Indian Doc Jailed in US: ఇన్సూరెన్స్ డబ్బుల కోసం కక్కుర్తి.. అమెరికాలో భారత సంతతి డాక్టర్‌కు 14 ఏళ్ల జైలు శిక్ష
ABN , Publish Date - Sep 26 , 2025 | 07:14 AM
రోగులకు అవసరం లేని నొప్పి నివారణ మందులు, సెడెటివ్స్ రాసిచ్చి ఇన్సూరెన్స్ డబ్బులు దండుకున్న భారత సంతతి డాక్టర్ నీల్ ఆనంద్‌కు అమెరికా కోర్టు తాజాగా 14 ఏళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: ఇన్సూరెన్స్ డబ్బుల కోసం మోసాలకు పాల్పడిన కేసులో ఓ భారత సంతతి డాక్టర్‌కు అమెరికా కోర్టు ఏకంగా 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది. రోగులకు అవసరం లేని మందులు రాసిచ్చిన పెన్సిల్వేనియా డాక్టర్ నీల్ కే ఆనంద్ అక్రమంగా లాభపడ్డారని తెలిపింది. ఇన్సూరెన్స్ కంపెనీలకు 2 మిలియన్ డాలర్లు, అక్రమంగా ఆర్జించిన మరో 2 మిలియన్ డాలర్ల సొమ్మును ప్రభుత్వానికి తిరిగి చెల్లించాలని ఆదేశించింది (Dr. Neil K. Anand sentencing).
2019లో నీల్‌పై కేసు నమోదైంది. ఇటీవలే ఆయనను కోర్టు దోషిగా తేల్చింది. తాజాగా శిక్ష ఖరారు చేసింది. రోగుల వేదనను తనకు లాభంగా నీల్ మార్చుకున్నారని న్యాయమూర్తి ఈ సందర్భంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే, రోగుల బాధను సహృదయంతో అర్థం చేసుకుని స్పందించిన తనను అన్యాయంగా దోషిని చేశారని నీల్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను అమెరికా నేవీలో పని చేశానని, 9-11 బాధితులకు వైద్యం అందించానని కూడా నీల్ పేర్కొన్నారు (medication fraud case).
మీడియా కథనాల ప్రకారం, రోగులకు అవసరం లేని సెడెటివ్స్, నొప్పి నివారణ మందులను నీల్ రాసిచ్చి ఇన్సూరెన్స్ డబ్బులను దండుకునేవారు. ఇందుకోసం తన సంతకం ఉన్న ఖాళీ ప్రిస్కిప్షన్ కాగితాలను ట్రెయినీలకు ఇచ్చి రోగులకు మందులు రాసివ్వమనే వారు. ఒక సందర్భంలో కేవలం తొమ్మిది మంది పేషెంట్లకు ఏకంగా 20 వేల ఆక్సీకోడోన్ టాబ్లెట్స్ రాసిచ్చిన విషయం వెలుగులోకి వచ్చింది. తన డిస్పెన్సరీ ద్వారా ఈ మందులను విక్రయించారు. ఈ అవకతవకలపై విచారణ ప్రారంభమైందని తెలియగానే డా.నీల్ తన వద్ద ఉన్న డబ్బును ఓ బంధువు అకౌంట్‌కు, మరో మైనర్ బ్యాంకు అకౌంట్‌కు బదిలీ చేశారు (unnecessary prescription scandal).
అయితే, కృత్రిమ మేధ సాంకేతికతను ప్రభుత్వం తనపై ఆయుధంగా వాడుకుందని డా. నీల్ ఆరోపించారు. ఏఐ సాయంతో డాటాలో మార్పులు చేసి దోషిగా నిలబెట్టిందని అన్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి సాంత్వన కలిగించేందుకు తాను ప్రయత్నించానని ఆయన గతంలో తన బ్లాగులో రాసుకొచ్చారు. అయితే, న్యాయమూర్తి మాత్రం ఈ వాదనలను తోసి పుచ్చారు. రోగుల వేదన డా.నీల్‌కు ఆదాయంగా మారిందని మండిపడుతూ జైలు శిక్షను ఖరారు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
అమెరికాలో ఏపీ సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమి ఛైర్మన్ రవి మందలపునకు ఘన సన్మానం
సౌదీ అరేబియాలో పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవ సభ
For More NRI News And Telugu News