Sir Arthur Cotton: అరేబియా ఎడారిలోనూ గోదావరి వాసుల కాటన్ దొర స్మరణ
ABN , Publish Date - May 22 , 2025 | 09:36 PM
గోదావరిపై ఆనకట్ట నిర్మాణంతో ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన సర్ ఆర్థర్ కాటన్ జయంతి సందర్భంగా సౌదీలోని తెలుగువారు ఆయన సేవలను స్మరించుకున్నారు.
ఎల్లలు దాటినా కొనసాగుతున్న కృతజ్ఞత గొప్ప సంస్కారం
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి ఇర్ఫాన్: మానవ జీవితంలో కృతజ్ఞతకు ప్రధానమైన స్థానం ఉంది. మనకు మేలు చేసిన వారి పట్ల కృతజ్ఞతతో ఉండడం మన కనీస ధర్మం అని మరిచిపోతున్న ప్రస్తుత కాలంలో తమ పూర్వీకుల సంప్రదాయాన్ని గౌరవిస్తూ తమకు ఉపకారం చేసిన వ్యక్తిని సగౌరవంగా స్మరించుకోవడం మాననీయ విలువలను పెంచుతుంది. అందునా విదేశాలలో ఉంటూ కూడా కృతజ్ఞతను శ్లోకాల రూపంలో స్మరించుకోవడం నిస్సందేహంగా ఒక ఆదర్శనీయ సంప్రదాయం.
‘నిత్య గోదావరీ స్నాన పుణ్యదోయోమహమతిః, స్మరామ్యాంగ్లేయ దేశీయం కాటనుంతం భగీరథం’ ఇదీ నేటికీ గోదావరి వాసులు స్మరించే శ్లోకం. అపర భగీరుథుడైన ఆంగ్లేయ ఇంజినీర్ సర్ ఆర్థర్ కాటన్ కారణంగా తాము నిత్యం ఉదయాన్నే గోదావరిలో స్నానమాచరించే భాగ్యం కలిగిందన్నది దాని సారాంశం.
కేవలం గోదావరిలో స్నానమాచరించే అవకాశమే కాదు, తమ జీవితాల్లో సమూల మార్పులకు మూలం ఆర్థర్ కాటన్ ఆలోచనే అని ప్రపంచంలోని ఏ మూలన ఉన్నా గోదావరి తీర వాసులు నేటికీ విశ్వసిస్తారు. నవ తరానికి చెందిన అత్యధికులు వ్యవసాయాన్ని కాకుండా వృత్తిపర రంగాలలో ఇంటాబయటా రాణిస్తున్నా తమ ప్రాంతానికి అన్నపూర్ణగా పేరు రావడానికి, తమ జీవితాలలో వెలుగులు నింపిన కాటన్‌ను దేవుడితో సమానంగా పరిగణిస్తారు. ఆంధ్ర, అమెరికా లేదా అరేబియా ఏది ఇందుకు మినహాయింపు కాదు.

సౌదీ అరేబియా రాజధాని రియాధ్‌లో ఇంజినీర్‌గా పని చేస్తున్న రాణి లక్ష్మీ నర్సింహమూర్తి (ఆర్.యల్.యన్.మూర్తి)ది హైదరాబాద్ నగరమైనా ఆయన తండ్రి కామేశ్వర్రావు, తాతలది పశ్చిమ గోదావరి జిల్లా రావులపాలెం మండలం. తండ్రి యువ్వనంలోనే హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడడంతో మూర్తి బాల్యమంతా అక్కడే గడిచింది. ఆ తర్వాత సౌదీ అరేబియాకు వచ్చి ఇంజినీరింగ్ కార్యకలాపాలను ప్రారంభించినా ఆయన తన పూర్వీకుల వారసత్వాన్ని మాత్రం మరిచిపోలేదు.
అనేక మంది గోదావరి జిల్లా వాసుల తరహాలో మూర్తి, ఆయన సోదరులు క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం కాటన్ జయంతి సందర్భంగా వేద పండితుల సత్కార సభను నిర్వహిస్తుంటారు. ఇటీవల ఆయన దీన్ని నిర్వహించారు. కొన్ని సార్లు సౌదీ నుండి మూర్తి ప్రత్యేకించి వెళ్ళి కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా అనేక సార్లు ఆయన సోదరులు హైదరాబాద్‌లో దీన్ని నిర్వహిస్తారు. తమ పితృదేవుళ్లతో సమానంగా కాటన్‌కు పిండ ప్రదానాలు కూడ చేస్తామని ఆయన చెప్పారు.
వాస్తవానికి హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన తమకు వ్యవసాయం లేదని, తమ తండ్రి కూడా హైదరాబాద్ నగరంలో ప్రభుత్వ ఉద్యోగం చేశారని, కానీ తమ తండ్రికి ఆయన జన్మస్థలంపై ఉన్న ప్రేమ కారణాన, తమ పూర్వీకుల ప్రాంతమైన గోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేసి కడుపు నింపిన మహనీయుడిగా కాటన్‌ను ఆదరిస్తామని, దేవుడితో సమానంగా భావిస్తామని మూర్తి పేర్కొన్నారు.

ప్రస్తుతం సౌదీ అరేబియాలోని ఆధునిక ఇంజినీరింగ్ రంగంలో తమ కార్యకలాపాలను కొనసాగించే మూర్తి మాటలలో... ఎలాంటి యంత్ర సామాగ్రి లేని ఆ కాలంలో ధవళేశ్వరం దగ్గర ఆనకట్ట నిర్మాణం చేసిన తీరును ఒక్క సారి పరిశీలిస్తే విచిత్రమనిపిస్తుందని అన్నారు. బ్యారేజి ద్వారా పంటలు పండించుకునే అవకాశం కల్పించినందుకు ఆయనకు రుణపడి ఉంటామని మూర్తి సగర్వంగా చెప్పారు.
ప్రస్తుతం ఖఫ్జీలో ఒక ప్రాజెక్టు పనిపై ఉన్న మూర్తి.. భగీరథుడు గంగను భూమిపైకి రప్పిస్తే.. ఈ అపర భగీరథుడయిన కాటన్ ఎంతోమంది రైతులకు తాగు, సాగు నీటిని అందించాడు. అందుకే ఆయనను దేవునితో సమానంగా కొలుస్తామని, శ్లోకంలో పేరును చేర్చి పూజిస్తామని వ్యాఖ్యానించారు.
“ మా ఇళ్లలో దేవుడి ఫొటోలతో సమానంగా కాటన్ ఫోటో ఉంటుంది. ఊరూరా విగ్రహాలు ఉంటాయి. ఏటా ఆయన జయంతి, వర్థంతి జరుపుతాం. మా తాతముత్తాతల నుంచి ఇది వారసత్వంగా వస్తోంది, దీన్ని సౌదీలో ఉండే తన కొడుకు యశస్వి రఘురాం, తమ కుటుంబ ముందు తరం కూడా కొనసాగిస్తుంది” అని మూర్తి వివరించారు.
ఇవి కూడా చదవండి:
ఐర్‌లాండ్‌లో శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి జన్మదినోత్సవ కార్యక్రమాలు
ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవానికి సౌదీ పిలుస్తోంది రా.. కదలి రా
SATA: సాటా రియాధ్ అధ్యక్షురాలిగా చేతన నియామకం
బహ్రెయిన్‌లో ఘనంగా చంద్రబాబు 75వ జన్మదిన వేడుకలు