NRI: విలువ కోల్పోతున్న శాలువా సత్కారాలు
ABN , Publish Date - Dec 16 , 2025 | 10:07 PM
ప్రవాసీయులలో పురస్కారం ప్రహసనంగా మారిపోయింది. శాలువా సత్కారాలు ప్రస్తుతం విలువ కోల్పోతున్నాయన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి ఇర్ఫాన్: శాలువాతో సత్కారం చేయడం ఒకప్పుడు అతి అరుదైన సన్నివేశం. హిమాలయ పర్వతాలలో 14 వేల అడుగుల ఎత్తున పర్వత ప్రాంతాలలో మేసే గొర్రెల బొచ్చుతో అల్లిన పశ్మినా శాలువాలు అసలైనవి. మొఘల్ చక్రవర్తి అక్బర్ తన సామ్రాజ్య విస్తరణలో భాగంగా కీలక సందర్భాలలో ఈ శాలువాలు లేదా దాంతో తయారుచేసిన తలపాగాను బహుకరించే వాడు. ప్రస్తుత ఇరాన్, టర్కీ సామ్రాజ్యాధినేతలతో మైత్రిలో భాగంగా వారికి కూడా ఈ శాలువాలు బహూకరించే సంప్రదాయాన్ని మొఘల్ పాలకులు శ్రీకారం చుట్టగా ఆ తర్వాత వచ్చిన ఏలికలందరూ కూడా దీన్ని పాటిస్తున్నారు. ఇక తెలుగునాట తమకు చేసిన అత్యున్నత సేవలకు గాను రాజులు గ్రామాలు బహుమానాలుగా ఇచ్చే వారు కానీ శాలువాలు కప్పి సన్మానించడానికి మాత్రం సిద్ధపడే వారు కారు. వెంకటగిరి, గద్వాల సంస్థానాలు పట్టు వస్త్రాల నైపుణ్యానికి ప్రతీకలు అయినా ఈ సంస్థానాధీశులు శాలువాల సంస్కృతిని పోషించలేదు. నిజాం నవాబులు కూడా సాధారణంగా శాలువాలతో సత్కరించిన సందర్భాలు లేవు.
స్వతంత్ర భారతంలో మాత్రం ప్రసిద్ధిగాంచిన సాహితీవేత్తలకు, అతి అరుదైన నిష్ణాతులైన వ్యక్తులకు ఉగాది రోజున శాలువాలతో సత్కరించే విధానం మొదలైంది. క్రమేణా పశ్మీనా శాలువాల బదులుగా పట్టు శాలువాలు ఆ తర్వాత వివిధ రకాల శాలువాలతో సత్కార కార్యక్రమాలు జరుగుతున్నాయి. తమతో భేటీకి వచ్చే ప్రముఖులను పట్టు శాలువాలు, జ్ఞాపికలతో సత్కరించడానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రత్యేక కేటాయింపు కూడా ఉంటుంది.
ఈ నేపథ్యంలో గత దశాబ్దకాలంగా తెలుగునాట రాజకీయ నాయకులకు, ప్రభుత్వ అధికారులకు స్వాగతం పలుకుతూ సత్కరించే సంస్కృతి పెరిగిపోతోంది. సత్కారంలో పుష్పగుచ్చాలు, జ్ఞాపికలు కూడా ఉన్నా మాములు శాలువాలు సింహభాగం ఆక్రమిస్తున్నాయి. శాలువాలు కప్పడం, ఫొటోలు తీసుకోవడం ఒక ఆనవాయితీగా మారింది.
ఈ ఆనవాయితీ వేగంగా విదేశాలలోని తెలుగువారిలో కూడా విస్తరించింది. సామాజిక మాధ్యమాలు కేంద్రీకృతంగా మాత్రమే మనుగడ సాగించే కొన్ని ప్రవాసీ సంఘాలలో పిలిచిన ప్రతి కార్యక్రమానికి వచ్చిన వారికి ఖరీదైన పుష్ప గుచ్ఛాలు, జ్ఞాపికలు ఇవ్వడాన్ని విస్మరించి చౌకగా లభించే శాలువాలు కప్పడం మాత్రం జోరందుకుంది. పరస్పరం శాలువాలు కప్పించుకునే దుష్ట సంప్రదాయం బలపడుతోంది. చివరకు షాపింగ్ మాల్స్‌లో మూత్రశాలలు, పార్కింగ్ స్థలాల వద్ద, రెస్టారెంట్లలో డైనింగ్ టేబుళ్ళ ముందు కూడా శాలువాలు కప్పుకోవడం లేదా కప్పడం కూడా జరుగుతోంది. సాధారణంగా శాలువాల సత్కారానికి హైదరాబాదీలు దూరంగా ఉండే వారు కానీ గత కొన్నాళ్లుగా వారిలో కూడా ఈ జాడ్యం పెరిగిపోయింది.
అసలు శాలువాలు కప్పుకోవడం కోసం మాత్రమే అన్నట్లుగా మొక్కుబడిగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. గల్ఫ్‌లోని కొన్ని దేశాలలో సన్మానాలు అపహాస్యం పాలై, సన్మానంలో ‘మానం’ ఎంత అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. దుబాయ్, దోహాలలో అయితే ఇది నిత్యకృత్యంగా మారిపోయింది.
ఏ సామాజిక, నైతిక విలువలు, ప్రమాణాలతో ఈ శాలువాలు కప్పుతున్నారో తెలియదు. అదే విధంగా అవార్డులు ఏ ప్రాతిపాదికన, ఎందుకు ఇస్తున్నారో కూడా తెలియదు. ఏమీ తెలియకుండా ఒక దానం లేదా పరస్పర సహాయంగా సంఘాల పేరిట కొందరు వ్యక్తులు ఇచ్చిపుచ్చుకునే ఈ పురస్కారాలు ఒక ప్రహసనంగా మారుతున్నాయి. వ్యక్తిగత ఇష్టాలు, కారణాలతో రెస్టారెంట్లు ఒకొక్కటిగా దొరికే పురస్కారాల మధ్యలో భారతదేశంలో ఏ పేరు, ఊరు దిక్కు లేని సంస్థలు విక్రయించే లేదా అందించే పురస్కారాలు అదనం. ఇటీవల కొందరు భారతదేశానికి వెళ్ళి అవార్డులను తీసుకోని రాగా మరికొందరు మాత్రం నేరుగా భారతదేశం నుండి ఇక్కడకు వచ్చి అవార్డులను ఇచ్చి వెళ్ళారు.
సత్కార సందర్భంలో వేదికపై ఎవరైనా భారతీయ అధికారులు లేదా పర్యటనకు వచ్చిన రాజకీయ నాయకులు ఉంటే పరిస్ధితి మరింత ముదురుతుంది. పిలవని పేరాంటానికి వచ్చి పెద్దరికం చేస్తున్నట్లుగా నటిస్తూ ఫొటోలు తీసుకునే ‘ప్రముఖుల’ సంఖ్యకు కొదవే లేదు. ఈ చొరబాటుదారులను అరికట్టడానికి ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నా శాలువా దగ్గర వాలిపోతున్నారు.
గతంలో ఒక వెయ్యి నూట పదహార్లు, పూలదండలు, ఒక జ్ఞాపిక, సాధారణంగా ఖరీదైన పట్టు శాలువా అవసరమయ్యేది కానీ ఇప్పుడు కేవలం వంద రూపాయాలకు లభించే ఒక పాలిస్టర్ శాలువా ఉండి ఏదైన ఒక వాట్సాప్ గ్రూప్‌లో సభ్యుడిగా ఉంటే చాలు సన్మాన ప్రదాత కావచ్చు. లక్ష్యం సాధించవచ్చు.
ఒకప్పుడు సినిమాలలో జమీందార్ల హుందాతనానికి తార్కాణంగా ఉన్న శాలువాలు ఇప్పుడు గల్ఫ్ దేశాలలో సంఘాల నాయకుల పుణ్యమా అని ఉచితంగా సరఫరా చేసే బతుకమ్మ చీరల కంటే కూడా చౌకగా దిగజారాయి. ఈ చీరలను ఇళ్ళకు రంగులు వేసే వారు క్రింద ఫ్లోర్ చెడిపోకుండా, మొక్కజొన్నలు ఎండబెట్టడానికి రోడ్లపై కొందరు వాడుతుంటారు.
ఈ వార్తలు కూడా చదవండి
సాల్ట్ లేక్ సిటీలో శంకర నేత్రాలయ నిధుల సేకరణ కార్యక్రమం
సుందర్ పిచాయ్‌తో ఏపీలో టెక్ పెట్టుబడులపై మంత్రి లోకేశ్ చర్చ