Share News

Padma awards 2025: వికసిత పద్మాలు

ABN , Publish Date - Jan 29 , 2025 | 01:30 AM

అంతరించిపోతున్న కళారూపానికి నవతరంలో ప్రాచుర్యం కల్పిస్తున్నవారు మరొకరు, మత్తుమందుల బారి నుంచి యువతను కాపాడడానికి పాటుపడుతున్న ఒక మహిళ, సంగీత రంగంలో ప్రయోగశీలి, గ్రామస్వరాజ్యం కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం పరితపిస్తున్న గాంధీయవాది..

Padma awards 2025: వికసిత పద్మాలు

నృత్యంలో కొత్త ధోరణులకు శ్రీకారం చుట్టినవారొకరు, అంతరించిపోతున్న కళారూపానికి నవతరంలో ప్రాచుర్యం కల్పిస్తున్నవారు మరొకరు, మత్తుమందుల బారి నుంచి యువతను కాపాడడానికి పాటుపడుతున్న ఒక మహిళ, సంగీత రంగంలో ప్రయోగశీలి, గ్రామస్వరాజ్యం కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం పరితపిస్తున్న గాంధీయవాది... ఈ ఏడాది పద్మ పురస్కారాలను అందుకోనున్న కొందరు విశిష్ట మహిళల పరిచయాలివి.

సంగీతమే సర్వస్వం

కామాక్షి ఓమనకుట్టి అమ్మకు గతం, వర్తమానం, భవిష్యత్తు... అన్నీ సంగీతమే. తండ్రి మలబార్‌ గోపాలన్‌ నాయర్‌ గొప్ప సంగీత విద్వాంసుడు. తల్లి, అన్న శాస్త్రీయ సంగీతంలో నిపుణులు. అదే బాటలో బాల్యం నుంచే సంగీతం అభ్యసించారు ఓమనకుట్టి. అయితే ఆమె ప్రభుత్వ ఉద్యోగి అయితే బాగుంటుందనుకున్నారు తల్లితండ్రులు. వారి మాటను గౌరవిస్తూ జువాలజీలో డిగ్రీ చేస్తూనే... తన అభిరుచికి అనుగుణంగా ‘గాన ప్రవీణ’ కోర్సులో చేరారు. రెండిటిలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించారు. వెంటనే ఆమెకు తిరువనంతపురం ప్రభుత్వ మహరాజా కాలేజీలో మ్యూజిక్‌ లెక్చరర్‌గా ఉద్యోగం వచ్చింది. ఆ తరువాత సంగీతంలో డిగ్రీ, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌, పిహెచ్‌డి చేశారు. ఉద్యోగ జీవితంలో అంచెలంచెలుగా ఎదిగి... కేరళ విశ్వవిద్యాలయంలో సంగీత విభాగాధిపతిగా వ్యవహరించారు. బోధన, పరిశోధన తనకు రెండు ప్రాణాలంటారు ఓమనకుట్టి. కొన్ని వందల పరిశోధన పత్రాలను ఆమె వెలువరించి, ఆ రంగానికి విలువైన సేవలు అందించారు. స్వాతి తిరునాళ్‌ కీర్తనలకు ప్రాచుర్యం కల్పించడానికి అపారమైన కృషి చేశారు. కేవలం స్వాతి తిరునాళ్‌ కృతులతో 300కు పైగా కచ్చేరీలను ప్రపంచవ్యాప్తంగా చేశారు. త్యాగరాజ పంచరత్న కృతుల తరహాలో... 2015లో 500 మంది విద్యార్థులతో తిరువనంతపురంలో ‘స్వాతి పంచరత’్న కీర్తనలతో ఒక కార్యక్రమం నిర్వహించారు. మానవులు, జంతువుల మనస్తత్వం మీద సంగీతం చూపే ప్రభావాన్ని తెలుసుకోవడానికి ఆమె తీవ్ర కృషి చేశారు.

nnnn.jpg

అందులో భాగంగా ‘సంగీత భారతి’ అనే సంస్థను స్థాపించి, మ్యూజిక్‌ థెరపీలో పరిశోధనలు చేపట్టారు. అలాగే ఆ సంస్థ ద్వారా వర్థమాన సంగీత కళాకారులకు సాధికారమైన సంగీత శిక్షణ కూడా అందజేశారు. మ్యూజిక్‌ థెరపీలో ఆమె చేస్తున్న ప్రయోగాలను గుర్తించిన తిరువనంతపురంలోని పంకజ కస్తూరి ఆయుర్వేదిక్‌ వైద్య కళాశాల’ అధికారులు... సంగీతం ద్వారా వైద్య చికిత్స అందించడంలో సహకరించడం కోసం తమ సంస్థలో ‘సీనియర్‌ మోస్ట్‌ ఫ్యాకల్టీ’గా ఓమనకుట్టిని నియమించారు. ప్రముఖ నేపథ్య గాయనులు కె.ఎస్‌. చిత్ర, బి.అరుంధతి తదితరులెందరో ఆమె శిష్యులు. ఆమె సోదరులు ఎం.జి.రాధాకృష్ణన్‌, ఎం.జి.శ్రీకుమార్‌ మలయాళంలో ప్రముఖ గాయకులు, సంగీత దర్శకులు. కేంద్ర ప్రభుత్వం తనకు పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించడంపై స్పందిస్తూ ‘‘ఈసారి పద్మశ్రీకి నన్ను పరిగణనలోకి తీసుకుంటారని ఆశించలేదు. ఎందుకంటే గతంలో నా పేరు నామినేట్‌ అయినా ఆ అవార్డు రాలేదు. ఇప్పుడు అందుకోబోతున్నందుకు సంతోషంగా ఉంది. ‘స్వాతి మ్యూజిక్‌ అవార్డ్‌’, ‘చెంబై అవార్డ్‌’ లాంటి అసంఖ్యాకమైన అవార్డులు నేను స్వీకరించాను. ఈ గౌరవం వాటన్నిటిలోనూ ప్రత్యేకంగా నిలుస్తుంది. సంగీత అభ్యాసాన్ని, బోధనను జీవితాంతం కొనసాగించాలనే నా కోరికను ఇది మరింత బలోపేతం చేసింది’’ అన్నారు ఓమనకుట్టి.


కథక్‌లో విప్లవ కెరటం

‘‘నృత్యం ఒక సజీవమైన కళారూపం. దానిలో నిరంతరం మార్పులు వస్తూనే ఉండాలి. అలాంటి మార్పులను మనం స్వాగతించాలి’’ అంటారు కుముదినీ రజనీకాంత్‌ లాఖియా. కథక్‌ నృత్యంలో ‘రెబల్‌’ అనే పేరు ఆమెకు ఉంది. ఈ సంగతి ఎవరైనా ప్రస్తావిస్తే ‘‘నేనెప్పుడూ సంప్రదాయాన్ని ఉల్లంఘించలేదు. అయితే ప్రజలను ఆకట్టుకోవడానికే పరిమితం కాకుండా సంప్రదాయ పరిధిలోనే మరింత కొత్తదనాన్ని వెతకడానికి ప్రయత్నిస్తూ ఉంటాను’’ అని చెబుతారామె. సమకాలీన కథక్‌ నృత్యానికి మార్గదర్శిగా ఖ్యాతిపొందిన 94 ఏళ్ళ కుముదిని 1930లో ముంబయిలో జన్మించారు. ఆమె తల్లి లీల శాస్త్రీయ గాయని. కుముదినిని ఏడేళ్ళ వయసులో కథక్‌ శిక్షణలో ఆమె తల్లి చేర్చారు. లాహోర్‌, అలహాబాద్‌, తదితర ప్రాంతాల్లో పలువురు గురువుల వద్ద కుముదిని నృత్యాన్ని అభ్యసిస్తూనే చదువు కొనసాగించారు. ఆ తరువాత నాటి ప్రసిద్ధ నర్తకుడు రామ్‌గోపాల్‌ బృందంతో కలిసి ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించారు. 1967లో ‘కదంబ్‌ నృత్య, సంగీత పాఠశాల’ను ఏర్పాటు చేసి వేలమందిని కళాకారులుగా తీర్చిదిద్దారు.

ghkm.jpg

అదితి మంగళ్‌ దాస్‌, సంధ్యా దేశాయ్‌, ఇషిరా పరీఖ్‌, వైష్ణవి త్రివేది తదితర ప్రముఖ కథక్‌ నర్తకులు ఆమె శిష్యులే. రజనీకాంత్‌ లేఖియాతో వివాహమయ్యాక... అహ్మదాబాద్‌లో కుముదిని స్థిరపడ్డారు. అక్కడే తన స్కూల్‌ కార్యకలాపాలను కొనసాగించారు. నృత్యనిర్దేశకురాలిగా అనేక వినూత్నమైన, సామాజికమైన అంశాలతో ప్రదర్శనలకు రూపకల్పన చేశారు. అప్పట్లో ఆమె చేసిన ప్రయోగాలు కథక్‌ నృత్యంలో విప్లవాత్మకమైన మార్పులకు నాంది పలికాయి. అయితే తీవ్రమైన ప్రతిఘటనను కూడా ఆమె ఎదుర్కోవాల్సి వచ్చింది. ‘‘పురాణ కథలను విడిచిపెట్టి, సాంఘిక సమస్యలను ఎంచుకున్నందుకు విమర్శకులు నా మీద విరుచుకుపడ్డారు. అదే విమర్శకులు పాతికేళ్ళ తరువాత... ‘కుముదిని కథక్‌ నృత్యానికి రక్షకురాలు’ అంటూ పొగిడారు. అంటే నేను వాళ్ళ కన్నా పాతికేళ్ళు ముందున్నాననే కదా అర్థం! అప్పట్లో నేను చేసిన ప్రయోగాలు నా గురువులకు కూడా నచ్చలేదు. ‘‘ఇది కథక్‌ కాదు’’ అనేవారు. తరువాత వాళ్ళే కాదు, ప్రతి ఒక్కరూ అదే మార్గాన్ని అనుసరించారు. కానీ వాటికి మూలకర్త నేననేది ఎక్కడా ప్రస్తావించలేదు. అయితే అనుకరణ కన్నా గొప్ప ప్రశంస మరేం ఉంటుంది?’’ అంటారు కుముదిని. ‘సంగీత నాటక అకాడమీ అవార్డ్‌’, ‘కాళిదాస సమ్మాన్‌’తో సహా ఎన్నో పురస్కారాలను ఆమె అందుకున్నారు. 1987లో ‘పద్మశ్రీ’, 2010లో ‘పద్మభూషణ్‌’ అందుకున్న కుముదినికి ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం ‘పద్మవిభూషణ్‌’ను ప్రకటించింది.


ghgljk;.jpg

అమ్మ మనసు

మత్తుమందులకూ, మద్యానికి బానిసలై చిన్న వయసులోనే రాలిపోతున్న వారిని చూసిన జుమ్దే యోమ్గామ్‌ గామ్లిన్‌ మాతృ హృదయం చలించిపోయింది. ఆ మహమ్మారుల నుంచి వారికి విముక్తి కలిగించాలనే తపన ఆమెను నిలువనివ్వలేదు. తనలాంటి మరో పదిమంది తల్లులతో కలిసి ‘ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవల్‌పమెంట్‌’ పేరుతో 2013లో అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఆలో పట్టణంలో ఒక ఎన్జీవోను ఆమె స్థాపించారు. ఆ తరువాత దాని పేరును ‘మదర్స్‌ విజన్‌’గా మార్చారు. ప్రభుత్వోద్యోగిగా పని చేస్తూనే... ఈ సంస్థ కార్యకలాపాలను కొనసాగించారు. మత్తుపదార్థాల వాడకం వల్ల కలిగే దుష్ఫ్రభావాలపై విద్యాసంస్థల్లో పిల్లలకు అవగాహన కలిగించడం, సామాజిక, చర్చా సమావేశాలను ఏర్పాటు చేయడంతోపాటు డ్రగ్స్‌ బాధితులకోసం ‘డిఅడిక్షన్‌, ఆఫ్టర్‌ కేర్‌’ కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ముప్ఫై పడకలు ఉన్న ఈ కేంద్రం ద్వారా 700 మందికి పైగా ఆ వ్యసనాల నుంచి బైటపడ్డారు. దీనితోపాటు రెండువేల మంది మహిళలకు ఒకేషనల్‌ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి, వారి ఆర్థిక స్వావలంబనకు దోహదం చేశారు. స్థానిక మహిళలు, సంఘాలు, జిల్లా అధికారుల సాయంతో.... అప్పర్‌ సియాంగ్‌ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో విస్తృతంగా ఉన్న మార్జువానా, ఓపియం సాగును నిర్మూలించారు.

డ్రగ్స్‌, మద్యానికి వ్యతిరేకంగానే కాకుండా ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహనను పెంచడం కోసం ‘మదర్స్‌ విజన్‌’ విస్తృతంగా పని చేస్తోంది. మహిళలకు జీవనోపాధి అవకాశాల పెరుగుదలకోసం పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ‘‘మత్తు పదార్థాలకు బానిసలైన వారిని వాటి నుంచి బయటకు తీసుకురావడం అనేది క్లిష్టమైన, అనేక సవాళ్ళతో కూడుకున్న అంశం. బాధితులు, వారి కుటుంబాలు, ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు కలిసి పని చేసినప్పుడే అది సాధ్యమవుతుంది. బాధితులను ముందుగానే గుర్తించి, వారికి సమగ్రమైన చికిత్స అందించడం, చికిత్సానంతర సహాయాన్ని అందించడం కీలకం అవుతుంది’’ అని చెబుతున్న జుమ్దే జిల్లాపరిషత్‌ సభ్యురాలుగా కూడా సేవలందించారు. కిందటి ఏడాది .ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ రిఫార్మ్స్‌ అండ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌’ (ఐఎ్‌సఆర్‌హెచ్‌ఇ) నుంచి ‘భారత్‌ విభూషణ్‌’ పురస్కారాన్ని ఆమె స్వీకరించారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం తనకు ‘పద్మశ్రీ’ని ప్రకటించడంపై స్పందిస్తూ ‘‘ఈ పురస్కారం నాకు ఎంతో సంతోషాన్నిస్తోంది. నిజాయితీతో కూడిన మంచి ప్రయత్నాలకు గుర్తింపు లభించకపోవడం అనేది జరగదు. ఎప్పటికైనా వాటికి ప్రతిఫలం ఉంటుంది. దానికి ఇదే నిదర్శనం’’ అని చెప్పారు యాభై తొమ్మిదేళ్ళ జుమ్దే.


మహాత్ముడి అడుగుజాడల్లో...

రాధా బహిన్‌ భట్‌కు పద్మశ్రీ పురస్కారం వచ్చిందన్న వార్త వినగానే, ఆమె గురించి తెలిసినవారిలో ‘‘అదేమిటి? ఇప్పటివరకూ ఆమెకు ఆ గౌరవమే దక్కలేదా?’’ అని విస్మయం వ్యక్తం చేసేవారే ఎక్కువ. ఎందుకంటే... జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ఎన్నో గౌరవాలను ఆమె ఇప్పటికే అందుకున్నారు. గతంలో నోబెల్‌ శాంతి బహుమతికి సైతం ఆమె నామినేట్‌ అయ్యారు. వీటన్నిటికన్నా తనను సంతోషపరిచేవి తన ఉద్యమ ఫలితాలు, తద్వారా ప్రజలకు చేకూరే ప్రయోజనాలేనంటారు ‘పర్వతాల గాంధీ’గా పేరుపొందిన రాధా బహిన్‌. ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని అల్మోరా జిల్లాలో దుర్కా గ్రామంలో 1933లో ఆమె జన్మించారు. చిన్నవయసునుంచి ఉపాధ్యాయురాలు కావాలనేది ఆమె కోరిక. ఇంటర్‌ పూర్తి చెయ్యగానే... కౌసానీ గ్రామంలోని ‘లక్ష్మీ ఆశ్రమ్‌’ (కస్తూర్బా మహిళా ఉత్థాన్‌ మండల్‌)లో టీచర్‌గా చేరారు. గాంధీ శిష్యురాలైన సరళా బెహెన్‌ ఈ ఆశ్రమ వ్యవస్థాపకురాలు. గాంధేయవాదం పట్ల రాధా బహిన్‌కు ఉన్న ఆసక్తి... సరళ మార్గదర్శకత్వంలో మరింత బలపడింది. తరువాత అదే సంస్థకు 1966 నుంచి 1989 వరకు కార్యదర్శిగా వ్యవహరించారు, ప్రస్తుతం అధ్యక్షురాలుగా ఉన్నారు. ‘సర్వోదయ-భూదాన్‌’ ఉద్యమంలో 1957 నుంచి 1961 వరకూ ఆమె చురుగ్గా పాల్గొన్నారు. ఆచార్య వినోబా భావేతో కలిసి ఉత్తరప్రదేశ్‌, అసోం రాష్ట్రాల్లో సుదీర్ఘ పాదయాత్రల్లో భాగస్వామి అయ్యారు. ఈ యాత్రల సందర్భంగా గ్రామస్వరాజ్యం, మద్యవ్యతిరేక ఉద్యమం, మహిళా సాధికారత గురించి ఆమె విస్తృతంగా ప్రచారం చేశారు. ఆ తరువాత గ్రామీణ పునర్నిర్మాణం, మాదకద్రవ్యాల వ్యతిరేక పోరాటాలు, చిప్కో ఉద్యమం, తెహ్రీ డ్యామ్‌ ఉద్యమం, గనుల అక్రమ తవ్వకాల వ్యతిరేక ఉద్యమాలు, నదుల పరిరక్షణ ఉద్యమం...

yhjuk.jpg

ఇలా ఎన్నో కార్యక్రమాలకు సారథ్యం వహించారు. అడవుల పరిరక్షణ ఆవశ్యకతను చాటిచెబుతూ 1975లో 75 రోజుల పాటుదీర్ఘ పాదయాత్ర నిర్వహించారు. 2006 నుంచి 2010 వరకూ ఉత్తరాఖండ్‌లోని నదులు, హిమాలయాలపై ఆమె సర్వే నిర్వహించారు. నదులపై హైడ్రో పవర్‌ ప్రాజెక్టుల నిర్మాణాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. గత ఆరు దశాబ్దాలుగా నార్వే, ఫిన్లాండ్‌, అమెరికా, డెన్మార్క్‌, కెనడా, స్వీడన్‌ తదితర అనేక దేశాల్లోని మానవ, మహిళా హక్కుల ఉద్యమాలతో మమేకమయ్యారు. అల్మోరా, ఫితోరాఘడ్‌ జిల్లాల్లో లక్షా అరవై వేల మొక్కలను నాటి... పర్యావరణ పరిరక్షణకు దోహదం చేశారు. మారుమూల, పర్వత ప్రాంతాల్లో పాతిక బాలమందిర్‌లను ఏర్పాటు చేసి, 15 వేల మందికి పైగా పిల్లలకు విద్యను అందించారు. ‘హిమాలయ సేవాసంఘ్‌’, ‘గాంధీ పీస్‌ ఫౌండేషన్‌’, ‘గాంధీ మెమోరియల్‌ ఫండ్‌’, ‘కస్తూర్బా ట్రస్ట్‌’ లాంటి ఎన్నో సంస్థలతో కలిసి ఆమె పని చేస్తున్నారు. గుజరాత్‌లోని సేవా ఆశ్రమ్‌లో నివసిస్తున్న రాధా బహిన్‌ ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నానన్నారు. ప్రస్తుతం ‘నౌలా’ పేరుతో కౌసానీ చుట్టుపక్కల ఉన్న జలవనరులు, కాలువల పునరుద్దరణ లక్ష్యంగా ఉద్యమాన్ని ఆమె సాగిస్తున్నారు.


ఎనభయ్యేళ్ళ కళాయజ్ఞం

అర్థరాత్రి దాటింది. చీకటి పడగానే ఊళ్ళో రచ్చబండ దగ్గరకు చేరుకున్న ప్రేక్షకులెవరూ అక్కడి నుంచి కదల్లేదు. వారి ఆసక్తిని గ్రహించిన భీమవ్వ దొడ్డబల్లప్ప సిలేక్యా తార తన వయోభారాన్ని లెక్క చెయ్యకుండా ప్రదర్శన ఇస్తూనే ఉన్నారు. మధ్యమధ్యలో కథలు చెబుతూ వారిని అలరిస్తూనే ఉన్నారు. తెల్లవారుజామువరకూ కొనసాగిన ‘తొగలు గొంబెయాట’ (తోలు బొమ్మలాట) ప్రేక్షకుల కరతాళ ధ్వనుల మధ్య ముగిసింది. భీమవ్వలో అలసట కన్నా ఆనందమే ఎక్కువగా కనిపించింది. ఎనభయ్యేళ్ళుగా ఆమె ఆ కళా యజ్ఞంలో ఏమాత్రం అలసిపోలేదు. పధ్నాలుగేళ్ళ వయసులో... కుటుంబ వారసత్వంగా అందిపుచ్చుకున్న తోలుబొమ్మలాటకు ఆమె కొత్తదనాన్ని జోడించారు. రామాయణ, మహాభారత గాథలను తోలుబొమ్మలాట రూపంలో చెబుతున్నారు. ప్రాథమికమైన చదువుకూడా లేని ఆమెకు ‘మహా భారతం’లోని పద్ధెనిమిది పర్వాల గురించి క్షుణ్ణంగా తెలుసు. ఆ ఘట్టాలను తోలుబొమ్మలతో ప్రదర్శించడంతోపాటు... మారుతున్న కాలానికి అనుగుణంగా సామాజిక, పర్యావరణ అంశాలను కూడా తన ప్రదర్శనలో మిళితం చేసి, నవతరాన్ని ఆకర్షిస్తున్నారు. ఉత్తర కర్ణాటకలోని మోరనలా గ్రామంలో భీవవ్వ జన్మించారు. ఆ గ్రామానికి చెందిన వారు తరతరాలుగా తోలుబొమ్మలాటలో ప్రసిద్ధి చెందారు. అదే మార్గాన్ని భీమవ్వ అనుసరించారు. మన దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు అమెరికా, ఫ్రాన్స్‌, ఇరాక్‌, ఇరాన్‌, హాలెండ్‌, స్విట్జర్లాండ్‌, జర్మనీ, సౌదీ అరేబియా, జపాన్‌... ఇలా కొన్ని పదుల దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చి ‘భేష్‌’ అనిపించుకున్నారు. అంతేకాదు, ఈ కళ అంతరించిపోకుండా ఉండాలనే ఆలోచనతో ఎందరికో శిక్షణ ఇచ్చారు. భీమవ్వ కుమారులు విరూపాక్ష, యంకప్ప, కేశప్పలతో పాటు, మనుమలు, మునిమనుమలు కూడా ఇప్పుడు ఈ వృత్తిలోనే కొనసాగుతున్నారు. ‘జానపదశ్రీ’, ‘సంగీత, నాటక అకాడమీ’, ‘కర్ణాటక రాజ్యోత్సవ’ అవార్డులతో సహా ఎన్నో పురస్కారాలను అందుకున్నారు. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని ఆమెకు ప్రకటించింది. దీనిపై స్పందిస్తూ ‘‘నా కళకు ఇంత పెద్ద పురస్కారం లభించడం గర్వంగా అనిపిస్తోంది. అది కళకు లభించిన గౌరవం. తోలుబొమ్మలాటకు దీనివల్ల మరింత ఆదరణ లభిస్తుందని ఆశిస్తున్నాను’’ అన్నారు భీమవ్మ. ఆధునిక వినోద రూపాల మధ్య ఉనికిని కోల్పోతున్న తోలుబొమ్మలాటకు పూర్వవైభవం తెచ్చిన ఘనత ఆమెదేనంటారు అభిమానులు.


మరిన్ని తెలుగు వార్తల కోసం..

Also Read: ఆప్‌కి మద్దతుగా అఖిలేష్ ఎన్నికల ప్రచారం

Also Read: నీ ఇంట్లో నుంచి అవార్డు ఇస్తున్నావా సంజయ్..!

Also Read:ఆర్చర్ జ్యోతి సురేఖకు ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఇవ్వాలి

Also Read: అమెరికాలో ఘనంగా గణతంత్ర వేడుకలు.. రాజ్యాంగం గొప్పతనాన్ని వివరించిన వక్తలు

Updated Date - Jan 29 , 2025 | 01:32 AM