India Pakistan Tensions Disrupt Flights: పాకిస్తాన్‌కు విమానాలను రద్దు చేసిన గల్ఫ్ ఎయిర్‌లైన్స్
ABN , Publish Date - May 08 , 2025 | 03:46 PM
భారత్, పాక్ ఉద్రిక్తతలు విమానయానానికి పలు అంతరాయాలు కలిగిస్తోంది. మొత్తం 600 ఫ్లైట్ జర్నీలకు అంతరాయం ఏర్పడింది. అమెరికా, ఐరోపా నుంచి భారత్ వచ్చే భారతీయ విమానాలపై కూడా ప్రభావం పడుతోంది.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగా ఒక్క రోజులో ఇరు దేశాలలో మొత్తం 600 విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. పాకిస్థాన్ తన గగనతలంపై ఆంక్షలు విధించడంతో పాటు రాజధాని ఇస్లామాబాద్‌తో పాటు దేశ వ్యాప్తంగా విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేయడంతో గల్ఫ్‌తో పాటు అమెరికా, ఐరోపా దేశాల నుండి భారత్‌కు వచ్చే విమానాలను అరేబియా సముద్రం మీదుగా మళ్ళిస్తున్నారు. దీంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. భారత్ కూడా పాకిస్థాన్ మీదుగా వెళ్ళే 25 అంతర్జాతీయ విమానాల రూట్లను మూసివేసింది.
భారత్- పాకిస్థాన్ ఉద్రిక్తతల కారణంగా ఎమిరేట్స్‌తో సహా గల్ఫ్ దేశాల విమానయాన సంస్థలన్నీ కూడా పాకిస్థాన్‌కు విమానాలను రద్దు చేశాయి. పాకిస్థాన్‌కు బయలుదేరిన మూడు ఎతిహాద్ విమానాలను బుధవారం తెల్లవారుజామున వెనక్కు మళ్లగా సౌదీ అరేబియాతో పాటు ఇతర ఎయిర్‌లైన్స్ విమానాలను మళ్ళించినట్లుగా ఆయా సంస్థలు ప్రకటించాయి.
పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా, లాహోర్ నగర విమానాశ్రయాన్ని పాక్షికంగా మూసివేశారు. భారత్ దాడికి దిగిన రాత్రి వేళలలో పాక్ గగనతలంలో 52 అంతర్జాతీయ విమానాలు ఉండగా విదేశీ విమానాలపై ఆంక్షలు విధించి ముందస్తు అనుమతి తీసుకోవాలని పాక్ సూచించింది. దీంతో గల్ఫ్‌తో పాటు అమెరికా, ఐరోపా ఇతర విదేశీ ఎయిర్ లైన్స్‌ల విమానాలు పాకిస్థాన్ గగనతలం మీదుగా భారత్‌కు రావడానికి జాప్యం జరుగుతోంది.
పాకిస్థాన్ మీదుగా వెళ్ళే 25 అంతర్జాతీయ విమానాల రూట్లను రద్దు చేయడంతో పాటు సరిహద్దులో అమృత్‌సర్‌తో సహా మొత్తం 18 విమానాశ్రయాలను కూడా భారత్ ముందు జాగ్రత్త చర్యగా మూసివేసింది.
ఇవి కూడా చదవండి:
ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవానికి సౌదీ పిలుస్తోంది రా.. కదలి రా
SATA: సాటా రియాధ్ అధ్యక్షురాలిగా చేతన నియామకం
బహ్రెయిన్‌లో ఘనంగా చంద్రబాబు 75వ జన్మదిన వేడుకలు