Potluri Ravi: విద్యార్థిని ఉన్నత చదువుకు పొట్లూరి రవి సహాయం
ABN , Publish Date - Aug 19 , 2025 | 03:13 PM
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ పొట్లూరి రవి ఆర్థిక సాయంతో చదువుల్లో రాణించిన కర్నూలు జిల్లా విద్యార్థిని ఎంట్రన్స్ టెస్టులో ఉత్తీర్ణత సాధించి వెటర్నరీ సైన్స్‌కు ఎంపికయ్యారు.
ఇంటర్నెట్ డెస్క్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ పొట్లూరి రవి కర్నూలు జిల్లాలోని కప్పట్రాళ్ళ గ్రామ అభివృద్ధికి, మహిళల స్వయం ఉపాధికి, విద్యార్థుల చదువుకు సహాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కప్పట్రాళ్ళ గ్రామానికి చెందిన విద్యార్థిని మైమూన్ ఇంటర్మీడియెట్ విద్యాభ్యాసానికి రవి పొట్లూరి రూ.1.75 లక్షలు సహాయం అందించి ఆమెను ప్రైవేటు రెసిడెన్షియల్ కాలేజీలో చదివించారు. రవి పొట్లూరి ప్రోత్సాహంతో ఆమె నేడు ఇంటర్మీడియెట్‌లో ప్రతిభ ప్రదర్శించడంతోపాటు ప్రవేశపరీక్షలో 6,947 ర్యాంక్ సాధించి వెటర్నరీ కాలేజీలో సీటుకు అర్హత సాధించింది. విద్యార్థిని చదువులో రాణించడంపై రవి పొట్లూరి సంతోషం వ్యక్తం చేస్తూ ఆమెను శనివారం (16 ఆగస్టు) కర్నూల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో అభినందించారు.
కప్పట్రాళ్ళ గ్రామంలోనే పదవ తరగతిలో టాపర్‌గా నిలిచిన ఆమె ప్రతిభను గమనించి రవి పొట్లూరి ఇంటర్మీడియెట్ చదువుకు ఆర్థిక సహాయం అందించి ప్రోత్సహించారు. ఈ సందర్భంగా మైమూన్ మాట్లాడుతూ, రవి పొట్లూరి సహాయం మరువలేనిదని, తనలాంటి ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఆయన ఇస్తున్న ప్రోత్సాహానికి ధన్యవాదాలు తెలిపారు. ప్రతిభ గల విద్యార్థులను ప్రోత్సహించడంతో పాటు కప్పట్రాళ్ళ గ్రామ అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తూనే ఉంటానని ఈ సందర్భంగా రవి పొట్లూరి చెప్పారు. ఈ కార్యక్రమంలో జగదీష్ రెడ్డి అనుముల, టీటీడీ బోర్డు సభ్యుడు మల్లెల రాజశేఖర్, ముప్పా రాజశేఖర్, అగ్రికల్చరల్ ఆఫీసర్ అక్బర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
భారతీయ ట్రక్ డ్రైవర్ నిర్వాకం.. రోడ్డు ప్రమాదంపై ట్రంప్ ప్రభుత్వం ఫైర్
తానా పాఠశాల ఆధ్వర్యంలో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు