NRI: విజయవంతంగా ఆంధ్ర బాలానంద సంఘం ముచ్చట్లు
ABN , First Publish Date - 2025-04-30T17:02:18+05:30 IST
తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డాక్టర్ ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. రేడియో అన్నయ్య, అక్కయ్యలు ఆకాశవాణిలో "బాలానందం" కార్యక్రమం ద్వారా పిల్లలకు గేయాలు, రూపకాలు, ఆటలు, పాటలతో తెలుగు భాష, సాహిత్యం పట్ల ఆసక్తిని కలిగించారని..
తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతిని పిల్లల హృదయాల్లో నాటేందుకు 85 ఏళ్లుగా కృషి చేస్తున్న ఆంధ్ర బాలానంద సంఘం స్మృతులను సజీవంగా నిలిపేందుకు, తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహించే "నెల నెలా తెలుగు వెలుగు" కార్యక్రమంలో భాగంగా, "రేడియో అన్నయ్య, అక్కయ్య గార్ల స్మృతిలో - 85 వసంతాల ఆంధ్ర బాలానంద సంఘం ముచ్చట్లు" అంశంపై నిర్వహించిన 79వ అంతర్జాతీయ దృశ్య సమావేశం అందరి మనసులను ఆకట్టుకుంది. పెద్దల ప్రసంగాలు, పిల్లలు ఆలపించిన బాలానందం పాటలతో ఈ కార్యక్రమం కోలాహలంగా సాగింది.
తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు అతిథులందరికీ స్వాగతం పలుకుతూ, 85 ఏళ్ల చరిత్ర కలిగిన ఆంధ్ర బాలానంద సంఘం వెనుక రేడియో అన్నయ్య, అక్కయ్యగార్ల (న్యాయపతి రాఘవరావు, కామేశ్వరి) అసమాన కృషి ఉందని కొనియాడారు. పిల్లల మానసిక, సాంస్కృతిక వికాసంలో వారు చేసిన సేవలు అనన్యమని అన్నారు.
తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డాక్టర్ ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. రేడియో అన్నయ్య, అక్కయ్యలు ఆకాశవాణిలో "బాలానందం" కార్యక్రమం ద్వారా పిల్లలకు గేయాలు, రూపకాలు, ఆటలు, పాటలతో తెలుగు భాష, సాహిత్యం పట్ల ఆసక్తిని కలిగించారని తెలిపారు. ఈ కార్యక్రమం వారంవారం కొన్ని దశాబ్దాలపాటు కొనసాగి, పిల్లలలో క్రమశిక్షణ, సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలను పెంపొందించిందని, ఇలాంటి విలువలను పిల్లలకు చిన్న వయస్సులోనే నేర్పే బాధ్యత తల్లిదండ్రులదేనని అన్నారు.
ప్రత్యేక అతిథులుగా పాల్గొన్న సుప్రసిద్ధ ఆకాశవాణి కళాకారిణి శారదా శ్రీనివాసన్, అవనిగడ్డ శాసనసభ్యులు డాక్టర్ మండలి బుద్ధప్రసాద్, పద్మభూషణ్ డాక్టర్ కె.ఐ. వరప్రసాదరెడ్డి, డాక్టర్ మోహన్ కందా, ఆంధ్ర బాలానంద సంఘం అధ్యక్షులు జంధ్యాల కామేశ్వరి, ఆంధ్ర బాలానంద సంఘం ఉపాధ్యక్షులు కలగా కృష్ణమోహన్ రేడియో అన్నయ్య, అక్కయ్యలతో తమకున్న అనుబంధాన్ని, బాలానందం కార్యక్రమాల ద్వారా తాము పొందిన జ్ఞానాన్ని, ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు. వారి దూరదృష్టి, పిల్లల పట్ల అంకితభావం అజరామరమని కీర్తించారు.
విశిష్ట అతిథులైన ఎన్.వి. అశోక్, రావులపర్తి రాజేశ్వరి, నండూరి సీతా సాయిరాం, మాడభూషి బద్రినాథ్, డాక్టర్ ఆవుల హరిత, చినముత్తేవి కరుణ, మాలెంపాటి నవ్య, గోవిందు దేవరాజ బాలానందం సంఘం తమ జీవితాలను ఎలా సుసంపన్నం చేసిందో వివరించారు. సంగీతం, నృత్యం, నాటకాల ద్వారా పిల్లలలో సాంస్కృతిక విలువలను నింపిన ఈ సంస్థ సేవలు అమూల్యమని, రేడియో అన్నయ్య, అక్కయ్యలకు ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువేనని అన్నారు.
మరిన్ని వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Telugu Latest News Click Here