Germany Tightens Visa Rules: జర్మనీ కీలక నిర్ణయం.. ఇక వలసలు మరింత కఠినతరం
ABN , Publish Date - May 22 , 2025 | 10:08 PM
జులై 1 నుంచి రిమాన్‌స్ట్రేషన్ విధానానికి స్వస్తి పలకనున్నట్టు జర్మనీ ఫెడరల్ ఫారీన్ ఆఫీసు ఓ ప్రకటనలో తెలియజేసింది.
ఇంటర్నెట్ డెస్క్: దేశంలోకి వలసలను తగ్గించేందుకు జర్మనీ కీలక నిర్ణయం తీసుకుంది. విసా తిరస్కరణలపై అప్పీళ్లను పరిశీలించే రిమోన్‌స్ట్రేషన్ విధానానికి జులై 1 నుంచి స్వస్తి పలకనుంది. ఈ మేరకు ఫెడరల్ ఫారిన్ ఆఫీసు ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో, జర్మనీ వెళ్లాలనుకుంటున్న విదేశీ వృత్తినిపుణులందరిపైనా ఈ నిర్ణయం ప్రతికూల ప్రభావం చూపనుంది.
ప్రస్తుత నిబంధన ప్రకారం, తమ వీసా దరఖాస్తు తిరస్కరణకు గురైన సందర్భంలో దరఖాస్తుదారులు తమ దేశాల్లోని ఎంబసీలు, కాన్సులేట్ కార్యాలయాల్లో పునఃపరిశీలన కోసం అర్జీ పెట్టుకునే అవకాశం ఉంది. తిరస్కరణ సబబు కాదంటూ అదనపు డాక్యుమెంట్లు, వివరణలు ఇచ్చి వీసా పొందే అవకాశం ఉండేది. వీసా దరఖాస్తు తిరస్కరణపై కోర్టుకెక్కాల్సిన అవసరం లేకుండానే సమస్యను ఎంబసీ స్థాయిలో పరిష్కరించుకునే సౌలభ్యం విదేశీయులకు అమితంగా ఉపయోగపడేది. సమస్యలు త్వరగా పరిష్కారమయ్యేవి. జర్మనీ ప్రభుత్వ తాజా నిర్ణయంతో విదేశీయులకు వీసా ఇక్కట్లు మరింత పెరిగాయి.
ఇకపై విదేశీయులు తమ వీసా దరఖాస్తు తిరస్కరణకు గురయతే కొత్తగా దరఖాస్తు చేసుకోవడం లేదా జర్మనీ కోర్టులో అప్పీలు చేసుకోవడం మినహా మరో మార్గం లేదు. జర్మనీ కోర్టుల్లో అప్పీలు కోసం అక్కడి లాయర్లనే నియమించుకోవాల్సి ఉంటుంది. ఇదంతా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఇక కేసు కొలిక్కి వచ్చేసరికి రెండేళ్లపైగా పట్టే అవకాశం ఉంది. దీంతో, జర్మనీ వీసా లభించడం మరింత కష్టతరం కానుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
రిమాన్‌స్ట్రేషన్ విధానం తొలగింపుతో వీసా జారీ మరింత వేగవంతమవుతుందని జర్మనీ ప్రభుత్వం పేర్కొంది. దరఖాస్తుల పెండింగ్ సమయం కూడా తగ్గుతుందని వెల్లడించింది. పునఃపరిశీలన లేకపోవడంతో ఎంబసీ కార్యాలయాలకు కూడా కొత్త దరఖాస్తులపై దృష్టి పెట్టే అవకాశం చిక్కుతుందని ఫెడరల్ ఫారిన్ ఆఫీసు పేర్కొంది.
జర్మనీ వీసా కోసం అత్యధికంగా దరఖాస్తు చేసే వారిలో భారతీయులు కూడా ఉన్నారు. దీంతో, ఈ ప్రభావం భారతీయులపై అధికంగానే ఉండనుంది. ఇకపై దరఖాస్తు సమర్పించే విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వీసా దరఖాస్తుదార్ల సహాయార్థం జర్మనీ ప్రభుత్వం డిజిటల్ కాన్సులార్ సర్వీస్ పోర్టల్‌ను కూడా ప్రారంభించింది. డాక్యుమెంటేషన్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి లబ్ధిదారులు ఈ పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చు.
ఇవీ చదవండి:
హెచ్-1బీ వీసాలపై భారతీయ అమెరికన్ షాకింగ్ పోస్టు.. జనాల గగ్గోలు
అమెరికా కీలక నిర్ణయం.. నిబంధనలు ఉల్లంఘించిన భారతీయ ట్రావెల్ ఏజెంట్లపై ఆంక్షలు
భారత సంతతికి చెందిన టెక్కీ హత్య..అసలేమైంది, ఎందుకు జరిగిందంటే