P4 Program AP: సౌదీలో పి-4 అవగాహాన కార్యక్రమం.. పాల్గొన్న మంత్రి శ్రీనివాస్
ABN , Publish Date - Sep 29 , 2025 | 07:32 PM
గల్ఫ్‌లోని కీలక దేశమైన సౌదీ అరేబియాలో శుక్రవారం రాత్రి నిర్వహించిన పి-4 అవగాహన కార్యక్రమానికి స్థానిక నివసిస్తున్న ప్రవాసాంధ్రులు.. ప్రత్యేకించి మహిళల నుండి విశేష స్పందన లభించింది.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన దారిద్ర్య నిర్మూలన కార్యక్రమం పి-4పై గల్ఫ్ దేశాలలోని ప్రవాసాంధ్రులలో ఆసక్తి వ్యక్తమవుతుంది. గల్ఫ్‌లోని కీలక దేశమైన సౌదీ అరేబియాలో శుక్రవారం రాత్రి నిర్వహించిన పి-4 అవగాహన కార్యక్రమానికి స్థానిక నివసిస్తున్న ప్రవాసాంధ్రులు.. ప్రత్యేకించి మహిళల నుండి విశేష స్పందన లభించింది.
సౌదీలోని ప్రఖ్యాత తెలుగు ప్రవాసీ సంఘమైన సాటా సెంట్రల్ నిర్వహించిన తెలుగు దినోత్సవం కార్యక్రమం సందర్భంగా తెలుగుదేశం పార్టీ సౌదీ అరేబియా ప్రతినిధులు పి-4 అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పి-4 గురించి విదేశీ గడ్డపై జరిగిన ప్రప్రథమ కార్యక్రమం ఇది.
300 మందికి పైగా మంది ప్రవాసాంధ్రులు పి-4 పథకంలో మార్గదర్శకులుగా చేరడానికి సంసిద్ధత వ్యక్తం చేసినట్లుగా కార్యక్రమ నిర్వహకుల్లో ఒకరయిన తెలుగుదేశం పార్టీ నాయకులు, పల్నాడు జిల్లాకు చెందిన శేఖ్ జానీ బాషా వెల్లడించారు.
దేశంలో కేరళతో సహా ఏ రాష్ట్రంలో లేని విధంగా సముగ్ర ప్రవాసీ సంక్షేమ విధానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలు చేయనున్నట్లుగా ప్రవాసీ వ్యవహారాల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. వీడియో కాల్ ద్వారా సభికులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రవాసీయులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటి నుండి కూడా ప్రత్యేక శ్రధ్ధ కనబరుస్తారని నొక్కి చెప్పారు. ప్రవాసీయుల సంక్షేమానికి సంబంధించి కేరళ కంటే మిన్నగా పంజాబ్‌కు దీటుగా ప్రతి జిల్లా కేంద్రంలో రెవెన్యూ, పోలీసు అధికారులతో కూడిన ఒక అధికారిక బృందాన్ని నెలకొల్పే దిశగా ప్రభుత్వం యోచిస్తుందని మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. సౌదీ అరేబియా, ఇతర గల్ఫ్ దేశాలలో పని చేస్తున్న ప్రవాసాంధ్రులు పి-4 పథకంలో భాగస్వామ్యం కావాలని మంత్రి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. పి-4 కమిటీ ఉపాధ్యక్షులు కుటుంబరావు చెరుకూరి, ఏపీ ఎన్నార్టీ సి.ఇ.ఓ డాక్టర్ పి. కృష్ణమోహన్‌లు కూడా విడియో కాల్ ద్వారా పీ-4 పథకం, ప్రవాసీయుల సంక్షేమ విధానాల గురించి వివరించారు.
పి-4 పథకంలో ఏ విధంగా నమోదు చేసుకోవాలనే ఆంశంపై సతీబాబు చొల్లంగి సవివరంగా తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకులు రావి రాధకృష్ణా, ఖాలీద్ సైఫుల్లా, రాజశేఖర్ చెన్నుపాటి, సతీబాబు చొల్లంగి, అనంత్ శ్రీనివాస్ దాడి, అక్షిత చెన్నుపాటి, శిల్ప గడ్డం నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనేక మంది మహిళలు కూడా పథకంలో భాగస్వామ్యం అవుతామని ముందుకు వచ్చినట్లుగా అక్షిత, శిల్పలు తెలిపారు. తెలుగు దినోత్సవ సందర్భంగా పి-4 పథకం ప్రచారానికి అవకాశం కల్పించడంపై సాటా సెంట్రల్ కోర్ కమిటీ ప్రతినిధులు ఆనందరాజు గుండుబోయిన, సుచరిత, రంజీత్ చిట్టులూరి, ముజ్జమ్మీల్ శేఖ్, ఎర్రన్న దుగ్గపు, యాఖూబ్ ఖాన్, ఆనంద్ పోకూరి, అక్షితలకు పి-4 పథకం నిర్వహకులు కృతజ్ఞతలు తెలిపారు.
ఇవి కూడా చదవండి
విజయవంతమైన న్యూ ఇంగ్లాండ్ తానా, గ్రేస్ ఫౌండేషన్ 5కే రన్
తానా ప్రపంచ సాహిత్యవేదిక ఆధ్వర్యంలో ‘తెలంగాణ గడ్డపై ప్రభవించిన ప్రతిభామూర్తులు’ సభ
Read Latest NRI News And Telugu News