NRI: ఖతర్ నుండి వచ్చి.. ఒక్క ఓటు తేడాతో గెలిచిన సర్పంచ్
ABN , Publish Date - Dec 18 , 2025 | 02:21 PM
ఖతర్ నుంచి వచ్చిన ఎన్నారై పంచిత ధర్మరాజు యాదవ్ పంచాయతీ ఎన్నికల్లో ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. ప్రజలు విజ్ఞులని, అభివృద్ధి ఎజెండాను అర్థమయ్యే రీతిలో వివరిస్తే గెలిపిస్తారని ఆయన అన్నారు.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి ఇర్ఫాన్: స్వదేశంలో ఉన్నా విదేశాలలో ఉన్నా నిత్యం ప్రజల కోసం, ప్రజలతో ఉండాలని కోరుకునే స్వభావం అతణ్ణి మాతృభూమికి రప్పించడమే కాకుండా పుట్టిన ఊరికి నాయకుడిగా మార్చింది.
ఖతర్‌లోని పారిశ్రామిక ప్రాంతంలో సుమారు 16 ఏళ్ళకు పైగా పని చేసిన జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం సిరికొండ గ్రామానికి చెందిన పంచిత ధర్మరాజు యాదవ్ ఖతర్‌లోని తెలంగాణ ప్రవాసీయుల సంక్షేమ సంఘమైన తెలంగాణ గల్ఫ్ సమితి వ్యవస్థాపకులలో ఒకరు. ఖతర్‌లోని ప్రవాసీ కార్మికుల కోసం నిరంతరంగా పని చేసిన ఆయన గత సంవత్సరం స్వదేశానికి తిరిగి వచ్చి గ్రామంలోనూ రాజకీయాలకు అతీతంగా తనకు తోచిన విధంగా సేవలందిస్తూ పంచాయతీ ఎన్నికల బరిలోకి దిగారు. బుధవారం హోరాహోరీగా జరిగిన ఎన్నికలలో తన ప్రత్యర్థిపై ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు.
ప్రత్యర్థి సామాజికంగా, ఆర్థికంగా బలమైన వ్యక్తి అయినప్పటికీ తన సేవ ఉద్దేశ్యాన్ని ప్రజలకు అర్థమయ్యే విధంగా వివరించడంతో తనను ఆదరించారని ధర్మరాజు వ్యాఖ్యానించారు. ఓటర్లు విజ్ఞత కలిగిన వారని, వారికి సరైన విధంగా తన లక్ష్యాన్ని వివరిస్తే ఆదరిస్తారని తనకు గెలిచిన తర్వాత తెలిసిందని ఆయన అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
సాల్ట్ లేక్ సిటీలో శంకర నేత్రాలయ నిధుల సేకరణ కార్యక్రమం
సుందర్ పిచాయ్‌తో ఏపీలో టెక్ పెట్టుబడులపై మంత్రి లోకేశ్ చర్చ