Yamini The Rising Star of Kuchipudi Dance: నాట్యంలో నవ కెరటం
ABN , Publish Date - Nov 20 , 2025 | 05:47 AM
వయసు చిన్నదే. కానీ వందకు పైగా ప్రదర్శనలు... ప్రముఖుల ప్రశంసలు. ఆహూతులను కట్టిపడేసే అభినయం... కూచిపూడి నృత్యంలో నవ కెరటం... బడిగింజల వెంకటయామిని. ‘తెలుగు నేలపై పుట్టిన నాట్య కళను విశ్వవ్యాప్తం...
అభినయం
వయసు చిన్నదే. కానీ వందకు పైగా ప్రదర్శనలు... ప్రముఖుల ప్రశంసలు. ఆహూతులను కట్టిపడేసే అభినయం... కూచిపూడి నృత్యంలో నవ కెరటం... బడిగింజల వెంకటయామిని. ‘తెలుగు నేలపై పుట్టిన నాట్య కళను విశ్వవ్యాప్తం చేయాలనే దృఢ సంకల్పంతో అడుగులు వేస్తున్నా’ అని అంటున్న యామినితో ‘నవ్య’ ముచ్చట్లు.
అద్భుతమైన నర్తనంతో సభికులను కట్టిపడేస్తున్న కూచిపూడి కళాకారిణి యామిని. ఆ నాట్యంలో తనదైన ముద్ర వేయాలని తపిస్తోంది. కడప జిల్లా ప్రొద్దుటూరులోని దొరసానిపల్లెకు చెందిన బడిగింజల వెంకటమనోహర్, శ్రీలక్ష్మి దంపతుల పెద్ద కుమార్తె యామిని. చిన్నప్పటి నుంచి ఆమెకు డ్యాన్స్‌పై ఎంతో మక్కువ. దాన్ని గమనించిన తల్లిదండ్రులు... ఆమెకు సరైన శిక్షణ ఇప్పించాలని అనుకున్నారు. అయితే ‘ఆడపిల్లకు డ్యాన్స్‌లు నేర్పి బయటకు పంపడం ఏంటని’ బంధువులు కొందరు ఆక్షేపించారు. కానీ ఆమె తల్లిదండ్రులు వాటిని పట్టించుకోలేదు. ఏడేళ్ల వయసులో స్థానిక ‘నటరాజ కళాక్షే త్రం’లో చేర్చారు. గురువు పఠాన్ మొహిద్దీన్ వద్ద కూచిపూడి శిక్షణ ప్రారంభించిన యామిని... తక్కువ సమయంలోనే నాట్యంపై పట్టు సంపాదించింది. గురువు సమక్షంలో మెరుగులు అద్దుకుంది. అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రదర్శనలు ఇచ్చే స్థాయికి చేరుకుంది.
వేదిక ఏదైనా...
ప్రొద్దుటూరులోని ‘శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల’లో బీకాం రెండో సంవత్సరం చదువుతున్న యామిని... చిన్నప్పుడే పలు నాట్య పోటీల్లో పాల్గొంది. స్థానికంగానే కాదు... రాష్ట్రంలో ఎక్కడ ఏ సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించినా... అందులో ఆమె ప్రదర్శన ఉండాల్సిందే. లయబద్దమైన తన నాట్యాభినయంతో ఆహూతులను అంతలా ఆకట్టుకుంటోంది. ఎందరో అభిమానులను సంపాదించుకుంది.
ప్రశంసలు... పురస్కారాలు...
పదేళ్ల కూచిపూడి నాట్య ప్రస్థానంలో యామిని వందకు పైగా ప్రదర్శనలు ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రల్లో కూడా కూచిపూడి వైభవాన్ని చాటింది. పలువురు ముఖ్యమంత్రులు, రాజకీయ రంగ ప్రముఖులు, ప్రసిద్ధ కళాకారుల సమక్షంలో నర్తించి, ప్రశంసలు అందుకుంది. అత్యద్భుతమైన ప్రతిభకు గానూ ఇప్పటికి యాభైకి పైగా అవార్డులు ఆమెను వరించాయి. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఇటీవల వైఎస్సార్ కడప జిల్లాలో నిర్వహించిన కార్యక్రమంలోనూ, యూత్ ఫెస్టివల్‌లోనూ ఆమె ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బహుమతులు గెలుచుకుంది. అరుణాచలం తదితర ప్రముఖ దేవాలయాల్లోనే కాకుండా, హైదరాబాద్‌లోని రవీంద్రభారతి వంటి ప్రతిష్ఠాత్మక సాంస్కృతిక వేదికలపై తన నర్తనతో కళాభిమానులను అలరించింది. దూరదర్శన్ నిర్వహించిన ఆడిషన్స్‌లో ఎంపికైన యామిని... నాట్యమే శ్వాసగా జీవిస్తోంది.
ఎస్.రవికుమార్
ప్రొద్దుటూరు
గురువుగా స్థిరపడాలని
కూచిపూడిని విశ్వవ్యాప్తం చేసి, మరింత ఆదరణ కల్పించాలనేది నా ఆకాంక్ష. అంతేకాదు... నాట్యంలో గిన్నిస్ రికార్డు నెలకొల్పాలనేది నా లక్ష్యం. పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో కూచిపూడి డిప్లమా కోర్సు పూర్తి చేశాను. డిగ్రీ తరువాత పీజీ చేయాలని అనుకొంటున్నాను. భవిష్యత్తులో నాట్య గురువుగా స్థిరపడాలనేది నా కోరిక. ఉన్నత చదువులు చదివితే మంచి ఉద్యోగాలు వస్తాయి... నిజమే. కానీ కూచిపూడి లాంటి సంప్రదాయ కళల్లో రాణిస్తే సమాజంలో ప్రత్యేక గుర్తింపు, గౌరవం దక్కుతాయి. నాట్యంవల్ల ఏకాగ్రత పెరుగుతుంది. మెదడు చురుగ్గా పని చేస్తుంది. ఒత్తిడి దూరం అవుతుంది. ఫలితంగా చదువులోనూ ముందుంటాము. నాట్యాన్ని కెరీర్‌గా ఎంచుకొనేవారికి మంచి ఉపాధి అవకాశాలు కూడా ఉన్నాయి. - యామిని
ఇవీ చదవండి:
హిడ్మా ఎన్‌కౌంటర్.. ప్రొ.హరగోపాల్ కీలక వ్యాఖ్యలు
అందుకే మారేడుమిల్లికి వచ్చిన మావోయిస్టులు.. జిల్లా ఎస్పీ