Winter Lung Care Tips: చలిలో శ్వాస సాఫీగా...
ABN , Publish Date - Dec 30 , 2025 | 06:23 AM
చలికాలం ఊపిరితిత్తులకు పరీక్షా కాలం. పొడి గాలులు, తేమ లోపించిన చల్లని వాతావరణాలతో శ్వాసకోస సమస్యలు వేఽధించకుండా ఉండాలంటే ఈ కాలంలో కొన్ని జాగ్రత్తలు తప్పక పాటించాలంటున్నారు వైద్యులు....
ఊపిరితిత్తుల ఆరోగ్యం చలికాలం ఊపిరితిత్తులకు పరీక్షా కాలం. పొడి గాలులు, తేమ లోపించిన చల్లని వాతావరణాలతో శ్వాసకోస సమస్యలు వేఽధించకుండా ఉండాలంటే ఈ కాలంలో కొన్ని జాగ్రత్తలు తప్పక పాటించాలంటున్నారు వైద్యులు.
వేసవికి భిన్నంగా ఈ కాలంలో వ్యాధికారక సూక్ష్మక్రిములైన వైర్‌సలు, బ్యాక్టీరియాలు వాతావరణంలో బ్రతికి ఉంటాయు. కాబట్టి అవి సులభంగా ఒకరి నుంచి మరొకరికి సోకుతూ ఉంటాయి. అలాగే చలి వల్ల ఎక్కువ సమయాల పాటు ఇంట్లో గడపడం వల్ల కూడా ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్లు పెరుగుతూ ఉంటాయి. ఇన్‌ఫ్లూయెంజా ఈ కోవకు చెందినదే! అలాగే రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్, ఎడినోవైర్‌సలు కూడా ఈ కాలంలో విపరీతంగా వ్యాపిస్తాయి. అలాగే ఉబ్బసం, సిఒపిడి రోగుల శ్వాసనాళాలు ఇరుకుగా ఉంటాయి. ఈ కాలంలో చల్లని గాలి పీల్చుకున్నప్పుడు ఆ శ్వాస మార్గాలు మరింత ఇరుకుగా మారిపోయి అటాక్స్ వేధించడం మొదలుపెడతాయి. ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకోవలసిన అవసరం కూడా కొందర్లో తలెత్తుతూ ఉంటుంది.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
చలి కాలంలో ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారు, లేని వారు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. అవేంటంటే...
స్కార్ఫ్, మాస్క్: ఈ కాలంలో తేమ తగ్గిపోయి గాలి పొడిగా, చల్లగా మారిపోతుంది. ఈ గాలిని పీల్చుకోవడం వల్ల చెడు పార్టికల్స్‌ను వెలుపలికి పంపించడానికి తోడ్పడే ఊపిరితిత్తుల్లోని సిలియా ప్రభావం కూడా సన్నగిల్లుతుంది. కాబట్టి ముక్కు, నోరు కప్పి ఉంచే స్కార్ఫ్‌ను ఉపయోగించాలి. స్కార్ఫ్ వల్ల పీల్చుకునే గాలి కొంతమేరకు వెచ్చబడి సమస్యకు అడ్డుకట్ట పడుతుంది. ఇన్‌ఫెక్షన్ల వ్యాప్తిని అరికట్టడం కోసం ఊపిరితిత్తులు, గుండె జబ్బులున్నవాళ్లు, మధుమేహులు, వృద్ధులు, పిల్లలు తప్పనిసరిగా ఎన్ 95 మాస్క్ పెట్టుకోవాలి. దీన్ని ఉపయోగించలేనివాళ్లు వస్త్రంతో తయారుచేసుకున్న మాస్క్ లేదా సర్జికల్ మాస్క్ వాడుకోవచ్చు.
ఊపిరితిత్తుల సమస్యలున్నవాళ్లు: ఈ కోవకు చెందిన వాళ్లు చలి ఎక్కువగా ఉండే, ఉదయం, సాయంత్రం ఇళ్లకే పరిమితం కావాలి.
నీరు: వాతావరణం పొడిగా మారిపోతుంది కాబట్టి శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలి. అందుకోసం సరిపడా గోరువెచ్చని నీళ్లు తాగాలి
యాంటీఆక్సిడెంట్లు: ఈ పోషకాలు ఎక్కువగా ఉండే పండ్లు, నట్స్ తరచూ తింటూ ఉండాలి. వీటితో ఇన్‌ఫెక్షన్లతో సమర్థంగా పోరాడే రోగనిరోధకశక్తి బలపడుతుంది
వ్యాక్సిన్లు: ఇన్‌ఫ్లుయెంజా, న్యుమోకోకస్ సోకకుండా హై రిస్క్ గ్రూప్‌కు చెందిన వాళ్లందరూ వర్షాకాలం ప్రారంభంలో ఈ టీకాలు తీసుకోవాలి. ఇన్‌ఫ్లుయెంజాకు ప్రతి ఏడాదీ కొత్త వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఏటా ఈ వ్యాక్సిన్ తీసుకోవాలి. న్యూమోకోక్‌సకు జీవితకాల రక్షణను కల్పించే ఏకైక వ్యాక్సిన్ లేదా ఐదేళ్లకు ఒక వ్యాక్సిన్ తీసుకుంటే సరిపోతుంది. వచ్చే ఏడాది నుంచి ఆర్‌ఎ్‌సవి వ్యాక్సిన్ అందుబాటులోకి రాబోతోంది. దీన్ని కూడా తీసుకోవడం మంచిది.
పొగమంచు ముప్పు
చలి కాలంలో చల్లదనంతో పాటు, మంచులో కలిసే కాలుష్యం బెడద కూడా ఎక్కువే! ఈ కాలంలో పర్యావరణ గాలి కాలుష్యం పెరిగిపోతుంది. ఉత్తర భారతదేశంతో పాటు దక్షిణ భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఈ సమస్య పెరుగుతోంది. చలికాలం ఉదయం వేళల్లో కలుషితాలు కలిసిన పొగమంచు కిందకు చేరుకుంటుంది. దీన్ని పీల్చుకోవడం వల్ల ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తుతాయి. గాల్లో కలిసే చిన్న చిన్న ధూళి రేణువులు, కార్బన్ రేణువులు, ఇతరత్రా కర్మాగార రేణువులన్నీ 2.5 మైక్రాన్స్ కంటే చిన్నవిగా ఉంటాయి. ఇవి ఊపిరితిత్తుల్లోని ఆల్వియోలా వరకూ చేరుకుంటాయి. ఇంతకంటే పెద్ద రేణువులను మన ముక్కు అడ్డుకుంటుంది. కాబట్టి మన పర్యావరణంలో ఈ సూక్ష్మ రేణువులు ఎంత ఎక్కువగా ఉంటే, గాలి ఊపిరితిత్తులకు అంత ఎక్కువ ప్రమాదం. గాల్లో కలిసిన ఈ 2.5 మైక్రాన్స్ రేణువుల ఆధారంగానే గాలి నాణ్యతను అంచనా వేస్తారు. అవి 50 కంటే తక్కువగా ఉంటే గాలి నాణ్యత బాగుందని అర్థం. 50 - 100 ఉంటే ఫరవాలేదనీ, 100 కంటే ఎక్కువ ఉంటే హానికరమనీ, 150 కంటే ఎక్కువ ఉంటే అత్యంత హానికరమనీ అర్థం. కానీ ప్రస్తుత ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అన్ని ప్రధాన నగరాల్లో 100కు మించి 3,00, 400, 500 ఉంటోంది. ప్రమాదకరమైన పరిస్థితి ఇది. ఈ గాలిని పీల్చుకోవడం రెండు సిగరెట్లు తాగడంతో సమానం. కాబట్టి ఈ ప్రమాదం నుంచి రక్షణ పొందడం కోసం...
తెల్లవారుఝామున, సాయంకాలం, ట్రాఫిక్ ఎక్కువగా ఉండే సమయాల్లో బయటకు వెళ్లకపోవడం మంచిది. ప్రధానం ఉబ్బసం, సిఒపిడి, లంగ్ సమస్యలున్నవాళ్లు రెట్టింపు జాగ్రత్తగా ఉండాలి
అధిక ట్రాఫిక్ కలిగి ఉండే దగ్గరి దారులను ఎంచుకోడానికి బదులుగా తక్కువ ట్రాఫిక్‌ను కలిగి ఉండే దూరపు దారులను ఎంచుకోవాలి
కిటికీలు మూసిన కారు, బస్సుల్లో ప్రయాణించాలి. బైక్స్ మీద ప్రయాణించేవాళ్లు మాస్క్ వాడుకోవాలి
వ్యాయామాలు చేసే సమయంలో సాధారణ మోతాదుకు ఐదు రెట్లు ఎక్కువ సార్లు ఊపిరి పీల్చుకుంటాం. కాబట్టి గాలి కాలుష్యం, చల్ల గాలి ఎక్కువగా ఉండే ఈ కాలంలో ఆరుబయట వ్యాయామాలు చేయకూడదు.

ఇలా అప్రమత్తం
సాఽధారణ పారాసెటమాల్, దగ్గు మందులతో 48 గంటల్లో జ్వరం, జలుబు, దగ్గు లాంటివి తగ్గిపోతాయి. ఈ మందులతో లక్షణాలు అదుపులోకి రానప్పుడు వెంటనే వైద్యులను కలవాలి. అలా చేయడం వల్ల ఇన్‌ఫెక్షన్ ఊపిరితిత్తులకు చేరుకుని, న్యుమోనియాగా మారి, ఆక్సిజన్ తగ్గిపోయి ఆస్పత్రిలో చేరే పరిస్థితి తప్పుతుంది. ఇన్‌ఫ్లుయెంజాకు, ఒసెల్‌టమివిర్ అద్భుతమైన యాంటీవైరల్ ఔషథం. అయితే లక్షణాలు మొదలైన ఐదు రోజుల్లోపే ఈ మందు తీసుకోగలిగితే మంచి ప్రభావం కనిపిస్తుంది. ఆలస్యమైతే మందు ప్రభావాన్ని కనబరచలేదు. కాబట్టి వీలైనంత త్వరగా వైద్యులను కలిసి సమస్యకు తగిన చికిత్స తీసుకోవాలి. ఊపిరితిత్తులు, గుండె సమస్యలు, మధుమేహం ఉన్నవాళ్లు దగ్గు, జలుబు, గొంతునొప్పి, జ్వరాలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను కలిసి, చికిత్స తీసుకోవాలి.
వెచ్చదనం కోసం హీటర్లు
ఈ కాలంలో ఎక్కువ మంది హీటర్లను వాడుకుంటూ ఉంటారు. అయితే పొడి వేడి మంచిది కాదు. తేమ కూడా సరైన మోతాదుల్లో ఉండేలా చూసుకోవాలి. సాధారణంగా హీటర్లలో బ్లోవర్స్, హీటర్స్ అనే రెండు రకాలుంటాయి. ఎయిర్ బ్లోవర్స్ వేడి గాలిని విడుదల చేస్తాయి కాబట్టి వీటికి బదులుగా రేడియెంట్ హీటర్లను
ఎంచుకోవాలి
డాక్టర్ వి. నాగార్జున మాటూరు,
సీనియర్ ఇంటర్వెన్షనల్ పల్మొనాలజిస్ట్,
యశోద హాస్పిటల్స్, హైటెక్ సిటీ,
హైదరాబాద్
ఇవి కూడా చదవండి
వివాహ వేడుకలోకి అతిథుల్లా వచ్చారు.. అంతా చూస్తుండగానే..
బురదలో ఆహారం కోసం వెతుకుతున్న చిరుత.. చివరకు ముందున్న దృశ్యం చూసి..