుగు వారు కీర్తి గడించినప్పుడు ప్రాంతాలకు అతీతంగా ప్రతి తెలుగు గుండె గర్వంతో ఉప్పొంగుతుందని అన్నారు. తెలంగాణ ప్రాంతంలో జన్మించి సాహిత్యరంగంలో విశేష కృషిచేసిన వారిలో కొంత మందిని తెలంగాణ రాష్ట్ర తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా స్మరించుకుని ఘన నివాళులు అర్పించుకోవడం సముచితమని, సందర్భోచితమైనదని అన్నారు. వీరు చేసిన సాహిత్య కృషి భావి తరాలకు స్పూర్తిదాయకమైనది అన్నారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆచార్య డా. అనుమాండ్ల భూమయ్య (పూర్వ ఉపకులపతి, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్) మాట్లాడుతూ.. పద్మ విభూషణ్ డా. కాళోజీ నారాయణరావు బహుభాషా పండితులని అన్నారు. సమకాలీన సామాజిక సమస్యలపై నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా, కటువుగా స్పందిస్తూ పాలకులపై.. ముఖ్యంగా నిజాం ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా అక్షర పోరాటం చేసి జైలు శిక్ష అనుభవించిన ప్రజాకవి అని ప్రస్తుతించారు.


ఇవి కూడా చదవండి..
విజయవంతమైన న్యూ ఇంగ్లాండ్ తానా, గ్రేస్ ఫౌండేషన్ 5కే రన్
సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ ఆధ్వర్యంలో చండీ హోమం
Read Latest NRI News And Telugu News