Indian Student: యూఎస్ ఎయిర్‌పోర్టులో షాకింగ్ దృశ్యం.. ఎన్నారై విద్యార్థికి బేడీలు వేసి దారుణంగా..
ABN , Publish Date - Jun 09 , 2025 | 06:08 PM
అమెరికా ఎయిర్‌పోర్టులో ఓ భారతీయ విద్యార్థినిని చేతులకు బేడీలు వేసి బలవంతంగా స్వదేశానికి తరలిస్తున్న దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలోని నెవార్క్ ఎయిర్‌పోర్టులో భద్రతా సిబ్బంది ఓ భారతీయ విద్యార్థిని నేలపై అదిమిపెట్టి చేతులకు బేడీలు వేసి అమానవీయంగా ప్రవర్తించిన ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది. కునాల్ జైన్ అనే ఎన్నారై ఈ ఘటన తాలూకు వీడియోను నెట్టింట షేర్ చేశారు. ఇది ప్రస్తుతం సంచలనంగా మారింది. సదరు విద్యార్థిని భారత్‌కు డిపోర్టు చేసినట్టు తెలుస్తోంది.
‘గత రాత్రి ఓ భారతీయ విద్యార్థికి ఓ క్రిమినల్‌లా చేతులకు బేడీలు వేసి తరలించడం చూశా. ఎన్నో కలలతో అతడు అమెరికాకు వచ్చి ఉంటాడు. ఎవరికీ హాని తలపెట్టాలనే ఉద్దేశం అతడికి ఉండకపోవచ్చు. ఓ ఎన్నారైగా నన్ను ఆ దృశ్యం ఎంతో కలచివేసింది. నిస్సహాయంగా అలా చూస్తుండిపోయాను’ అని కునాల్ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. సదరు భారతీయ విద్యార్థి హర్యాన్వీలో మాట్లాడుతున్నట్టు చెప్పారు. తనకు ఎలాంటి మతిస్థిమితం లేదని చెప్పే ప్రయత్నం చేశాడని అన్నారు. కానీ అధికారులు మాత్రం అతడిని మతి తప్పిన వాడిగా చూపించే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపించిందన్నారు.
‘ఈ యువత వీసా వచ్చాక విమానం ఎక్కి మరుసటి రోజు ఉదయాని కల్లా అమెరికాలో దిగుతున్నారు. కానీ ఇక్కడకు తాము ఎందుకు వచ్చామనేది మాత్రం అధికారులకు సరిగా వివరించ లేకపోతున్నారు. ఇలా ఎందుకో అర్థం కావట్లేదు. దీంతో, సాయంత్రానికల్లా వారిని అధికారులు క్రిమినిల్స్‌లా చేతులకు బేడీలు వేసి మరో విమానంలో స్వదేశానికి పంపిస్తున్నారు. రోజుకు ఇలాంటివి మూడు నాలుగు ఘటనలు జరుగుతున్నాయి. గత కొద్ది రోజులుగా మరింత ఎక్కువయ్యాయి’ అని ఆయన తెలిపారు. బాధిత విద్యార్థి విషయంలో భారత ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కూడా విజ్ఞప్తి చేశారు.
అంతర్జాతీయ విద్యార్థుల రాకను కట్టడి చేసేందుకు అమెరికా ప్రభుత్వం రకరకాల చర్యలు చేపడుతోంది. స్వల్ప కారణాలకే వీసాలను రద్దు చేసి స్టూడెంట్స్‌ను తమ సొంత దేశాలకు డిపోర్టు చేస్తోంది. పాలస్తీనా అనుకూల నిరసనలు మొదలు ట్రాఫిక్ ఉల్లంఘనలకు ఏ పొరపాటుకు పాల్పడినా కూడా మరో ఆలోచన లేకుండా డిపోర్టు చేస్తోంది. దీంతో, విద్యార్థుల్లో సందిగ్ధత, ఆందోళన విపరీతంగా పెరుగుతోంది.
ఇవి కూడా చదవండి
లాస్ఏంజెల్స్‌లో ఘనంగా మినీ మహానాడు
సిలికానాంధ్ర సంస్థ మరో సరికొత్త రికార్డు
Read Latest NRI News And Telugu News