Share News

NRIs in Panchayat Elections: పంచాయతీ ఎన్నికల్లో ప్రవాసీయుల పోటీ

ABN , Publish Date - Dec 10 , 2025 | 09:57 PM

పంచాయతీ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రవాసీయులు అనేక మంది స్వదేశానికి వచ్చారు. పక్కా వ్యూహంతో ప్రచారాన్ని హోరెత్తిస్తూ ఇతర అభ్యర్థులకు గట్టిపోటీని ఇస్తున్నారు.

NRIs in Panchayat Elections: పంచాయతీ ఎన్నికల్లో ప్రవాసీయుల పోటీ
NRIs in Panchayat Elections

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి ఇర్ఫాన్: మాతృభూమిపై మమకారంతో ప్రవాసీయులు విదేశాలలోని తమ ఉద్యోగ, వ్యాపారాలను వదులుకొని స్వస్థలాలకు వచ్చి పంచాయతీ ఎన్నికలలో తలపడుతున్నారు. పెరిగిన సాంకేతిక విజ్ఞానంతో పల్లెలు దగ్గర కావడంతో విదేశాలలో ఉంటున్నా గ్రామాలతో మమేకమైన ప్రవాసీయులు నేరుగా ప్రత్యక్ష ఎన్నికలలో పాల్గొంటున్నారు.

దుబాయిలో పని చేసే రాజన్న సిరిసిల్లా జిల్లా చందుర్రి మండలం బండపల్లి గ్రామానికి చెందిన గడ్డం శ్రీనివాస రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా తన ఉద్యోగానికి రాజీనామా చేసి గ్రామానికి వెళ్ళి వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేసి ప్రస్తుతం సర్పంచ్ అభ్యర్థిగా గట్టి పోటీని ఇస్తున్నారు. సౌదీ అరేబియాలో చమురు రంగంలో ఆకర్షణీయమైన ఉద్యోగాన్ని వదులుకుని స్వదేశానికి వెళ్ళిన ఎనుగల లచ్చయ్య తన స్వగ్రామం జగిత్యాల జిల్లా భీమారం మండలం మోత్కురావుపేటలో సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉండగా పొరుగున మేడిపల్లి మండలం దమ్మన్నపేట గ్రామంలో తోగరి రాజమణి రంగంలో ఉన్నారు. ఆమె భర్త లక్ష్మీపతి సౌదీలో ఉద్యోగం వదులుకొని వచ్చారు. సర్పంచ్ పదవి మహిళలకు రిజర్వు కావడంతో తన భార్యను రంగంలో దింపారు.


ఆర్మూర్ మండలం కొమనపల్లి గ్రామానికి చెందిన బండి రాజారామ్ గత పంచాయతీ ఎన్నికలలో స్వల్ప తేడాతో ఓటమి పాలై దుబాయికి వెళ్లి పని చేసుకుంటున్నారు. ఈసారి పోటీకి మళ్ళీ ఆసక్తి ప్రదర్శించినా ఆ స్థానం మహిళలకు రిజర్వు కావడంతో దుబాయిలోనే ఉండిపోయారు. ఒక దశలో తన భార్యతో నామినేషన్ దాఖలు చేయాలని భావించినా రాజారామ్ ఆ ఆలోచనను విరమించుకున్నారు. ఖతర్‌లో పని చేసిన జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం సిరికొండ గ్రామానికి చెందిన పంచిత ధర్మరాజు యాదవ్ సర్పంచ్ పదవి ముద్దంటున్నారు. కొద్ది కాలం క్రితం స్వదేశానికి వెళ్ళిన ఆయన సర్పంచ్‌‌గా ఎన్నిక కావడానికి వ్యూహాత్మకంగా కసరత్తు చేసుకుని రంగంలో దిగారు.

అమెరికాలోని జార్జియాలో వ్యాపారం చేసుకునే ఆర్మూర్ మండలం అంకపూర్ గ్రామానికి చెందిన గడ్డం రమేశ్ రెడ్డి అమెరికా నుండి వచ్చి నామినేషన్ దాఖలు చేయగా ఓటరు జాబితాలో పేరు లేదని తిరస్కరించారు. ఇదే మండలంలోని పచ్చలనడకుడ గ్రామానికి చెందిన కోల నర్సయ్య ఇజ్రాయిల్ నుండి వచ్చి పోటీ చేస్తున్నారు. గతంలో కూడా ఆయనకు పోటీ చేసిన అనుభవం ఉంది. ఇదే మండలంలోని పిప్రి గ్రామానికి చెందిన ఎన్న రమేశ్ కూడా ఇజ్రాయెల్‌లో పని చేసి వచ్చి పోటీకి సిద్ధమైనప్పటికీ చివరి నిమిషంలో ఆలోచనను విరమించుకుని ఇతరులను బలపరుస్తున్నారు.

అమెరికాలో ఉద్యోగం కాదని గ్రామ సేవ ముఖ్యమంటున్నారు మెదక్ జిల్లా చిన్నశంకరం పేట మండల కేంద్రానికి చెందిన కంజర్ల చంద్రశేఖర్. అమెరికా కంటే తనకు తన గ్రామం ముఖ్యమని ఆయన అంటున్నారు.


దుబాయి నుండి కొద్ది కాలం క్రితం తిరిగి వచ్చిన రేవతి గంగాధర్, సౌదీ అరేబియాలో గడిపి వచ్చిన రాధారపు సతీష్‌లు ఇద్దరూ కూడా నిజామాబాద్ జిల్లా కమ్మరపల్లి మండలం హాసకొత్తూరు గ్రామ సర్పంచ్‌ సీటు కోసం తలపడుతున్నారు.

రాజకీయాలకు అతీతంగా గ్రామీణాభివృద్ధే ధ్యేయంగా పని చేసే యువకుల పక్షాన తాను పంచాయతీ ఎన్నికలలో ప్రచారం చేస్తున్నట్లుగా బహ్రెయిన్‌లో పని చేసే సామాజిక సేవకుడు కోటగిరి నవీన్ అన్నారు. నిజామాబాద్ జిల్లా కమ్మరపల్లి మండలం హాసకొత్తూరుకు చెందిన నవీన్ ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం కోసం స్వదేశంలో గడుపుతున్నారు.

గత పంచాయతీ ఎన్నికలలో గల్ఫ్ దేశాల నుండి తిరిగి వచ్చిన వారిలో 50 మంది సర్పంచ్‌లుగా, మరో 500 మంది వార్డు సభ్యులుగా ఎన్నికయినట్లు ఒక అంచనా అని ప్రవాస భారతీయుల వ్యవహారాల విశ్లేషకులు మంద భీం రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

సుందర్ పిచాయ్‌తో ఏపీలో టెక్ పెట్టుబడులపై మంత్రి లోకేశ్ చర్చ

పెట్టుబడులపై స్పెషల్ ఫోకస్.. అమెరికాలో లోకేశ్ విస్తృత పర్యటన

Read Latest and NRI News

Updated Date - Dec 10 , 2025 | 10:51 PM