Share News

Animal Rescue: నిబద్ధతతో సంరక్షిస్తూ...

ABN , Publish Date - Feb 03 , 2025 | 04:56 AM

ఏడేళ్ళ క్రితం... ఒక వ్యక్తి ప్రాణాలను కాపాడి పురస్కారాలు అందుకున్న భర్గ్‌సేతు శర్మ... జంతు సంరక్షణ కోసం ప్రారంభించిన సంస్థ ఎన్నో మూగ జీవాలను ఆదుకొని, పునరావాసం కల్పిస్తోంది. వేలాదిమందికి స్ఫూర్తిగా నిలుస్తున్న 27 ఏళ్ళ గుజరాతీ యువతి జంతువుల హక్కుల కోసం తన గళాన్ని గట్టిగా వినిపిస్తున్నారు.

Animal Rescue: నిబద్ధతతో సంరక్షిస్తూ...

‘‘జంతువులన్నా, పక్షులన్నా నాకు ఎంతో ఇష్టం. ఈ ఇష్టం నాకు చిన్న వయసులోనే ప్రారంభమయింది. మాది గుజరాత్‌లోని వడోదర నగరం. సెలవులు వచ్చినప్పుడల్లా జంతు ప్రదర్శనశాలకు తీసుకువెళ్ళాలని అమ్మను, నాన్నను అడిగేదాన్ని. ఇంట్లో జంతువుల్ని పెంచాలనే కోరిక ఎంతగానో ఉండేది. కానీ మేము నివసించే హౌసింగ్‌ సొసైటీలో జంతువులను రానిచ్చేవారు కాదు. అప్పటికీ ఒక కుటుంబం వాళ్ళు కుక్క పిల్లల్ని పెంచుకొనేవారు. అవి బయటికి వచ్చి పరిసరాలను చెత్త చేస్తున్నాయనే ఆరోపణతో... వాటిని వీధుల్లో విసిరేసేవరకూ సొసైటీ కార్యవర్గం శాంతించలేదు. ‘‘ఈ భూమి మనందరిదీ. ఇక్కడ జీవించే హక్కు ప్రతి జీవికీ ఉంది’’ అని మా బడిలో మాకు చెప్పేవారు. దానికి విరుద్ధంగా జరిగిన ఈ సంఘటన నాకు చాలా ఆవేదన కలిగించింది. తమ బాధ చెప్పుకోలేని మూగ ప్రాణులను కాపాడడం కోసం... 2013లో ‘హ్యూమన్స్‌ విత్‌ హ్యుమానిటీ’ అనే సంస్థను ఎనిమిదిమంది మిత్రులతో కలిసి ప్రారంభించాను. వీధులపాలైన జంతువులకు ఆశ్రయం కల్పించడం, గాయపడినవాటికి చికిత్స చేయించడంలాంటి కార్యక్రమాలు చేసేవాళ్ళం. నిస్సహాయమైన జంతువులు, పక్షులు ఎవరికైనా కనిపిస్తే మా నెంబర్‌ను సంప్రతించేవారు. అయితే ఒక సంఘటనతో నా పేరుతో పాటు మా సంస్థ పేరు కూడా చాలామందికి పరిచయం అయింది.


ఎందరో అభినందించారు...

నేను, మరికొందరు ఎన్సీసీ క్యాడెట్లు.. రాసల్పూర్‌లోని మహీసాగర్‌ ప్రాంతానికి విహారయాత్ర కోసం వెళ్ళాం. అక్కడ నదిలో ఈతకు వెళ్ళిన ఇద్దరు యువకులు నీటిలో మునిగిపోయారు. వారిలో ఒకరిని స్థానికులు బయటకు తీశారు. మరో వ్యక్తి జాడ కనిపించలేదు. ఈ సంగతి తెలియగానే నేను ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా నదిలోకి దూకాను. సుమారు 12 నిమిషాల పాటు ఈదిన తరువాత... నదీ గర్భంలో కదలకుండా పడి ఉన్న ఆ వ్యక్తిని చూశాను. అతనికి స్పృహ లేదు. అతన్ని వీపు మీద మోసుకుంటూ బయటకు తీసుకువచ్చాను. వెంటనే అతనికి ప్రథమ చికిత్స చేసి, ఆసుపత్రికి తీసుకువెళ్ళాం. అతని ప్రాణాలకు ప్రమాదం లేదని వైద్యులు చెప్పాక... ఊరటగా అనిపించింది. ఒక మనిషి ప్రాణాలు కాపాడినందుకు నాకు ‘గవర్నర్‌ పతకం’, ఎన్సీసీ క్యాడెట్లకు ఇచ్చే ‘రక్షామంత్రి ప్రశస్తి’ పురస్కారం లభించాయి. ఈ సంఘటన గురించి మీడియాలో వచ్చాక... నా గురించి చాలామందికి తెలిసింది. మా సంస్థ గురించి ఆరా తీశారు. పలువురు జంతు ప్రేమికులు ‘హ్యూమన్స్‌ విత్‌ హ్యుమానిటీ’లో సభ్యులయ్యారు. అయితే నాకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది మాత్రం... 2019లో ‘ఎంటీవీ- రోడీస్‌ రియల్‌ హీరోస్‌’ కార్యక్రమంలో పాల్గొన్న తరువాత. ఆ ప్రోగ్రామ్‌లో నా కథ వినిపించాను. జంతువుల హక్కుల గురించి మాట్లాడాను. మన దేశం నుంచే కాదు, విదేశాల నుంచి కూడా ఎందరో అభినందించారు. ఇది నాకు మరింత ఉత్సాహం కలిగించింది.


అది మన కనీస బాధ్యత

జువాలజీలో డిగ్రీ పూర్తి చేసిన తరువాత... మా సంస్థ కార్యకలాపాల్లో పూర్తిగా నిమగ్నమయ్యాను. ఎన్నో సదస్సుల్లో, చర్చావేదికల్లో పాల్గొన్నాను. ప్రస్తుతం మా నెట్‌వర్క్‌లో మూడువేల మందికి పైగా జంతు ప్రేమికులు... దేశంలోని అన్ని ప్రాంతాల్లో జంతు సంరక్షణ కోసం పని చేస్తున్నారు. ఎనిమిదిమందితో ఆరంభమైన మా వాలంటీర్ల బృందంలో ప్రస్తుతం ఎనభై మందికి పైగా ఉన్నారు. ఎప్పటికప్పుడు ఔత్సాహికులు ఎందరో మాతో చేతులు కలుపుతున్నారు.. ఇప్పటివరకూ అయిదువేలకు పైగా జంతువులను మా సంస్థ రక్షించి, వాటికి పునరావాసాన్ని కల్పించింది. వీటిలో కుక్కలు, పిల్లులు, కోతుల్లాంటి జంతువులు, ఎన్నో పక్షి జాతులు ఉన్నాయి. ఒకసారి ఒక కుక్క బావిలో పడితే... తాళ్ళు కట్టుకొని, ఆ బావిలోకి దిగి దాన్ని కాపాడాను. ఇలాంటి ఉదంతాలు ఎన్నో ఎదురవుతూ ఉంటాయి. ఒక ప్రాణాన్ని కాపాడాననే సంతృప్తి ముందు ఏదీ రిస్క్‌ అనిపించదు. మమ్మల్ని మేము జంతు సంక్షేమ కార్యకర్తలుగా పిలుచుకోం, ‘మానవతావాదులం’ అనే చెప్పుకుంటాం. అన్ని జీవులనూ మనం గౌరవించాలి. వాటి పట్ల సానుభూతి చూపించడం, వాటికి ఏదైనా హాని జరిగినప్పుడు కాపాడడం మన కనీస బాధ్యతగా భావించాలి. అంకితభావం, నిబద్ధత, తోటి జీవుల పట్ల ఆపేక్ష ఉన్నప్పుడు.. మనం ఒంటరిగా చేసే ప్రయత్నమైనా ఎంతో కొంత మార్పును తీసుకువస్తుంది. అలాంటి మార్పుకు దోహదపడాలనే ఆలోచనను ప్రజల్లో ప్రేరేపించడమే నా ఆశయం.’’


ఇవి కూడా చదవండి..

Sonia Gandhi: సోనియా గాంధీపై కోర్టులో ఫిర్యాదు చేసిన న్యాయవాది.. ఎందుకంటే..

Maha Kumbh Mela 2025: మహా కుంభమేళాకు భక్తజనం.. ఫిబ్రవరి 1 నాటికి ఎంత మంది వచ్చారంటే..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 03 , 2025 | 04:56 AM