Yogurt and Longevity: పెరుగుతో దీర్ఘాయుష్షు
ABN , Publish Date - Dec 23 , 2025 | 01:47 AM
ప్రపంచంలో అతి పెద్ద వయస్కురాలైన 117 ఏళ్ల ‘మారియా బ్రాన్యాస్ మొరేరా’ దీర్ఘాయుష్షు రహస్యమేంటి? ఈ స్పానిష్ బామ్మగారి ఆరోగ్య రహస్యాన్ని ఛేదించడం కోసం ఆమె ఆరోగ్యాన్నీ, అలవాట్లనూ...
ఇదీ విషయం
ప్రపంచంలో అతి పెద్ద వయస్కురాలైన 117 ఏళ్ల ‘మారియా బ్రాన్యాస్ మొరేరా’ దీర్ఘాయుష్షు రహస్యమేంటి? ఈ స్పానిష్ బామ్మగారి ఆరోగ్య రహస్యాన్ని ఛేదించడం కోసం ఆమె ఆరోగ్యాన్నీ, అలవాట్లనూ అధ్యయనం చేసిన పరిశోధకులకు నివ్వెరపోయే ఒక వాస్తవం తెలిసింది.
మెడిటరేనియన్ ఆహారశైలిని అనుసరించడం, దృఢమైన జన్యువులను కలిగి ఉండడంతో పాటు మూడు పూటలా పెరుగు తినే అలవాటు మారియా నిండైన ఆరోగ్యానికి దోహదపడినట్టు తాజాగా పరిశోధకులు కనిపెట్టారు. ఆమెను అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలకు ఆమె పేగుల్లో బైఫైడోబ్యాక్టిరియం అనే బ్యాక్టీరియా ఎక్కువ స్థాయిలో కనిపించింది. సాధారణంగా ఇన్‌ఫ్లమేషన్‌ను అదుపులో ఉంచడంతో పాటు జీర్ణశక్తిని, రోగనిరోధకశక్తినీ మెరుగుపరిచే ఈ బ్యాక్టీరియా పైబడే వయసుతో పాటు క్షీణిస్తుంది. అయితే పెరుగుతో ఈ సూక్ష్మక్రిములు వృద్ధి చెందుతూ ఉంటాయి. కాబట్టి మూడు పూటలా పెరుగు తినే అలవాటు వల్లే ఈ మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతూ బామ్మగారి ఆరోగ్యానికి తోడ్పడినట్టు పరిశోధకులు భావిస్తున్నారు. అలాగని పెరుగుతోనే దీర్ఘాయుష్షు సాధ్యపడుతుందని అనుకోవడం పొరపాటనీ, సమతులాహారం తీసుకోవడంతో పాటు, శరీరాన్ని చురుగ్గా ఉంచుకోవడం, సన్నిహితులు, కుటుంబ సభ్యులతో సరదా సమయాలను గడపడం, ధూమపానం, మద్యపానాలకు దూరంగా ఉండడం లాంటివి కూడా తోడైనప్పుడే ఆయుష్షు పెరుగుతుందని పరిశోధకులు సూచిస్తున్నారు. పెరుగుతో ఆరోగ్యాన్ని పెంచుకోవాలనుకునేవారు పెరుగుకు అదనపు చక్కెరలకు బదులుగా భోజనంతో కలిపి లేదా పండ్లు, నట్స్‌తో కలిపి తీసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ వ్యక్తిత్వ హక్కుల పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు
ఇస్రో నుంచి మరో రాకెట్ ప్రయోగం.. ముహూర్తం ఫిక్స్
Read Latest Telangana News And Telugu News